- రోజురోజుకూ దిగజారుతున్న పరిస్థితులు
- టెస్టింగ్ కిట్లు కరువు.. వ్యాక్సిన్ల కొరత
- అడుగంటిన ఆక్సిజన్ నిల్వలు
- బెడ్లు ఎక్కడ ఖాళీగా ఉన్నాయో తెల్వని పరిస్థితి
- ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో గందరగోళం
- శాంపిల్స్ తీసుకుంటరు.. రిజల్ట్ చెప్పరు
- ఫోన్లకు మెసేజ్ రాక ఇబ్బంది పడుతున్న జనం
- పాజిటివ్ వచ్చినోళ్లకు అందని మెడికల్ కిట్లు
హైదరాబాద్, వెలుగు: కరోనా సెకండ్ వేవ్ కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసింది. ఎవరి ప్రాణాలకు వారే బాధ్యులు అన్నట్టుగా వ్యవహరిస్తోంది. రోజు రోజుకూ పరిస్థితులు విషమిస్తున్నాయి. వేలల్లో కేసులు, వందల్లో మరణాలు నమోదవుతున్నాయి. హాస్పిటళ్లలో బెడ్ల కోసం తిరిగి, తిరిగి అంబులెన్సుల్లోనే బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. బెడ్లు దొరికిన వాళ్లకు ఆక్సిజన్, రెమ్డెసివిర్ ఇంజక్షన్లు దొరకడం లేదు. వాటి కోసం పేషెంట్ల బంధువులు మెడికల్ ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నారు. అసలే తక్కువ స్టాక్ ఉండగా, ఆ కొద్ది మొత్తాన్ని కూడా ఏజెన్సీలు, ఫార్మా కంపెనీలు బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నాయి. ధరలు అమాంతం పెంచేసి లక్షలు వెచ్చించినోళ్లకే అమ్ముతున్నాయి. టెస్టుల కోసం, వ్యాక్సిన్ల కోసం హాస్పిటళ్ల వద్ద వందల మంది ఉదయం 8 గంటల నుంచే క్యూ కడుతున్నారు. సోమవారం వ్యాక్సినేషన్ కూడా ఆగిపోయింది. ఇవేవీ పట్టనట్టుగానే సర్కార్ వ్యవహరిస్తోంది. కరోనా కట్టడికి అన్ని ఏర్పాట్లు చేశామని ఆఫీసర్లతో ప్రకటనలు చేయించడం తప్ప, ప్రజలకు భరోసా కల్పించడం లేదని, ఎన్నికలపైనే ఫోకస్ పెట్టిందన్న విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ షార్టేజ్ ఏర్పడింది. సోమవారం చాలా సెంటర్లలో సెకండ్ డోసు వాళ్లకే వ్యాక్సిన్ ఇచ్చారు. ఫస్ట్ డోసు కోసం వచ్చినవాళ్లను, వ్యాక్సిన్ లేదని చెప్పి వెనక్కి పంపించారు. ఇప్పటివరకూ మన రాష్ట్రానికి 34 లక్షల డోసులను కేంద్ర ప్రభుత్వం పంపించింది. ఇందులో సుమారు 32 లక్షల డోసులను వాడారు. ఇంకో రెండు లక్షల డోసులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వీటిని సెకండ్ డోసు వేయడానికి వాడుతున్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మొదటి నుంచి మన దగ్గర చాలా నెమ్మదిగా వ్యాక్సినేషన్ జరిగింది. వ్యాక్సినేషన్ స్పీడప్ చేయాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని కేంద్రం సూచించినా మనవాళ్లు పెద్దగా పట్టించుకోలేదు. ఆయా రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ వేగానికి తగ్గట్టే, కేంద్ర ప్రభుత్వం డోసులు కేటాయిస్తూ వచ్చింది. ఇతర రాష్ట్రాల్లో రోజూ లక్షల మందికి వ్యాక్సిన్ వేస్తుంటే, మన దగ్గర మాత్రం రోజూ 30 వేల మందికి కూడా వేయలేదు. సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యాక ప్రజలే వ్యాక్సిన్ కోసం క్యూ కట్టడం మొదలు పెట్టారు. దీంతో సెంటర్ల పెంచక తప్పలేదు. ముందు నుంచే స్పీడప్ చేసి ఉంటే మన దగ్గర ఇప్పటికే కనీసం 50 లక్షల మందికి వ్యాక్సినేషన్ అయిపోయి ఉండేది. ఇప్పుడు దేశమంతా వ్యాక్సినేషన్‌కు డిమాండ్ పెరగడంతో షార్టేజ్ ఏర్పడింది.
బెడ్ల దారి చూపరెందుకు?
