
హైదరాబాద్, వెలుగు : టీఎస్ ఎడ్‌సెట్ -2023 కౌన్సెలింగ్ షెడ్యూల్ వచ్చేసింది. దీనికి సంబంధించిన వివరాలను హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ (టీఎస్ సీహెచ్ఈ) చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ఎడ్‌సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ పీ. రమేశ్ బాబుతో కలిసి గురువారం వెల్లడించారు. ఈ షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 19న ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ కానుంది.
ఎడ్‌సెట్ కౌన్సెలింగ్‌కు సంబంధించిన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెల 20వ తేదీ నుంచి 30 వరకు కొనసాగనుంది. అక్టోబర్ 3 నుంచి 5వ తేదీదాకా వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. అదే నెల 6న వెబ్ ఆప్షన్ల ఎడిట్ నిర్వహించి, 9న ఫస్ట్ ఫేజ్ సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు అక్టోబర్ 13లోగా కాలేజీల్లో రిపోర్టు చేయాలని అధికారులు సూచించారు. అక్టోబర్ 30 నుంచి బీఈడీ క్లాసులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.
పీఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇలా..
పీఈసెట్ కౌన్సెలింగ్ కు సంబంధించిన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, వెరిఫికేషన్, ఆన్‌లైన్ పేమెంట్ వంటి అంశాలు ఈ నెల 20 నుంచి 25 వరకు నిర్వహించనున్నారు. 24 నుంచి 25వ తేదీ మధ్యలో ఎన్‌సీసీ, పీహెచ్, స్పోర్ట్స్ అభ్యర్థులకు ఫిజికల్ వెరిఫికేషన్ ఉంటుంది. 28, 29 తేదీల్లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. 30వ తేదీన వెబ్ ఆప్షన్లను ఎడిట్ చేసుకునేందుకు అవకాశం కల్పించనున్నారు.
అక్టోబర్ 3వ తేదీన ఫస్ట్ ఫేజ్ సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందిన విద్యార్థులు అక్టోబర్ 4 నుంచి 7వ తేదీలోగా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. సమావేశంలో టీఎస్ సీహెచ్ఈ వైస్ చైర్మన్ ఎస్కే. మహమూద్, సెక్రటరీ శ్రీనివాసరావు, అడ్మిషన్ల కన్వీనర్ రమేశ్ బాబు పాల్గొన్నారు.