ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై కమిటీ

ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై కమిటీ
  • ఈడీలతో ఏర్పాటు చేసిన ఇన్​చార్జి ఎండీ
  • 21 డిమాండ్ల పరిశీలనకు సీఎం కేసీఆర్​ ఆదేశం
  • చర్చలపై హైకోర్టు ఆర్డర్​ అందడంతో సమీక్ష
  • విలీనం డిమాండ్​ను కార్మికులే వదులుకున్నారన్న సీఎం
  • అందుకే మిగతా డిమాండ్లను పరిశీలిస్తున్నం
  • ఒకటి రెండు రోజుల్లో రిపోర్ట్‌‌.. దాని ఆధారంగానే హైకోర్టుకు నివేదిక
  • సమ్మెకు కాంగ్రెస్, బీజేపీల మద్దతు అనైతికం
  • ‘ప్రైవేటు’కు ఇచ్చేలా మోడీ సర్కారే చట్టం చేసిందని కామెంట్

హైకోర్టు ఆదేశాలతో ఆర్టీసీ సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసింది. కార్మికులు చేస్తున్న డిమాండ్లలో 21 అంశాలను పరిశీలించేందుకు సంస్థ ఈడీలతో కమిటీని నియమించింది. ఒకటి రెండు రోజుల్లో కమిటీ తన నివేదికను ఆర్టీసీ ఇన్​చార్జి ఎండీకి అందిస్తుందని, ఆ వివరాల ఆధారంగా హైకోర్టుకు రిపోర్టు సమర్పిస్తామని తెలిపింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్​ను కార్మిక సంఘాలు తమంతట తామే వదులుకున్నాయన్న సీఎం కేసీఆర్.. అందుకే ఇతర డిమాండ్లను పరిశీలిస్తున్నామని ప్రకటించారు.

హైదరాబాద్‌‌, వెలుగు:

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆర్డర్​ అందడంతో సీఎం కేసీఆర్‌‌ మంగళవారం సమీక్ష నిర్వహించారు. రవాణా మంత్రి పువ్వాడ అజయ్, ముఖ్యకార్యదర్శులు సునీల్ శర్మ, నర్సింగ రావు, ప్రభుత్వ సలహాదారులు రాజీవ్ శర్మ, అనురాగ్ శర్మ, రవాణా కమిషనర్ సందీప్ కుమార్​ సుల్తానియా, ఆర్టీసీ ఈడీలు ఇందులో పాల్గొన్నారు. సమ్మెపై ఆర్టీసీ ఎండీ ఓ కమిటీని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామంటేనే చర్చలు జరుపుతామని కార్మిక సంఘాలు అన్నాయని, కానీ కోర్టులో మాత్రం విలీనంపై పట్టుపట్టబోమని చెప్పాయని సీఎం వెల్లడించారు.తక్షణం వెయ్యి బస్సులను అద్దెకు తీసుకోవడానికి నోటిఫికేషన్ ఇవ్వాలని సూచించారు.

కాంగ్రెస్, బీజేపీల మద్దతు అనైతికం

చట్టవ్యతిరేకంగా జరుగుతున్న సమ్మెకు కాంగ్రెస్, బీజేపీ మద్దతు పలకడం అనైతికమని సీఎం అన్నారు. ‘‘కార్మికులు కోరుతున్న వాటిని కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారా? కాంగ్రెస్, బీజేపీలు ఆర్టీసీ విషయంలో చేస్తున్న వాదనలు చిత్రంగా ఉన్నాయి. ఆర్టీసీని, రూట్లను ప్రైవేటుపరం చేయడానికి రాష్ట్రానికి పూర్తి అధికారం, అవకాశం కల్పిస్తూ మోడీ సర్కారు చట్టం చేసింది. దానికి వ్యతిరేకంగా ఇక్కడి బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. మధ్యప్రదేశ్ లో దిగ్విజయ్ సీఎంగా ఉన్నప్పుడే అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీని మూసేసింది. కానీ ఇప్పుడా పార్టీలు తెలంగాణలో చిత్రంగా, విభిన్నంగా మాట్లాడుతున్నాయి’’అని పేర్కొన్నారు.

వాహన చట్టంలోనే ‘ప్రైవేట్‌‌’చాన్స్

1950లో నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు మోటార్ వెహికిల్ యాక్టును రూపొందించారని, దాని ప్రకారమే రాష్ట్రాల్లో ఆర్టీసీలు ఏర్పడ్డాయని సీఎం కేసీఆర్​ పేర్కొన్నారు. ఆర్టీసీ వాహనాలు నడిచే రూట్లలో ప్రైవేటు వాహనాలకు పర్మిట్లు ఇవ్వవద్దని కూడా ఆ చట్టంలో ఉందన్నారు. మోడీ సర్కారు ఆ చట్టంలోని మూడో సెక్షన్ లో సవరణలు చేస్తూ 2019 బడ్జెట్ సమావేశాల్లో బిల్లు ఆమోదించి, చట్టం చేసిందని చెప్పారు. ‘మోటార్ వెహికిల్ (సవరణ) యాక్టు 2019’పేరుతో అమల్లోకి వచ్చిన ఈ చట్టం కింద ఆర్టీసీలో ప్రైవేటు రంగానికి అవకాశం కల్పించాలని నిర్ణయించారని.. ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారని తెలిపారు.

