సుప్రీం రిటైర్డ్​ జడ్జీల కమిటీకి ఒప్పుకోం: ప్రభుత్వం

సుప్రీం రిటైర్డ్​ జడ్జీల కమిటీకి ఒప్పుకోం: ప్రభుత్వం
  • తేల్చాల్సింది లేబర్​ కోర్టే.. దానికి రిఫర్​ చేయండి
  • టీఎస్​ ఆర్టీసీకి కేంద్రం అనుమతి అవసరం లేదు
  • హైకోర్టు ముందు రాష్ట్ర ప్రభుత్వం వాదనలు
  • మీరు చెప్పే జీవోలు ఇప్పుడు చెల్లవు : హైకోర్టు
  • కమిటీ వేసే అధికారం హైకోర్టుకు ఉంది: యూనియన్​
  • సమ్మెపై విచారణ ఈ నెల 18కి వాయిదా

హైదరాబాద్, వెలుగు:

ఆర్టీసీ సమస్య పరిష్కారానికి సంప్రదింపుల కోసం ముగ్గురు సుప్రీంకోర్టు రిటైర్డ్ ​జడ్జిలతో కమిటీ వేద్దామన్న హైకోర్టు ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. అంశాన్ని పారిశ్రామిక వివాదాల పరిష్కార చట్టంలోని సెక్షన్‌‌ 10 కింద లేబర్‌‌ కోర్టుకు నివేదించాలని వాదించింది. ఆ చట్టంలో కమిటీ ప్రతిపాదన ఏమీ లేదని తెలిపింది. ఎస్మా ప్రకారం ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్ధమని ప్రభుత్వం మరోసారి వాదించింది.  చట్టం ప్రకారం కార్మికులంతా కంపెనీ నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలని, అయితే ఆర్టీసీలో మాత్రం ఏ చట్టాలను పట్టించుకోవడం లేదని పేర్కొంటూ అఫిడవిట్‌‌ దాఖలు చేసింది.  హైకోర్టులో కేసు విచారణలో ఉన్నందున లేబర్‌‌ కోర్టుకు వెళ్లలేకపోతున్నామని, కార్మికులతో కన్సిలేషన్‌‌ విఫలమైనందున తదుపరి చర్యలు తీసుకునేలా కార్మిక శాఖకు ఆదేశాలు జారీ చేయాలని కోరింది. ఆర్టీసీ సమ్మెను చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ ఓయూ రీసెర్చ్‌‌ స్కాలర్‌‌ సుబేందర్‌‌సింగ్‌‌ దాఖలు చేసిన పిల్‌‌పై బుధవారం హైకోర్టు చీఫ్​ జస్టిస్​ ఆర్‌‌ఎస్‌‌ చౌహాన్, జస్టిస్‌‌ ఎ.అభిషేక్‌‌రెడ్డితో కూడిన డివిజన్‌‌ బెంచ్‌‌ ముందు విచారణ కొనసాగింది. అయితే సమస్య పరిష్కారానికి కమిటీని నియమించే అధికారం హైకోర్టుకు ఉందని యూనియన్లు తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌‌ జనరల్‌‌ బీఎస్‌‌ ప్రసాద్‌‌ వాదిస్తూ.. ఇప్పటికే హైకోర్టు చేసిన పలు సూచనల్ని ప్రభుత్వం అమలు చేసిందని, సమ్మె చట్ట విరుద్ధమని తెలిసి కూడా డివిజన్‌‌ బెంచ్‌‌ సూచనల మేరకు యూనియన్లతో చర్చలు చేసిందని చెప్పారు. సుప్రీంకోర్టు రిటైర్డ్​ జడ్జీలతో సంప్రదింపుల కమిటీ ఏర్పాటు చేయాలనే సూచనకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా లేదని, ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తాజాగా అఫిడవిట్‌‌ను దాఖలు చేశారని ఆయన వివరించారు. ఇది పూర్తిగా కార్మిక వివాదాల పరిధిలోకి వస్తుంది కాబట్టి లేబర్‌‌ కోర్టుకు ఈ వ్యవహారాన్ని నివేదించాలని కోరారు. సుప్రీంకోర్టు మాజీ జడ్జీలతో కమిటీ అవసరం లేదని, పారిశ్రామిక వివాదాల పరిష్కార చట్టం కిందనే ఈ సమస్యను పరిష్కరించుకునేందుకు ప్రభుత్వ ఆసక్తి చూపుతోందని ఏజీ చెప్పారు. అత్యవసర సేవల కింద (ఎస్మా) ఆర్టీసీ సమ్మె చట్ట వ్యతిరేకమని పేర్కొన్నారు.

