రాష్ట్రంలో బీఫార్మసీ అడ్మిషన్లపై అయోమయం

రాష్ట్రంలో బీఫార్మసీ అడ్మిషన్లపై అయోమయం
  • ఎంసెట్ రిజల్ట్స్​ వచ్చి రెండు నెలలైనా పత్తాలేని కౌన్సెలింగ్​
  • ఇంకా పూర్తికాని కాలేజీల అఫిలియేషన్లు
  • కాలేజీల్లో సౌలత్​లు లేక సీట్లు తగ్గించిన పీసీఐ
  • ప్రైవేటు కాలేజీల్లో ఫీజులను ఖరారు చేయని టీఎఎఫ్​ఆర్సీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీఫార్మసీ అడ్మిషన్లపై అయోమయం నెలకొన్నది. టీఎస్​ఎంసెట్ ఫలితాలొచ్చి రెండు నెలలు కావొస్తున్నా కౌన్సెలింగ్ షెడ్యూల్​ రిలీజ్ కాలేదు. ఒకపక్క ప్రైవేటు కాలేజీల అఫిలియేషన్ల ప్రక్రియ ముగియలేదు. మరోపక్క ఆయా కాలేజీల్లో ఫీజులనూ టీఏఎఫ్​ఆర్సీ ఫైనల్ చేయలేదు. దీంతో బీఫార్మసీ కౌన్సెలింగ్ ఆలస్యమయ్యే చాన్స్​ ఉందని అధికారులు చెప్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 118 ఫార్మసీ కాలేజీలుండగా, 11 వేల వరకు సీట్లున్నాయి. ఈ ఏడాది ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) కాలేజీల్లో వసతుల్లేవని సీట్లు తగ్గించింది. పీసీఐ టీమ్స్​ తనిఖీల సందర్భంగా కొన్ని కాలేజీల్లో లెక్చరర్లు, ప్రిన్సిపాల్స్​ లేరని, ఉన్న వారికి జీతాలు సరిగా ఇవ్వడం లేదని బహిర్గతమైంది. దీంతో చాలా కాలేజీల్లో 2022–23 విద్యాసంవత్సరానికి సీట్లకు కోత పడింది. న్యాక్​ ఏ ప్లస్​ గ్రేడ్​ వచ్చిన ఓ ప్రైవేటు కాలేజీలోనూ ఫార్మసీ సీట్లను పీసీఐ తగ్గించింది. జేఎన్​టీయూ, ఓయూ, కాకతీయ తదితర వర్సిటీలూ కాలేజీల్లో తనిఖీలు పూర్తి చేసినా అఫిలియేషన్ ఇవ్వలేదు. ఏకంగా పీసీఐ టీమ్స్​ తప్పులు గుర్తించిన నేపథ్యంలో, జేఎన్టీయూ ఉన్న సీట్లలోనూ కోతలు పెడుతుందా లేక పీసీఐ ఇచ్చిన ఇన్​టెక్​కు పర్మిషన్ ఇస్తుందా అనే దానిపై అయోమయం నెలకొన్నది.

ఫీజులు ఖరారు కాలె...
స్టేట్​లోని 113 ప్రైవేటు బీఫార్మసీ కాలేజీల్లో 2022–25 బ్లాక్ పీరియడ్​కు ఫీజులను టీఏఎఫ్​ఆర్సీ ఖరారు చేయాల్సి ఉంది. గతంలోనే ప్రైవేటు కాలేజీల మేనేజ్​మెంట్లతో హియరింగ్​కు టీఏఎఫ్​ఆర్సీ డేట్లు ఇచ్చి.. రద్దు చేశారు. ఆ తర్వాత ఇప్పటి దాకా ఫీజులపై టీఏఎఫ్ఆర్సీ హియరింగ్ చేపట్టలేదు. హియరింగ్ చేసి, ఫీజులను ఖరారు చేసేందుకు మరింత టైమ్ పట్టే అవకాశముందని అధికారులు తెలిపారు.

స్టూడెంట్ల ఎదురుచూపులు
ఇంటర్ రిజల్ట్స్​ జూన్​ నెలాఖరులో రాగా, టీఎస్​ ఎంసెట్​ ఫలితాలు ఆగస్టులో వచ్చాయి. అగ్రికల్చర్ అండ్ మెడికల్ కేటగిరిలో 71,180 మంది క్వాలిఫై అయ్యారు. ప్రస్తుతం ఇంజనీరింగ్​ కౌన్సెలింగ్ నడుస్తుండగా, ఫార్మసీ కౌన్సెలింగ్​పై అధికారులు సప్పుడు చేయడం లేదు. మేలో పరీక్షలు రాసిన స్టూడెంట్లు, ఫార్మసీలో చేరేందుకు 4నెలలుగా ఎదురుచూస్తున్నారు.