
- మేం యుద్ధాలను కోరుకోం.. శాంతినే ప్రోత్సహిస్తామని వెల్లడి
బీజింగ్/ లూబియానా(స్లొవేనియా): చైనాపై 50 నుంచి 100 శాతం టారీఫ్‌లు విధిస్తామని బెదిరింపులకు దిగిన అమెరికాకు డ్రాగన్ కంట్రీ కౌంటర్ ఇచ్చింది. యుద్ధాలతో సమస్యలు పరిష్కారం కావని, ఆంక్షలు విధించడం లాంటి చర్యలు సమస్యలను మరింత కఠినతరం చేస్తాయని హెచ్చరించింది. రష్యా నుంచి ఆయిల్ కొంటున్న చైనాపై 50 నుంచి 100 శాతం టారీఫ్‌లు విధించాలని నాటో దేశాలకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సూచించగా, దీనిపై చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌యీ స్పందించారు.
ఆయన శనివారం స్లొవేనియా రాజధాని లూబియానాలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ట్రంప్ కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు. తాము యుద్ధాలను కోరుకోమని, శాంతినే ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. ‘‘మేం యుద్ధాల్లో పాల్గొనం.. అందుకు ప్రణాళికలు కూడా వెయ్యం. మేం ఎప్పుడూ శాంతినే కోరుకుంటం. సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకునేలా ప్రోత్సహిస్తం” అని తెలిపారు. యుద్ధాలతో సమస్యలు పరిష్కారం కావని, ఆంక్షలు విధిస్తే అవి మరింత కఠినంగా మారుతాయని హెచ్చరించారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఘర్షణపూరిత వాతావరణం నెలకొన్నదని, ఇలాంటి తరుణంలో మల్టీలాటరిజంను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. చైనా, యూరప్ శత్రువులుగా కాకుండా స్నేహితులుగా ఉండాలని.. కొట్లాడుకోవడానికి బదులు ఒకరికొకరు సహకరించుకోవాలని సూచించారు.
ట్రంప్ ఏమన్నారంటే..?
ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్న దేశాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టార్గెట్ చేశారు. యుద్ధం ముగించేలా రష్యాపై ఒత్తిడి తేవాలని.. ఆ దేశం నుంచి ఆయిల్ కొంటున్న భారత్, చైనాను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ రెండు దేశాలు ఆయిల్ కొనుగోలు కోసం చెల్లిస్తున్న డబ్బులతోనే రష్యా యుద్ధం చేస్తున్నదని నిందిస్తున్నారు. ఈ క్రమంలో రష్యాపై ఆంక్షలు విధించేందుకు సిద్ధమని ట్రంప్ ఇటీవల ప్రకటించారు.
అయితే నాటో మిత్ర దేశాలన్నీ రష్యా నుంచి ఆయిల్ కొనడం ఆపేస్తేనే ఇలాంటి చర్యలకు తాను రెడీ అని చెప్పారు. ఇప్పటికీ నాటో కూటమిలోని కొన్ని దేశాలు రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాయని, ఇది చాలా షాకింగ్ విషయమని పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు నాటో కూటమి చర్చల శక్తిని బలహీనపరుస్తాయని వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం ముగించేవరకూ చైనాపై నాటో కూటమి దేశాలు 50 నుంచి 100 శాతం టారిఫ్‌లు వేయాలని సూచించారు.