న్యూయార్క్ టైమ్స్ పై ట్రంప్ దావా ..రూ. 1.32 లక్షల కోట్లకు పరువునష్టం దావా

న్యూయార్క్ టైమ్స్ పై ట్రంప్ దావా ..రూ. 1.32 లక్షల కోట్లకు పరువునష్టం దావా
  • తనపై తప్పుడు ఆర్టికల్స్ ప్రచురించిందని ఆరోపణలు  

న్యూయార్క్: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరో ప్రముఖ దినపత్రికపై పరువు నష్టం దావా వేశారు. తనపై కొన్ని దశాబ్దాలుగా తప్పుడు, అబద్ధపు ఆర్టికల్స్ ప్రచురిస్తోందంటూ న్యూయార్క్ టైమ్స్ పత్రికపై ఆయన సోమవారం రాత్రి ఫ్లోరిడాలోని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టులో లాసూట్ దాఖలు చేశారు. తనపై అబద్ధాలతో కూడిన ఆర్టికల్స్ రాసినందుకు, తనకు వ్యతిరేకంగా ఓ పుస్తకాన్ని సైతం వెలువరించినందుకు గాను న్యూయార్క్ టైమ్స్ పై, ఆ పత్రికలో పని చేస్తున్న నలుగురు జర్నలిస్టులపై ట్రంప్ దావా వేశారు.

 2024 అధ్యక్ష ఎన్నికలకు ముందు తన ప్రతిష్టను దెబ్బతీసేలా ఆ పత్రికకు చెందిన ఇద్దరు జర్నలిస్టులు బుక్ రిలీజ్ చేశారని పేర్కొన్నారు. తనకు పరువు నష్టం కలిగించినందుకు గాను పరిహారంగా 15 బిలియన్ డాలర్లు (రూ. 1.32 లక్షల కోట్లు) చెల్లించాలని కోరారు. ‘‘ఆ పత్రిక, జర్నలిస్టులు తప్పు అని తెలిసి కూడా.. వాటినే నిజాలుగా రాశారు.

 నాపై నిర్లక్ష్యంగా, తప్పుడు వ్యాఖ్యానం చేశారు. నాపై బురదజల్లడం ద్వారా నా ప్రతిష్టను దిగజార్చాలన్న ఉద్దేశంతో అబద్ధాలను వండి వార్చారు” అని ట్రంప్ తన లాసూట్ లో పేర్కొన్నారు. రాడికల్ లెఫ్ట్ విధానాలను అనుసరిస్తున్న డెమోక్రటిక్ పార్టీకి ఆ పత్రిక ఒక మౌత్ పీస్ గా మారిపోయిందని ఆరోపణలు చేశారు. న్యూయార్క్ టైమ్స్ పత్రికపై లాసూట్ వేసిన విషయాన్ని ట్రంప్ మంగళవారం తన ట్రూత్ సోషల్ వేదికగా కూడా వెల్లడించారు.

ది వాల్ స్ట్రీట్ జర్నల్ పైనా..  

అమెరికన్ ఫైనాన్షియర్, చైల్డ్ సెక్స్ నేరగాడు జెఫ్రీ ఎప్ స్టీన్ (2019లో చనిపోయాడు) జన్మదినం సందర్భంగా గతంలో ఆయనకు ట్రంప్ బర్త్ డే నోట్ పంపారంటూ న్యూయార్క్ టైమ్స్ గత వారం ఆర్టికల్స్ పబ్లిష్ చేసింది. దీంతో ఆ బర్త్ డే నోట్ పై ఉన్న సంతకం తాను చేయలేదని, న్యూయార్క్ టైమ్స్ అబద్ధపు కథనాన్ని వండి వార్చిందని ట్రంప్ ఖండించారు. 

తాజాగా దీనిపైనా లాసూట్ ఫైల్ చేశారు. అయితే, ఈ దావాపై న్యూయార్క్ టైమ్స్ పత్రిక నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. కాగా, జెఫ్రీ ఎప్ స్టీన్ ఫైల్స్ కేసులో ట్రంప్ కూ సంబంధాలు ఉన్నాయంటూ కథనం ప్రచురించిన ది వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రికపై, ఆ పత్రిక ఓనర్ రూపర్డ్ మర్దోక్ పైనా గత జులైలో ట్రంప్ లాసూట్ ఫైల్ చేశారు.