ఎంపీ కాకముందే హెటిరో పార్థసారథి రెడ్డికి భూ సంతర్పణ

ఎంపీ కాకముందే హెటిరో పార్థసారథి రెడ్డికి భూ సంతర్పణ
  • ఎంపీ కాకముందే హెటిరో పార్థసారథి రెడ్డికి భూ సంతర్పణ
  • 5 వేల కోట్ల ఆమ్దానీ వచ్చే ల్యాండ్​ అగ్గువకే కేటాయింపు
  • మూడెకరాలే చాలని కలెక్టర్​ చెప్పినా 15 ఎకరాలు ఇచ్చేశారు
  • 2014లో సాయిసింధు ఫౌండేషన్​ ట్రస్ట్​ పెట్టిన పార్థసారథి
  • ఆ మరుసటి ఏడాదే భూమి లీజ్​ కోసం సర్కారు దగ్గరికి 
  • ఆగమేఘాల మీద కదిలిన ఫైళ్లు
  • నిర్మాణాలపై హైకోర్టు స్టే ఇచ్చినా బేఖాతరు
  • కేటాయించిన స్థలంలో చివరి దశకు చేరిన నిర్మాణాలు
  • జీహెచ్​ఎంసీ ఫీజు రూ.20 కోట్లు కూడా ఎగవేత

హైదరాబాద్, వెలుగు: దేశంలోనే రిచ్చెస్ట్ ఎంపీ, బీఆర్​ఎస్​ లీడర్​ పార్థసారథిరెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం అగ్గువకే భూములను అప్పగించడం వెనుక విస్మయ పరిచే నిజాలు బయటకొస్తున్నాయి. హైకోర్టులో దాఖలైన రిపోర్టులు.. చాటుమాటుగా భూములను అనుచరులకు దోచిపెడుతున్న తీరును స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ ఏడాది నుంచే హెటిరో కంపెనీ పేరుతో సాగిన భూముల లీజ్​ వ్యవహారం జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ ఉన్నతాధికారులందరూ డమ్మీలేనని రుజువు చేస్తున్నది. తాము అనుకున్న వాళ్లకు అడిగినంత భూమిని అగ్గువకు నేరుగా ప్రభుత్వం రాసిచ్చేసినట్లు రిపోర్టులను బట్టి తెలుస్తున్నది. తొమ్మిదేండ్లుగా నిరుపేదలకు డబుల్​ బెడ్రూం ఇండ్ల కోసం, దళితులకు మూడెకరాల భూమి కోసం జాగా లేదంటున్న రాష్ట్ర ప్రభుత్వం.. పార్థసారథి తమకు నచ్చినోడు కావటంతో  ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి, క్యాన్సర్​ హాస్పిటల్ కట్టేస్తామంటే ఏడాది తిరక్కముందే చకచకా ఫైళ్లను కదిలించింది. 

కొత్త ట్రస్ట్.. ఏడాదికే భూమి 

హెటిరో కంపెనీ ఎండీ పార్థసారథి రెడ్డి 2014 సెప్టెంబర్​లో సాయిసింధు ఫౌండేషన్​ పేరుతో ఒక చారిటబుల్​ ట్రస్ట్  ఏర్పాటు చేశారు. శేరిలింగంపల్లి మండలంలోని ఇజ్జత్​నగర్​లో  క్యాన్సర్​ జనరల్​ హాస్పిటల్​ ఏర్పాటుకు 15.48 ఎకరాల స్థలం కేటాయించాలని సీఎంకు అప్లై చేసుకున్నారు. ఒక్క ఏడాది కూడా కార్యకలాపాలు నిర్వహించని ట్రస్ట్ ఏకంగా వందల కోట్ల విలువైన భూమిని అడిగితే  పక్కనపెట్టాల్సిన ప్రభుత్వం.. ఫైల్​ పుటప్​ చేయడం గమనార్హం.


