గ్రీన్లాండ్ ఆక్రమణ జరిగితే దుష్పరిణామాలు అనేకం..ట్రంప్ వ్యాఖ్యలతో గ్రీన్ ల్యాండ్ భద్రతకు ప్రమాదం

గ్రీన్లాండ్ ఆక్రమణ జరిగితే దుష్పరిణామాలు అనేకం..ట్రంప్ వ్యాఖ్యలతో గ్రీన్ ల్యాండ్ భద్రతకు ప్రమాదం

ప్రపంచ ఆధిపత్యం కొనసాగిస్తున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్  ‘నాటో’ సభ్య దేశమైన  డెన్మార్క్​కు చెందిన  స్వయం ప్రతిపత్తి ప్రాంతం గ్రీన్​ల్యాండ్​పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  ‘ప్రపంచ శాంతి కోసం, రష్యా, చైనా నుంచి రక్షించడం కోసం గ్రీన్​ల్యాండ్​ను 100% సాధించి తీరుతాం’ అని ట్రంప్​  ప్రకటించారు. దీంతో  గ్రీన్​ల్యాండ్ భద్రత నేడు ప్రమాదంలో పడింది. 

ఖండాలుగా ఉన్న ఆస్ట్రేలియా, అంటార్కిటికాలను కాక దీవులపరంగా చూస్తే  ప్రపంచంలో అతిపెద్ద దీవి  గ్రీన్​ల్యాండ్.   గ్రీన్​ల్యాండిక్​  భాష మాట్లాడే ఈ దేశంలో  రాజ్యాంగబద్ధ  రాజరికం గల  పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కొనసాగుతోంది. 1814లో  డేనిష్ వలసగా మారిన ఈ ప్రాంతం 1953లో డెన్మార్క్ రాజ్యభాగంగా మారి 1979లో  స్వాతంత్ర్యం పొందింది. 2009 నుంచి  రక్షణ, విదేశీ సంబంధాలు తప్ప పూర్తిస్థాయి స్వయం ప్రతిపత్తిని డెన్మార్క్ కల్పించింది.  ఐక్యరాజ్యసమితిలో  సభ్యత్వం పొందగల  సార్వభౌమ హోదా గ్రీన్​లాండ్​కు లేదు. 

గ్రీన్​లాండ్​ను సరైన మార్గంలో  కొనుగోలు చేయడం లేదా  ఆక్రమణ ద్వారానైనా తమ అధీనంలోకి తీసుకుంటామని చెబుతున్న ట్రంప్ అమెరికా  జాతీయ భద్రత కోసం గ్రీన్​లాండ్ ఆక్రమణ అత్యవసరం అంటున్నారు. ఆర్కిటిక్ ప్రాంతంలో  రష్యా ప్రభావాన్ని నివారించడం, నాటోలో అమెరికా బలాన్ని పెంచుకోవడం, వాణిజ్య ప్రయోజనాలు, అంతర్జాతీయ వ్యూహాత్మక  రక్షణ ప్రణాళిక, స్వదేశంలో తన విధానాలపై వస్తున్న వ్యతిరేకతను దృష్టి మళ్లించడం,  నానాటికి దిగజారుతున్న అమెరికా ఆర్థికవ్యవస్థ, డాలర్ ఆధిపత్యానికి ఎదురవుతున్న సవాళ్లు  మొదలైన కారణాలు గ్రీన్​లాండ్ ఆక్రమణ వెనుక దాగి ఉండవచ్చు.  అన్నిటికంటే ‘భవిష్యత్తు  ఖనిజ  గోదాం’గా చెపుతున్న  గ్రీన్​ల్యాండ్ వనరులే ట్రంప్​ను ఆకర్షిస్తున్నాయి. 

నేడు ప్రపంచాన్ని నడిపిస్తున్న టెక్నాలజీ, ఎలక్ట్రిక్ వాహనాలు, మొబైల్స్, మిస్సైల్స్, గ్రీన్ ఎనర్జీ, డిఫెన్స్ రంగాలలో ఉపయోగిస్తున్న అరుదైన లోహాలు గ్రీన్​ల్యాండ్​లో  పుష్కలంగా ఉన్నాయి.  గ్రీన్​లాండ్​లోని అనేక  ప్రాంతాలలో 1.5 మిలియన్ టన్నుల అరుదైన  ఖనిజాల నిల్వలు ఉన్నాయి.   రేర్  ఎర్త్ మినరల్స్ లభ్యతలో గ్రీన్​ల్యాండ్ ప్రపంచంలో ఎనిమిదవ స్థానంలో ఉంది. వీటితోపాటు అణు

శక్తికి అవసరమైన యురేనియం,  జింక్, లెడ్, నికెల్,  బంగారు నిల్వలు  కనుగొన్నారు. శాశ్వత మంచు పొరలు కరిగితే లేదా కరిగించగలిగితే ‘నీరు- నూతన చమురు’ అన్న భవిష్యత్తు వ్యూహం ద్వారా లాభం పొందాలనే ఆలోచన అమెరికాకు ఉంది. అదే సమయంలో చమురు సహజ వాయువు నిల్వలను అన్వేషించవచ్చు. ప్రపంచ వాణిజ్య, చమురు రవాణాకు కీలకంగా ఉన్న ఆర్కిటిక్ 
ప్రాంతాన్ని నియంత్రించడం, ఐస్ షీట్స్ కరిగాక కొత్త రేవు పట్టణాల అభివృద్ధి, ఇప్పటికే గ్రీన్ ల్యాండ్​లో అమెరికాకు ఉన్న 'థులే' ఎయిర్ బేస్ కు అదనంగా సైనిక స్థావరాలను నెలకొల్పాలన్న ఆకాంక్షలు  అమెరికాకు  ఉన్నాయి.

