డీఎంఈగా డాక్టర్ త్రివేణి

డీఎంఈగా డాక్టర్ త్రివేణి

హైదరాబాద్‌‌, వెలుగు: మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌‌‌‌గా డాక్టర్ బి.త్రివేణిని నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులిచ్చింది. ఆర్డర్స్ వచ్చిన వెంటనే డాక్టర్ రమేశ్‌‌రెడ్డి నుంచి త్రివేణి డీఎంఈగా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం అడిషనల్ డీఎంఈ హోదాలో ఉన్న త్రివేణి ఉస్మానియా ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. తనకు డీఎంఈగా అవకాశం ఇచ్చిన హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహకు, ప్రభుత్వానికి త్రివేణి కృతజ్ఞతలు తెలిపారు. సీనియార్టీ లిస్ట్‌‌లో టాప్‌‌లో ఉన్న త్రివేణికి డీఎంఈగా బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం, లిస్ట్‌‌లో రెండో స్థానంలో ఉన్న డాక్టర్ శివరామ్ ప్రసాద్‌‌కు అకాడమిక్‌‌ డీఎంఈగా బాధ్యతలు అప్పగించింది.

 ప్రస్తుతం జగిత్యాల మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న ఆయన, బుధవారం హైదరాబాద్‌‌లోని డీఎంఈ ఆఫీసులో బాధ్యతలు తీసుకున్నారు. జూనియర్లను హెచ్‌‌వోడీలుగా నియమించడాన్ని ప్రతిపక్షంగా ఉన్నప్పుడు తప్పుబట్టిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చాక సీనియర్లకు ఆ బాధ్యతలను అప్పగిస్తామని హామీ ఇచ్చింది. ఆ మేరకు తమ హామీని నిలబెట్టుకుంటూ ఇద్దరు సీనియర్లను హెచ్‌‌వోడీలుగా నియమించింది. అయితే, గతంలో డీఎంఈ, డీఎంఈ అకాడమిక్ పోస్టులు ఒకరికే ఇచ్చే వారు.. ఇప్పుడు రెండు పోస్టుల్లో ఇద్దరిని నియమించారు.

గాంధీ  ప్రిన్సిపాల్‌‌గా రమేశ్‌‌ రెడ్డి

అడిషనల్ డీఎంఈ హోదాలో ఉన్న డాక్టర్ రమేశ్‌‌ రెడ్డి.. ఇన్నాళ్లు డీఎంఈగా, గాంధీ మెడికల్​ కాలేజీ ప్రిన్సిపాల్‌‌గా బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు డీఎంఈ బాధ్యతల నుంచి ప్రభుత్వం ఆయనను తప్పించింది. గాంధీ కాలేజీ ప్రిన్సిపాల్‌‌గా కొనసాగేందుకు అవకాశం ఇచ్చింది.