
- భూములు, ఫ్లాట్ల సేల్స్ పెంచేలా కార్యాచరణ
- సర్కార్ కు ఆదాయం వచ్చేలా చూడాలని అధికారులకు ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు : ఖాళీ అయిన రాష్ట్ర ఖజానాను ఎలా నింపాలనే దానిపై కొత్త ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా స్తబ్దుగా ఉన్న రియల్ ఎస్టేట్ రంగాన్ని గాడిలో పెట్టాలని చూస్తోంది. ప్రస్తుతం ఉన్న భూముల రేట్లు తగ్గకుండా.. ఎక్కువ సంఖ్యలో అమ్మకాలు, కొనుగోళ్లు జరిగేలా కార్యాచరణ చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. దాదాపు 7, 8 నెలల నుంచి రాష్ట్రంలో భూములు, స్థిరాస్తి అమ్మకాలు, కొనుగోళ్లు భారీగా పడిపోయాయి. ఎన్నికలు రావడంతో చాలా వరకు అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్ రిజిస్ట్రేషన్లు తగ్గాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడంతో రియల్టర్లు, బిల్డర్లతో పాటు జనాలకు.. ఎటువైపు డెవలప్మెంట్ పెరిగే అవకాశం ఉన్నది? ప్రభుత్వ పాలసీ విధానాలు ఎలా ఉండబోతున్నాయనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. వీటి కారణంగా ఈ ఏడాది మార్చి నుంచి ఇప్పటి వరకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల ఆదాయం తగ్గింది. అయితే, ఇండస్ట్రీల విషయంలో మాత్రం ప్రభుత్వం ఒక స్పష్టతను ఇచ్చింది. ఓఆర్ఆర్ అవతల... ఆర్ఆర్ఆర్ లోపల పరిశ్రమల ఏర్పాటుకు తగిన భూములు గుర్తించాలని ఆదేశించింది. దీంతో ఆ ప్రాంతాల్లో కొంతమేర రియల్ భూమ్ పెంచేందుకు ప్లాన్ చేసింది. కొత్త మాస్టర్ ప్లాన్లు తీసుకురావడం, భవన నిర్మాణ అనుమతులలో మరిన్ని వెసులుబాటులు కల్పించాలని అనుకుంటున్నది. దీంతోపాటు ప్రభుత్వానికి ఆదాయం రావాల్సిన అన్ ఆథరైజ్డ్ లే అవుట్స్‌లో రిజిస్ట్రేషన్లపై కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే దానిపై కసరత్తు చేస్తోంది.
తగ్గిన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల ఇన్‌కం
రాష్ట్ర సర్కార్ కు ఆదాయం తెచ్చిపెట్టే దాంట్లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లు ప్రధానమైనవి. ఈ ఆర్థిక సంవత్సరంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లతో రూ.18,500 కోట్ల రాబడి తీసుకురావాలని ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకున్నది. భూముల విలువ, రిజిస్ట్రేషన్ చార్జీలు ఇప్పటికే పెంచడంతో ఆదాయం పెరుగుతుందని గతం కంటే ఎక్కువే అంచనాలు పెట్టుకున్నది. అయితే, ఇప్పటి వరకు రూ.10 ,500 కోట్లు వచ్చింది. మిగిలిన 4 నెలల్లో అంటే వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి ఇంకో 8 వేల కోట్ల రూపాయలు రావాల్సి ఉన్నది. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారమే రిజిస్ట్రేషన్లు కొనసాగితే టార్గెట్‌కు దాదాపు 4 వేల కోట్లు తగ్గే చాన్స్ ఉన్నదని ఆఫీసర్లు చెబుతున్నారు. గతేడాది నవంబర్‌లో దాదాపు 1.54 లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్కాగా.. ఈసారి లక్ష మాత్రమే అయ్యాయి. అంటే దాదాపు 54 వేల డాక్యుమెంట్లు తగ్గాయి.