భగవద్గీత జయంతి: ప్రశాంతంగా జీవించడానికి గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన రహస్యం ఇదే.. !

భగవద్గీత జయంతి: ప్రశాంతంగా జీవించడానికి గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన రహస్యం ఇదే.. !

భగవద్గీత, యుద్ధభూమిలో శ్రీకృష్ణ భగవానునికి, అర్జునునికి మధ్య జరిగిన సంభాషణ. అయితే, దాని అసలైన సందేశం కేవలం యుద్ధం గురించే కాదు, ప్రతిరోజూ వివేకవంతంగా ఎలా జీవించాలో తెలియజేయడం. దాని అత్యంత ప్రధానమైన బోధన నిష్కామ కర్మ గురించి ఉంది.  ఫలితాలపై ధ్యాస ఉంచకుండా, మీ శక్తిమేరకు కృషి చేయడం. గొప్ప భారతీయ ఆధ్యాత్మిక గురువైన  పరమహంస యోగానంద, కోరికలు లేకుండా కర్మలను నిర్వర్తించడం యోగంలో ఒక ముఖ్యమైన అంశమని చెప్పారు. 

గాడ్ టాక్స్ విత్ అర్జున: ది భగవద్గీత అనే తన మహత్తర గీతాభాష్యంలో, శ్రీకృష్ణుని సందేశం ఒక అర్థంకాని తత్వశాస్త్రం కాదని, గృహస్థునకైనా, ఒక సంస్థకు అధిపతికైనా, లేక ఒక దైవాన్వేషకునికైనా ఇది ఒక ఆచరణాత్మకమైన మార్గదర్శి అని ఆయన వివరించారు.

భగవద్గీతలోని 2వ అధ్యాయం, 47వ శ్లోకంలో, శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా బోధించారు:

“కర్మలు చేయుటయందు మాత్రమే నీకు అధికారము కలదు, వాటి ఫలితములందు ఎన్నడూ లేదు. నీ కర్మఫలములకు సృష్టికర్తవు నీవని భావించకు; అట్లని నిష్క్రియ పట్ల నీకు అనురక్తి కలగనీయకు.”

దీని అర్థం ఏమిటంటే: అది మీ ఉద్యోగమైనా, మీ కుటుంబాన్ని పోషించడం అయినా, లేదా ఏదైనా బాధ్యత అయినా, మీ కర్తవ్యాన్ని నిర్వర్తించండి. కానీ ప్రతిఫలం గురించి, గుర్తింపు గురించి నిరంతరం ఆందోళన చెందుతూ ఉండకండి. “నాకేమి లభిస్తుంది” అనే ఆందోళన ఒత్తిడిని మాత్రమే తెస్తుంది. మీరు ఫలితంపై కాకుండా, కర్మపైనే దృష్టి సారించినప్పుడు స్వేచ్ఛ లభిస్తుంది. అదే సమయంలో, సోమరిగా లేదా నిష్క్రియగా మారకండి. 

48వ శ్లోకంలో, శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా సలహా ఇచ్చారు:

“ఓ ధనంజయ, యోగంలో నిమగ్నుడవై, సమస్త కర్మలను ఆచరించుము. వాటి ఫలాలపై ఆసక్తిని త్యజించి, జయాపజయములయందు సమభావము గలవాడవై ఉండుము. ఈ మానసిక సమత్వమే యోగం అని చెప్పబడుతుంది.”

జీవితం ప్రశంసలను, నిందలను, విజయాన్ని, అపజయాన్ని తెస్తుంది. ఈ రెండు పరిస్థితులలోనూ ప్రశాంతంగా ఉండాలని శ్రీకృష్ణుడు మనకు బోధిస్తారు. ఈ సమభావమే నిజమైన యోగం—ఆంతరంగిక శాంతిని బాహ్య కర్మాచరణతో అనుసంధానం చేయడం.

3వ అధ్యాయం, 30వ శ్లోకంలో, ఈ స్థితిని సాధించడానికి శ్రీకృష్ణుడు కీలకమైన మార్గాన్ని తెలియజేశారు:

“సమస్త కర్మలను నాకు అర్పించుము! అహంకారం, ఆశలు విడచి, నీ మనస్సును ఆత్మపై కేంద్రీకరించి, ఆందోళన నుండి విముక్తుడవై, కర్మాచరణమనే యుద్ధంలో నిమగ్నమై ఉండుము.”

సరళమైన మాటల్లో చెప్పాలంటే, మీరు చేసే ప్రతి పనిని భగవంతునికి అంకితం చేయండి. ఈ విధంగా జీవించడం అంటే ప్రపంచం నుంచి విరమించుకోవడం కాదు, అశాంతికారకమైన కోరికలు లేకుండా, అహంకారం లేకుండా, అపేక్ష, తీవ్రమైన చింత లేకుండా, ప్రతి కర్మను ఆయనకు ఒక సమర్పణగా నిర్వర్తించడం. ప్రశాంతమైన జీవితానికి ఇదే ఏకైక మార్గం. 5వ అధ్యాయం, 10వ శ్లోకంలో, శ్రీకృష్ణుడు 

ఒక అందమైన ఉపమానాన్ని అందించారు:

“నీటిచే అంటబడని తామరాకు వలె, కర్మలను నిర్వర్తించే యోగి, ఆసక్తిని త్యజించి, తన కర్మలను అనంతునికి (భగవంతునికి) సమర్పించడం ద్వారా, ఇంద్రియ బంధాలకు లోనుకాకుండా ఉంటాడు.”

బురదలో పెరిగినా దాని మలినం సోకని కమలం వలె, నిష్కామ కర్మను ఆచరిస్తూ, భగవంతునికి శరణాగతి చెందడం ద్వారా ప్రాపంచిక పోరాటాల మధ్య జీవిస్తూ  కూడా ప్రశాంతంగా ఉండవచ్చు.