కేంద్రం అనుమతి అవసరం లేదన్న ఏజీ

టీఎస్‌‌ ఆర్టీసీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి పొందాల్సిన అవసరం కూడా లేదని ఏజీ పేర్కొన్నారు. ఏపీ రీ ఆర్గనైజేషన్‌‌ యాక్ట్‌‌ 9వ షెడ్యూల్‌‌ పరిధి ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలోని ఏపీఎస్‌‌ ఆర్టీసీకి చెందిన ఆస్తులు, అప్పులు మాత్రమే కేంద్రం విభజన చేయాలని, రెండు తెలుగు రాష్ట్రాలకు విడివిడిగా ఆర్టీసీ ఏర్పాటుకు కేంద్ర సమ్మతి అవసరం లేదన్నారు. విభజనకు కేంద్రం నుంచి నామమాత్ర అనుమతి పొందుతామన్నారు. ఆర్టీసీ ఏర్పాటుకు ప్రత్యేక చట్టం ఉన్నప్పటికీ రాష్ట్ర విభజన చట్టమే వర్తిస్తుందని తెలిపారు. హైకోర్టు పట్ల గౌరవంతో యూనియన్లతో ప్రభుత్వం చర్చలు జరిపిందని, హైకోర్టుకు వివాదం రాకముందే ఉన్నతాధికారులతో త్రిసభ్య కమిటీ వేసి చర్చలు కూడా నిర్వహించిందని, కమిటీ సూచనల్ని యూనియన్లు ఖాతరు చేయలేదని, యూనియన్ల తీరు ఏమాత్రం బాగోలేదని వాదించారు.  ఇప్పుడు ఈ వివాదం పారిశ్రామిక వివాదాల చట్టం కింద తేల్చుకునే మార్గం ఒక్కటే మిగిలి ఉందని తెలిపారు. రవాణా చట్టంలోని సెక్షన్‌‌ 47–ఎ ప్రకారం ఆర్టీసీ విభజనకు అనుమతి అవసరం లేదన్నారు.

అదే చట్టం కింద ఛత్తీస్​గఢ్​ అనుమతి తీసుకుంది: హైకోర్టు

ఛత్తీస్​గఢ్​ రాష్ట్ర ఏర్పాటు సమయంలో రవాణా చట్టంలోని సెక్షన్‌‌ 47–-ఎ సెక్షన్​ కిందనే అక్కడి ఆర్టీసీ విభజనకు కేంద్రం నుంచి ఆ రాష్ట్రం అనుమతి పొందిందిందని డివిజన్‌‌ బెంచ్‌‌ గుర్తు చేసింది. ఈ సందర్భంగా ఎస్మా గురించి హైకోర్టు కీలక ప్రశ్నలు సంధించింది. టీఎస్‌‌ ఆర్టీసీని ఎస్మా కిందికి ఎప్పుడు తీసుకువచ్చారు? ఈ మేరకు నోటిఫికేషన్‌‌ ఎప్పుడు ఇచ్చారు? సమ్మె చట్ట వ్యతిరేకమని పారిశ్రామిక వివాదాల పరిష్కార ట్రిబ్యునల్‌‌ ప్రకటించాలి కదా? ఎస్మా కింద ఆ తరహా ప్రకటన చేసే ఆథరైజ్డ్​ అధికారి ఎవరు? వంటి ప్రశ్నలు వేసింది. ఆర్టీసీ ఎస్మా పరిధిలోకి తెస్తూ 2015లో జీవో 180 వచ్చిందని, రవాణా శాఖ ఎస్మా కింద ప్రకటన చేయవచ్చని ఏజీ ప్రసాద్‌‌ బదులిచ్చారు. ఆ జీవో ఏపీఎస్‌‌ ఆర్టీసీకి వర్తిస్తుందని, టీఎస్‌‌ ఆర్టీసీ విడిపోయాక విడిగా జీవో ఇవ్వలేదని, అయినా ఆ జీవో కాలపరిమితి ఆరునెలలేనని డివిజన్‌‌ బెంచ్‌‌ చెప్పింది. దీనిపై ఏజీ కల్పించుకుని, ఏపీ జీవోలే తెలంగాణకూ అమలవుతున్నాయన్నారు. కన్సిలేషన్‌‌ విఫలమైన విషయాన్ని కార్మిక శాఖ కమిషనర్‌‌ లేబర్‌‌ కోర్టుకు చెప్పడం లేదా చెప్పకపోవడానికి కారణాలు తెలియజేస్తూ నివేదిక ఇవ్వడం వంటి రెండు ఆప్షన్లు ఉంటాయని బెంచ్‌‌ చెప్పింది. వెంటనే లేబర్‌‌ కోర్టుకు రిపోర్టు ఇస్తారని, దీనికి 4 వారాల గడువు కావాలని ఏజీ చెప్పారు.