ఇజ్జత్​నగర్​లో ఆ సంస్థ అడిగిన స్థలాన్ని అప్పటికే టీఎస్​ఐఐసీ వేలం వేయాలని నిర్ణయించింది. అయినా సరే,  రాజు తలుచుకుంటే.. అన్న చందంగా వెంటనే ఇజ్జత్​నగర్​ బదులు ఖానామెట్​లో ప్లేస్​ ఇవ్వా లని ప్రభుత్వం ఫైళ్లు మార్పించింది. ఆ ట్రస్ట్​కు  స్థలం కేటాయించాలని సీఎం ప్రిన్సిపల్​ సెక్రటరీ ఆర్డర్​ వేయ టం.. ఖానామెట్​లో సర్వే నెంబర్​ 41/41లో 15 ఎక రాల స్థలం ఇవ్వాలని సీసీఎల్​ఏకు స్పెషల్​ చీఫ్​ సెక్రటరీ టాప్​ ప్రియారిటీ ఆదేశాలివ్వటం ఆగమేఘాలపై జరిగిపోయాయి. 

అప్పటి లెక్కల ప్రకారమే భూమి విలువ రూ.505 కోట్లు

భూ కేటాయింపులకు రంగం సిద్ధమైనప్పుడే... మా ర్కెట్​ వ్యాల్యూ ప్రకారం ఖానామెట్​లో  ఒక్కో ఎకరం రూ.33.70 కోట్ల విలువుందని, మొత్తం 15  ఎకరాలకు రూ.505.50 కోట్లు అవుతాయని అప్పటి శేరిలింగంపల్లి తహశీల్దార్​ నోట్​ సమర్పించారు. అప్పటికీ ఆ భూములు వేలం వేసే ప్రతిపాదనలు ఉన్నప్పటికీ..  సాయిసింధు ఫౌండేషన్​ ట్రస్ట్​కు ఇవ్వాలనే కొత్త  ప్రపోజల్స్​ కలెక్టర్​కు అందాయి.  హైటెక్​ సిటీకి 500 మీటర్ల దూరంలో హెచ్​ఐసీసీకి వెళ్లే మెయిన్​ రోడ్డును ఆనుకొని ఉన్నందున, ఆ స్థలం అత్యంత విలువైందని రాజేంద్రనగర్​ ఆర్డీవో కూడా అదే రేటును ధ్రువీకరించారు. జీవో నెం.571కు తగ్గట్టుగా ఆ భూమిని సాయిసింధు ఫౌండేషన్​కు లీజుపై కేటాయించాలని ప్రభుత్వం జిల్లా కలెక్టర్​కు మెమో జారీ చేసింది. రాష్ట్ర ఖజానా నింపుకునేందుకు భూములను వేలం వేయడం మొదలు పెట్టిన ప్రభుత్వం రూ.505 కోట్ల మార్కెట్​ వ్యాల్యూ ఉన్న స్థలాన్ని లీజుకివ్వాలని సూచించింది.

జీవోలున్నా.. కలెక్టర్​ చెప్పినా లెక్కలేదు

జీవో నెం.571 ప్రకారం భూమి విలువలో పది శాతం లీజు రెంట్​గా చెల్లించాలి. అంటే రూ.505 కోట్ల విలు వున్న భూమికి ఏడాదికి రూ.50 కోట్లు చెల్లించాలి. ఐదేండ్లకోసారి 10% చొప్పున పెంచుతూ పోవాలి.  అంటే 60ఏండ్ల లీజు కోసం.. ప్రభుత్వానికి దాదాపు రూ.5 వేల కోట్లకు పైగా చెల్లించాల్సి వస్తుంది. కానీ.. హెటిరో పార్థసారథిరెడ్డి తమవాడు కావటంతో అంత కంటే కారుచౌకగా కట్టబెట్టేందుకు సర్కారు భారీ తతం గం నడిపింది.  నిబంధనల ప్రకారం ఆ ఫౌండేషన్​కు కేవలం 3 ఎకరాలు కేటాయించేందుకు  సీసీఎల్​ఏ స్పెషల్  సెక్రటరీకి  కలెక్టర్​ లెటర్​ రాస్తే పట్టించుకోలేదు.  11 ఎకరాలివ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.  10 ఎకరాలివ్వాలని సీసీఎల్​ఏ రెకమండ్​ చేసింది. కానీ, 15 ఎకరాల్లో ఫౌండేషన్​ నిర్మాణాలు మొదలుపెట్టిం ది. అదే టైమ్​లో పార్థసారథి రెడ్డి మళ్లీ చక్రం తిప్పారు. అప్పుడెప్పుడో 1989లో  బసవతారకం హాస్పిటల్​కు లీజుకు ఇచ్చిన తరహాలోనే  ఏడాదికి కేవలం రూ.50 వేలకు లీజు ఇవ్వాలని ప్రభుత్వానికి లెటర్​ పెట్టుకున్నారు. తాము కట్టే క్యాన్సర్ హాస్సిటల్​లోనూ  25%  మంది ఇన్​పేషంట్లకు, 40%  మంది ఔట్​ పేషెంట్లకు ఫ్రీ ట్రీట్​మెంట్​ ఇస్తామని  చెప్పుకున్నారు. ప్రభుత్వానికి రూ.5వేల కోట్లకుపైగా నష్టమని తెలిసినా..  పార్థసారథిరెడ్డికి భూములను కట్టేందుకు డిసైడైన సర్కారు దానికి కూడా ఊకొట్టింది. ఏడాదికి రూ.1.47 లక్షల లీజు చెల్లించేలా.. మూడేండ్లకోసారి 5% పెంచే నిబంధనతో భూమి అప్పగించాలని స్పెషల్​ మెమో జారీ చేసింది. 60ఏండ్లలో రూ.5వేల కోట్లకుపైగా ఆదాయం వచ్చే స్థలాన్ని అంత అగ్గువకు ఎందుకిచ్చారని హైకోర్టు ఆగ్ర హం వ్యక్తం చేస్తూ కేటాయింపును రద్దు చేసింది. 

