HIVవ్యాక్సిన్ పరిశోధనకు అమెరికా నిధుల కోత..మిలియన్ల మంది ప్రాణాలకు ముప్పు?

HIVవ్యాక్సిన్ పరిశోధనకు అమెరికా నిధుల కోత..మిలియన్ల మంది ప్రాణాలకు ముప్పు?

దక్షిణాఫ్రికాలో హెచ్‌ఐవి (HIV) వ్యాక్సిన్ పరిశోధనకు అమెరికా నిధులు నిలిపివేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. విదేశాలకు సాయం తగ్గించుకోవాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయంతో ఈ పరిశోధనలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. HIV ప్రాజెక్టు కోసం అమెరికా కేటాయించిన 46 మిలియన్ డాలర్ల నిధులు ఆగిపోయాయి.

క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించడానికి కేవలం వారం రోజులు మాత్రమే ఉన్న సమయంలో ట్రంప్ నిర్ణయంతో HIV ప్రాజెక్టులు నిలిచిపోయాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా తీవ్ర పరిణామాలకు దారితీస్తోంది. ఇది కేవలం పరిశోధనలను నిలిపివేయడం మాత్రమే కాకుండా, HIVవ్యాప్తి నియంత్రణలో దశాబ్దాల పురోగతిని తిప్పికొట్టి, మిలియన్ల మంది ప్రాణాలకు ముప్పు కలిగిస్తుందని ఐక్యరాజ్యసమితి (UN) సహా అనేక అంతర్జాతీయ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

దక్షిణాఫ్రికాలో ప్రపంచంలోనే అత్యధికంగా HIVబాధితులు ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హెచ్‌ఐవి బాధితులకు కోసం ఈ దేశంలో పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ పరిశోధనలకు ఆ దేశంలోని జన్యు వైవిధ్యం ,పరిశోధనా నైపుణ్యం వ్యాక్సిన్ అభివృద్ధికి చాలా కీలకం. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలనలో విదేశీ సహాయాన్ని తగ్గించుకోవాలనే నిర్ణయం ఈ పరిశోధనలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 

BRILLIANT ప్రాజెక్టు నిలిపివేత.. ప్రపంచ వ్యాప్తంగా HIV ని అరికట్టేందుకు ప్రారంభించిన హెచ్ ఐవీ ప్రాజెక్టు BRILLIANT. ట్రంప్ నిర్ణయంతో ఈ ప్రాజెక్టు క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించడానికి కేవలం వారం రోజులు మాత్రమే ఆగిపోయింది. ఈ ప్రాజెక్టు కోసం అమెరికా నుంచి కేటాయించిన 46 మిలియన్ డాలర్ల  నిధులు ఆగిపోయాయి.

ప్రపంచంలోనే అత్యధిక హెచ్‌ఐవి కేసులతో పోరాడుతున్న బాధితులు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు ఈ నిర్ణయంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. వారి కృషి ప్రపంచానికి ప్రయోజనం చేకూరుస్తుందని భావించిన సమయంలో ట్రంప్ నిర్ణయం వారి నిరాశకు గురిచేసింది. 

అమెరికా నిధుల కోతల కారణంగా సుమారు 100 మంది హెచ్‌ఐవి పరిశోధకులు ,8వేల మందికి పైగా ఆరోగ్య కార్యకర్తలు ఉద్యోగాలు కోల్పోయినట్లు దక్షిణాఫ్రికా ఆరోగ్య శాఖ తెలిపింది. ఇది హెచ్‌ఐవి రోగులకు సేవలు, డేటా సేకరణ, కౌన్సిలింగ్ అందించే సామర్థ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. 
దక్షిణాఫ్రికాలో క్షయ కేసులు కూడా అధికంగానే ఉన్నాయి. ఈ నిధుల కోతలు HIV పరిశోధనతో పాటు క్షయ పరిశోధనపైనా ప్రభావం చూపనుంది. 

నిధుల కోత ప్రపంచంపై ప్రభావం.. 

అమెరికా నిధుల కోతల వల్ల కలిగే పరిణామాలు కేవలం దక్షిణాఫ్రికాకే పరిమితం కావు. ఐక్యరాజ్యసమితి (UNAIDS) అంచనాల ప్రకారం.. అమెరికా హెచ్‌ఐవి కార్యక్రమాలకు అందించే నిధులు భర్తీ చేయబడకపోతే 2029 నాటికి ప్రపంచవ్యాప్తంగా అదనంగా 6 మిలియన్ల కొత్త హెచ్‌ఐవి ఇన్ఫెక్షన్లు ,4 మిలియన్ల ఎయిడ్స్ సంబంధిత మరణాలు సంభవించవించే అవకాశం ఉంది. 

హెచ్‌ఐవి వ్యాక్సిన్ పరిశోధన అనేది ప్రపంచవ్యాప్తంగా వ్యాధిని నియంత్రించడానికి చాలా కీలకమైంది. దీనికి ఆటంకం కలిగించడం వల్ల ప్రపంచ ఆరోగ్యానికి తీవ్ర ముప్పు ఏర్పడుతుంది.కరోనా మహమ్మారి సమయంలో వ్యాక్సిన్ అభివృద్ధికి ప్రపంచ దేశాలు ఎలా సహకరించాయో, హెచ్‌ఐవి వంటి ప్రాణాంతక వ్యాధులకు కూడా అదే స్థాయిలో నిబద్ధత అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అమెరికా నిధుల కోతలతో హెచ్‌ఐవి పరిశోధనలకు ఇతర దాతలు,ఫార్మాస్యూటికల్ కంపెనీలు, అంతర్జాతీయ సహకారాన్ని కూడా తగ్గే అవకాశం ఉంది. హెచ్‌ఐవి నివారణ ,చికిత్సలో సాధించిన పురోగతికి నిరంతర పెట్టుబడి ,అంతర్జాతీయ సహకారం చాలా అవసరం. 

ప్రపంచ ఆరోగ్య సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, బిల్ గేట్స్ వంటి వ్యక్తులు ఈ నిధుల కోతలను వెనక్కి తీసుకోవాలని లేదా ఇతర దేశాలు, సంస్థలు ఆ లోటును పూరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. లేదంటే హెచ్‌ఐవి మహమ్మారిని నియంత్రించడంలో దశాబ్దాల కృషి వృధా అయ్యే ప్రమాదం ఉందంటున్నారు.