ఇల్లీగల్​ అని కార్పొరేషన్​ ఎట్ల చెప్తది?

ఆర్టీసీ సంస్థ తరఫున అదనపు ఏజీ

జె.రామచందర్‌‌ రావు వాదిస్తూ.. సమ్మె చట్ట వ్యతిరేకంగా జరుగుతోందన్నారు. దీనిపై బెంచ్‌‌ స్పందిస్తూ.. సమ్మె చట్ట వ్యతిరేకమని కార్పొరేషన్‌‌ ఎలా చెబుతుందని, లేబర్‌‌ కోర్టు చెప్పాలని తేల్చిచెప్పింది. కార్మిక వివాదం తలెత్తితే పారిశ్రామిక వివాదాల చట్టం కింద పరిష్కరించుకోవాల్సి ఉంటుందని అదనపు ఏజీ చెప్పారు. అందుకే సమ్మె చట్ట వ్యతిరేకమని తెలిపారు.

కమిటీ వేసే అధికారం హైకోర్టుకు ఉంది: యూనియన్​

సమస్య పరిష్కారానికి సుప్రీం రిటైర్డ్ జడ్జిలతో కమిటీ ఏర్పాటు చేసే అధికారం హైకోర్టుకు ఉందని కార్మిక యూనియన్‌‌ తరఫు అడ్వకేట్​ చెప్పారు. ఈ మేరకు సుప్రీంకోర్టు ఉత్తర్వులు కూడా ఉన్నాయని తెలిపారు. కమిటీ ఏర్పాటు చేయాలని యూనియన్‌‌ కోరుతోందని చెప్పారు. అయితే అటు ప్రభుత్వం.. ఇటు ఆర్టీసీ యాజమాన్యం రెండూ కూడా కమిటీ వద్దని చెప్పడం ద్వారా ప్రభుత్వం బెట్టు వైఖరి స్పష్టమవుతోందని ఆయన వాదించారు. ఆర్టీసీకి పర్మినెంట్‌‌గా ఎండీని నియమించాలని హైకోర్టు కోరినా పట్టించుకోలేదని, ఆఖరికి రూ.47 కోట్లు ఇస్తే సమస్య కొలిక్కి వస్తుందని చెప్పినా ఖాతరు చేయలేదని, సర్కార్‌‌ నిర్లక్ష్య వైఖరికి ఇంతకంటే వేరే నిదర్శనాలు అక్కర్లేదన్నారు. దీనిపై బెంచ్‌‌ స్పందిస్తూ 21 డిమాండ్లు అమలు సాధ్యమని మాత్రమే తాము చెప్పామని, వాటి అమలుకు ఉత్తర్వులు ఏమీ ఇవ్వలేదని, తమ ఉత్తర్వుల్ని అన్వయించుకోవడంలో ఎవరికి వారు తమకు అనుకూలమని అనుకుంటే తామేమీ చేయలేమని చెప్పింది. విచారణను ఈ నెల  18కి హైకోర్టు వాయిదా వేసింది.

నేడు ‘పర్మిట్ల’పై విచారణ

5,100 ప్రైవేటు బస్సు రూట్ల పర్మిట్​ను సవాల్‌‌  చేస్తూ దాఖలైను పిల్‌‌ను గురువారం విచారిస్తామని డివిజన్‌‌ బెంచ్‌‌ ప్రకటించింది. అప్పటి వరకూ కేబినెట్‌‌ నిర్ణయంలో ఎలాంటి చర్యలు తీసుకోరాదన్న మధ్యంతర ఉత్తర్వుల్ని పొడిగిస్తున్నట్లు స్పష్టం చేసింది.

TS Government rejects the High Court's proposal of Supreme Court retired judges committee on RTC Strike