ఎవరీ పార్థసారథి

దేశంలో ఉన్న ఎంపీలందరిలో అత్యంత సంపన్నుడు పార్థసారథి రెడ్డి. ఖమ్మం జిల్లాకు చెందిన ఆయన..  హెటిరో గ్రూప్​ చైర్మన్. ఇటీవలే బీఆర్​ఎస్​ ఆయనను రాజ్యసభ సభ్యుడిగా నామినేట్​ చేసింది. తనకు, తన కుటుంబ సభ్యుల పేరిట రూ. 5,300 కోట్ల ఆస్తులున్నట్లు ఎంపీగా ఎన్నికైన టైమ్​లో అఫిడవిట్​లో పార్థసారథి పొందుపరిచారు. మరోవైపు ఆయనపై డ్రగ్స్​ అండ్​ కాస్మెటిక్స్​ యాక్ట్ కింద నాలుగు కేసులు ఉన్నాయి. 2012లోనే జడ్చర్ల సెజ్​లో 75 ఎకరాల భూముల అక్రమ కేటాయింపులకు సంబంధించి పార్థసారథిపై 420 కేసును సీబీఐ నమోదు చేసింది.

హైకోర్టు అంటే లెక్కలేదు

హెటిరో పార్థసారథిరెడ్డికి భూముల కేటాయింపును సవాల్​ చేస్తూ 2019 ఏప్రిల్​లోనే హైకోర్టులో పిల్​ దాఖలైంది. ఆ స్థలంతో పాటు అక్కడ చేపట్టే నిర్మాణాలన్నీ  ఈ కేసులో ఇచ్చే తుది తీర్పుకు లోబడి ఉంటాయని అప్పుడే హైకోర్టు ఇంటరిమ్​ ఆర్డర్​ ఇచ్చింది. ప్రభుత్వ పెద్దల అండదండలుండటంతో అదేమీ పట్టించుకోకుండా.. ఖానామెట్​లో భారీ నిర్మాణాలు చేపట్టారు. భవన నిర్మాణ అనుమతికి రూ.20 కోట్లు చెల్లించాలని జీహెచ్​ఎంసీ లెటర్​ రాసినప్పటికీ.. ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా  చెల్లించలేదని తెలిసింది. బిల్డింగ్​ నిర్మాణం కూడా పూర్తయింది. ఇదంతా ప్రభుత్వ పెద్దలు నడిపిన తతంగమైనందున.. ఆ ఫీజు కూడా  ఏదో రహస్య జీవోలతో మినహాయించారనే  ప్రచారం జరుగుతున్నది. అందుకే అంత భారీ కట్టడం చివరి దశకు చేరుకున్నా జీహెచ్​ఎంసీ ఆఫీసర్లు అటు వైపు వెళ్లటం లేదని తెలుస్తున్నది.