‘నాటో’  ఏం కానుంది?

రక్షకుడే భక్షకుడైనట్లుగా నాటో రక్షణ సైనిక కూటమిలో  సభ్యుడైన  అమెరికా మరో సభ్య దేశమైన  డెన్మార్క్  అధీనంలోని  గ్రీన్ ల్యాండ్​ను ఆక్రమించుకుంటే 1949లో ఏర్పడి నేటికీ 32 దేశాలతో కొనసాగుతున్న ఉత్తర అట్లాంటిక్ సంధీ వ్యవస్థ ఉనికి ప్రశ్నార్థకమవుతుంది.  

పాశ్చాత్య దేశాల ఆధిపత్యం అంతమై నాటో కూడా అంతమయ్యే అవకాశం ఉంది.  నాటో ఒప్పందంలోని ఆర్టికల్ 5 ప్రకారం ఒక సభ్య దేశంపై  జరిగే  దాడిని అన్ని సభ్య దేశాలపై  జరిగిన  దాడిగా  పరిగణిస్తారు.  నాటోలోని  బ్రిటన్,  పోలాండ్, బాల్టిక్ దేశాలు అమెరికా వైపు ఇతర నాటో దేశాలలో కొన్ని డెన్మార్క్  వైపు నిలిచి కూటమి విచ్ఛిన్నం కావచ్చు. ఇలా ఊహించడం హైపోథెటికల్​గా అనిపించవచ్చు.

కానీ,  ప్రస్తుత  అంతర్జాతీయ పరిణామాలను, ఆయా దేశాలు తమ జాతీయ ప్రయోజనాలకే  ప్రాధాన్యమిస్తూ ఒప్పందాలను  కాల రాస్తున్న తీరు చూస్తుంటే భవిష్యత్తులో ఏమైనా జరగవచ్చు అనిపిస్తోంది.  ఉక్రెయిన్, పాలస్తీనా,  వెనెజువెలా ఉదంతాల వల్ల ప్రతిష్ట  దెబ్బతిన్న  ఐక్యరాజ్యసమితి కూడా  గ్రీన్​లాండ్  విషయంలో ఏమీ చేయలేకపోవచ్చు. ఐక్యరాజ్యసమితి చార్టర్  2 (4) ప్రకారం ఏ దేశం కూడా మరొక దేశ భౌగోళిక సమగ్రతపై బలప్రయోగం చేయరాదు. కానీ,  అగ్రదేశాల వీటో అధికారం వల్ల ఐక్యరాజ్యసమితి ఏమీ చేయలేని  నిస్సహాయ స్థితిలో ఉంటున్నది. 

రష్యా, చైనా ఆధిపత్యం పెరగొచ్చు

అమెరికా  చర్య వల్ల   రష్యా, చైనా మరింత చురుకుగా సామ్రాజ్యవాదానికి దిగే అవకాశం ఉంది. ప్రజాస్వామ్య దేశాలు అస్థిరమైనవనీ వాదిస్తూనే చైనా తైవాన్ విలీనానికి పావులు కదపవచ్చు. నాటో విచ్ఛిన్నం అయితే ఆసియాలోనే కాకుండా, దక్షిణార్ధ గోళంలో తన పలుకుబడిని చైనా పెంచుకునే అవకాశం ఉంది. ఎల్.ఏ.సీపైన ఒత్తిడి పెంచి ఆసియాలో పెద్దన్నగా చైనా ప్రవర్తించే అవకాశం ఉంది. 

పాలస్తీనా, వెనెజువెలా, ఇరాన్, విషయంలో తటస్థ వైఖరి అవలంబిస్తున్న భారత్.. గ్రీన్​ల్యాండ్ విషయంలో కూడా మరోసారి యుఎన్ఓలో బలప్రయోగాన్ని వ్యతిరేకిస్తూనే, చర్చల ద్వారా, అంతర్జాతీయ చట్టాల ద్వారా సమస్యను ఆయా దేశాలు పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చే అవకాశం ఉంది.  ఎందుకంటే అమెరికా, నాటో దేశాలలో భారత్​కు దగ్గర సంబంధాలున్నాయి. అమెరికా  భారత్​కు  కీలక వ్యూహాత్మక భాగస్వామి మాత్రమేకాక  క్వాడ్​లో  సభ్య దేశం.

ప్రపంచమే ఆలోచించాలి!

గ్రీన్​ల్యాండ్ అమ్మకానికి లేదు అన్న డెన్మార్క్​వాదనను అమెరికా పరిగణనలోకి తీసుకోవాలి. భద్రతా మండలి తీర్మానం ద్వారా గ్రీన్​ల్యాండ్ ప్రజల స్వయం  నిర్ణయ హక్కును ప్రపంచ దేశాలు గుర్తించాలి.  దేశాల  ఆక్రమణలు అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమైనవిగా అంతర్జాతీయ న్యాయస్థానం ప్రకటించాలి.  గ్రీన్​ల్యాండ్​కు నాటో సంపూర్ణ మద్దతు ప్రకటించాలి. అమెరికాపై యూరోపియన్ యూనియన్ ఆంక్షలు విధించాలి. అమెరికాను ప్రపంచ యవనికపై ఒంటరి చేసేదెలా అని ప్రపంచమే ఆలోచించాల్సిన సమయమిది. 

-  తండ ప్రభాకర్ గౌడ్,  సోషల్​ ఎనలిస్ట్​-