కరోనా కేసులు పెరుగుతున్నకొద్దీ హాస్పిటలైజ్‌డ్ పేషెంట్ల సంఖ్య కూడా ఎక్కువవుతోంది. కార్పొరేట్ హాస్పిటళ్లలోని ఆక్సిజన్, ఐసీయూ, జనరల్ బెడ్లు అన్నీ నిండిపోయాయి. చిన్న, మధ్యస్థాయి హాస్పిటళ్లలో వేల సంఖ్యలో ఆక్సిజన్, ఐసీయూ బెడ్లు ఉన్నట్టు సర్కార్ చెబుతోంది. కానీ, వీటిని ఉపయోగించుకునేలా ప్రజలను ప్రోత్సహించడం లేదు. బెడ్లు దొరక్క ఇబ్బంది పడుతున్నవాళ్లకు కనీస సాయం చేయడం లేదు. ఒక హెల్ప్‌లైన్ నంబర్ పెట్టి ఆక్సిజన్, ఐసీయూ బెడ్లు ఎక్కడున్నయో, పేషెంట్ కండీషన్‌ను బట్టి ఎక్కడికి వెళ్తే బాగుంటుందో చెప్పే ప్రయత్నమేదీ జరగడం లేదు. బెడ్లు, అందులో ఉన్న పేషెంట్ల వివరాలను ప్రతి 4 గంటలకొకసారి హెల్త్ డిపార్ట్‌మెంట్ పోర్టల్‌లో ప్రైవేట్, గవర్నమెంట్ హాస్పిటల్స్ అప్‌డేట్ చేస్తున్నాయి. కనీసం ఈ లైవ్ డ్యాష్ బోర్డును కూడా ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి
తేవడం లేదు.
ఫీజుల దోపిడీపై చర్యలేవి?
కార్పొరేట్, ప్రైవేట్ హాస్పిటళ్లలో ఫీజుల దోపిడీని అడ్డుకోవడంలో సర్కార్ కంప్లీట్‌గా ఫెయిల్ అయింది. ప్రస్తుతం 13,701 మంది కరోనా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా, ఇందులో 10,214 మంది ప్రైవేట్ హాస్పిటళ్లలో ఉన్నారు. వీళ్లందరూ గవర్నమెంట్ హాస్పిటళ్లకు వస్తే తట్టుకునే శక్తి సర్కార్‌కు లేదు. ఇందుకు తగ్గట్టు స్టాఫ్ లేరు. పది వేల నర్సింగ్ స్టాఫ్ కొరత ఉంది. గాంధీ, టిమ్స్ హాస్పిటళ్లలో పేషెంట్ల సంఖ్య 600 దాటింది. ఇప్పుడు ఉన్నవాళ్లను మేనేజ్ చేయలేకనే అక్కడి స్టాఫ్ ఇబ్బందులు పడుతున్నారు. తమ దగ్గరకు డాక్టర్లు, నర్సులు వస్తలేరని, తమను పట్టించుకుంటలేరని పేషెంట్లు ఆందోళన చెందుతున్నారు. ఎంతమందికని సేవ చేస్తామని నర్సులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఇబ్బందులు ఉంటాయని తెలిసే పేషెంట్లు ప్రైవేట్ హాస్పిటళ్లకు వెళ్లడానికి మొగ్గు చూపుతున్నారు. ఇదే అదునుగా ప్రైవేటు హాస్పిటళ్లు ఇష్టారీతిగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఈ దోపిడీని ప్రభుత్వం అడ్డుకోవడం లేదు. దోపిడీకి పాల్పడుతున్న ఒక్క హాస్పిటల్‌పై కూడా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు.
ఆక్సిజన్ దొర్కుతలేదు
రెమ్డెసివిర్ తరహాలోనే ఆక్సిజన్ కూడా బ్లాక్ మార్కెట్ చేస్తున్నారు. రూ. 500 విలువ చేసే ఆక్సిజన్ సిలిండర్‌ను రూ. 2 వేలకు అమ్ముతున్నారు. చాలా హాస్పిటళ్లలో ఆక్సిజన్ అయిపోయింది. డీలర్ల నుంచి సప్లయ్ లేకపోవడంతో పేషెంట్లను చేర్చుకునేందుకు చిన్న హాస్పిటళ్లు వెనకడుగు వేస్తున్నాయి. కొన్ని హాస్పిటళ్లు ఇప్పటికే తమ దగ్గర ఉన్న పేషెంట్లను కూడా వేరే హాస్పిటళ్లకు వెళ్లిపోవాలని సూచిస్తున్నాయి. అంతటా ఇదే దుస్థితి ఉండడంతో ఎక్కడికి వెళ్లాలో తెలియక పేషెంట్లు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అంబులెన్స్‌లలో తిరిగి తిరిగి ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రస్తుతం ఆక్సిజన్ పంపిణీ మొత్తం కేంద్ర సర్కార్ పరిధిలో ఉంది. ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులను బట్టి అవసరమైన మేర అన్ని రాష్ట్రాలకూ కేటాయిస్తున్నారు. మన రాష్ట్రంలో వాస్తవ పరిస్థితిని కేంద్రానికి చెప్పకుండా, చాలా తక్కువ కేసులు.. తక్కువ మరణాలు చూపిస్తున్నారు. హాస్పిటళ్లలో ఇన్‌పేషెంట్ల సంఖ్యను కూడా అలాగే తగ్గించి చూపిస్తున్నారు. దీంతో మనకు అవసరమైన దాని కంటే తక్కువ మందులు, తక్కువ ఆక్సిజన్ వస్తోంది. నాలుగైదు రోజుల్లో చాలా హాస్పిటళ్లలో ఆక్సిజన్ ఖాళీ అయిపోయి, వందల మంది పేషెంట్ల ప్రాణాలకు ముప్పు వాటిల్లే పరిస్థితి ఉంది.