ప్రజలకు మెరుగైన సౌకర్యం అందించడానికి, తక్కువ ధరల్లో ప్రయాణం సాగించడానికి పోటీ అనివార్యమని కూడా కేంద్రం పేర్కొన్నదన్నారు. మొబైల్ రంగంలో, విమానయాన రంగంలో ప్రైవేటుకు అవకాశం కల్పించడం వల్ల ఆయా రంగాల్లో రేట్లు తగ్గాయని, సౌకర్యాలు పెరిగాయని కేంద్రం ప్రకటించిందని చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉప సంహరణ ద్వారా నిధులు సమకూర్చుకుంటామని కేంద్ర బడ్జెట్లోనే చెప్పారని.. అలాంటిది బీజేపీ నాయకులు ఇక్కడ ఆర్టీసీ విషయంలో మాత్రం చిత్రమైన ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రం తెచ్చిన చట్టాన్నే అమలు చేయడానికి తాము ప్రయత్నిస్తున్నామన్నారు. కాగా రాష్ట్రంలో బీజేపీ నాయకులు రాద్ధాంతం చేస్తున్న విషయంపై ప్రధానికి, కేంద్ర రవాణా మంత్రికి లేఖ రాయాలని సమావేశంలో నిర్ణయించారు.

కార్మిక సంఘాల తరఫున కోర్టులో వాదించిన న్యాయవాది ప్రకాశ్ రెడ్డి కూడా విలీన డిమాండ్ ఒక్కటే ప్రధానం కాదని చెప్పారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జారీ చేసిన ఉత్తర్వుల్లో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. దీంతో కార్మికులు విలీనం డిమాండ్ వదులుకున్నట్టయింది. కార్మికుల డిమాండ్లలో 21 అంశాలను పరిశీలించాలని కోర్టు కోరింది. ఈ ఆదేశాల మేరకు ఆయా డిమాండ్లను పరిశీలించాలి. దాని కోసం అధ్యయనం చేయండి. – సీఎం కేసీఆర్

ఎవరెవరితో కమిటీ

కార్మికుల డిమాండ్లపై ఆర్టీసీ ఇన్​చార్జి ఎండీ ఆరుగురు అధికారులతో కమిటీని ఏర్పాటు చేశారు. అందులో ఐదుగురు ఈడీలు, ఒకరు సలహాదారు ఉన్నారు. ఈడీ టి.వెంకటేశ్వర్ రావు నేతృత్వంలోని ఈ కమిటీలో ఈడీలు ఎ.పురుషోత్తం, సి.వినోద్ కుమార్, ఇ.యాదగిరి, వి.వెంకటేశ్వర్లుతో పాటు ఆర్థిక సలహాదారు ఎన్.రమేశ్​ సభ్యులుగా ఉంటారు.

చర్చలపై సస్పెన్సే..

ఆర్టీసీ కార్మికులతో సర్కారు చర్చల విషయమై ఇంకా సస్పెన్స్‌‌ కొనసాగుతోంది. సమ్మెపై కోర్టు ఆదేశాల నేపథ్యంలో సీఎం కేసీఆర్​ మంగళవారం ప్రగతిభవన్‌‌లో సుదీర్ఘంగా ఐదు గంటలపాటు సమీక్షించారు. కానీ కార్మికులతో సమ్మె విషయాన్ని మాత్రం ఎటూ తేల్చలేదు. సమ్మె ప్రత్యామ్నాయ ఏర్పాట్లపైనే ప్రధానంగా ఫోకస్​ చేసినట్టు తెలిసింది. చివరికి ఓ కమిటీ వేస్తున్నట్టు ప్రకటించినా.. చర్చల విషయాన్ని మాత్రం ఎక్కడ ప్రస్తావించలేదు.

యూనియన్లు లేకుంటెనే బాగుపడ్తది!

యూనియన్లు లేని ఆర్టీసీ కావాలని, నష్టాలకు ప్రధాన కారణం అవేనని, సంఘాలు లేకపోతేనే సంస్థ బాగుపడుతుందని అధికారులతో సీఎం అన్నట్టు సమాచారం. నష్టాల్లో ఉన్న ఆర్టీసీలో జీతాలు పెంచాలని కోర్టు కూడా చెప్పదని పేర్కొన్నట్టు తెలిసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తమ ఉద్యోగాలు ఇమ్మని కార్మికులు అడిగినా ఇచ్చే పరిస్థితి లేదని అన్నట్టు సమాచారం. హామీ ఇస్తే సమ్మె విరమిస్తామంటూ కొన్ని యూనియన్లు తన దృష్టికి తీసుకొచ్చాయని, యూనియన్లతో లాలూచీ పడాల్సిన అవసరం లేదని కేసీఆర్​ చెప్పినట్టు తెలిసింది.

మరో ఆల్విన్ లాగా చేద్దామా?

ఆల్విన్  కంపెనీ లాకౌట్ అయినప్పుడు ఎవరూ ఏమీ చేయలేదని, ఆర్టీసీని మరో ఆల్విన్ లాగా చేద్దామా..? అని సీఎం కేసీఆర్‌‌  కామెంట్​ చేసినట్టు సమాచారం. ప్రస్తుతం ఎన్ని బస్సులు తిరుగుతున్నాయి, ఇంకా ఎన్ని తిప్పాలె, అద్దె బస్సుల కోసం పిలిచిన టెండర్ల వివరాలపైనే మీటింగ్​లో ఫోకస్ చేసినట్టు తెలిసింది.

TS government appointed a committee on the demands of RTC workers