
- డాక్టర్ల స్థానంలో నర్సులు
- పల్లె దవాఖాన్లలో నియామకానికి సర్కార్ గ్రీన్ సిగ్నల్
- గతేడాది ఇచ్చిన జీవోకు మార్పులు
హైదరాబాద్, వెలుగు: పల్లె దవాఖాన్లలో మెడికల్ ఆఫీసర్లు లేదా మిడ్ లెవల్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్‌గా(ఎంఎల్‌హెచ్‌పీ) నర్సులను నియమించుకునేందుకు ఆరోగ్యశాఖకు రాష్ట్ర సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పల్లె దవాఖాన్లలో ఎంబీబీఎస్ డాక్టర్లను మాత్రమే నియమిస్తామని, నర్సులను మెడికల్ ఆఫీసర్లుగా నియమించబోమని గతంలో ఇచ్చిన జీవోను సవరిస్తూ శుక్రవారం కొత్త జీవో రిలీజ్ చేసింది. బీఎస్సీ నర్సింగ్ లేదా జీఎన్‌ఎం (జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ) కోర్సులు పూర్తి చేసి, కమ్యూనిటీ హెల్త్‌లో ఆర్నెళ్ల బ్రిడ్జ్ కోర్సు పూర్తి చేసిన నర్సులు పల్లె దవాఖాన్లలో పోస్టులకు అర్హులుగా పేర్కొంది. 2020 తర్వాత బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన నర్సులు, బ్రిడ్జ్ కోర్సు చేయకపోయినా అర్హులేనని స్పష్టం చేసింది. అయితే, రిక్రూట్‌మెంట్‌లో తొలుత ఎంబీబీఎస్ డాక్టర్లకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఆ తర్వాత బీఏఎంఎస్ (బ్యాచులర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ) డాక్టర్లకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. ఈ రెండు అర్హతలు ఉన్నవాళ్లు లేకుంటే నర్సులను తీసుకోవాలని ఆదేశించింది. బస్తీ దవాఖాన్లలో మాత్రం ఎంబీబీఎస్ డాక్టర్లు లేదా బీఏఎంఎస్ డాక్టర్లను నియమించుకోవాలని సూచించింది. డాక్టర్లకు రూ.40 వేల చొప్పున, నర్సులకు రూ.29,900 చొప్పున వేతనం ఇవ్వనున్నారు.
తొలుత వద్దని, ఇప్పుడు కావాలని..
దేశంలో ఉన్న లక్షన్నర సబ్ సెంటర్లను హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్లుగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం రెండేండ్ల కిందట నిర్ణయించింది. ఇందుకోసం నేషనల్ హెల్త్ మిషన్ కింద నిధులను కేటాయిస్తోంది. ప్రతి వెల్‌నెస్ సెంటర్‌లో ఎంఎల్‌హెచ్‌పీగా కమ్యునిటీ మెడిసిన్‌లో బ్రిడ్జ్ కోర్సు పూర్తి చేసిన నర్సులను నియమించి, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు వైద్య సేవలను అందుబాటులోకి తేవాలన్న ఉద్దేశంతో ఈ స్కీమ్‌ను ప్రారంభించారు. మన రాష్ట్ర సర్కార్ హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్లను పల్లె దవాఖాన్లుగా పేరు మార్చి, ప్రతి దవాఖానకు ఒక డాక్టర్‌ను నియమిస్తామని గతేడాది ప్రకటించింది. 1,628 పోస్టులకు నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. నెలకు రూ.40 వేలు మాత్రమే ఇస్తుండడంతో పల్లె దవాఖాన్లలో పనిచేసేందుకు డాక్టర్లు ముందుకు రాలేదు.
ఆఫీసర్ల తప్పులు
పల్లె దవాఖాన్లలో డాక్టర్లు చేరకపోవడానికి రెండు కారణాలున్నాయని అంటున్నారు. పల్లె దవాఖాన్ల పోస్టులను రెగ్యులర్ బేసిస్‌లో నియమించకుండా, కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. జీతం రూ.40 వేలు మాత్రమే ఇస్తున్నారు. ఇంకే అలవెన్సులూ ఉండవు. కాంట్రాక్టు బేసిస్‌పై పనిచేసే డాక్టర్లకు రెగ్యులర్ పోస్టుల నియామకంలో వెయిటేజీ ఇస్తున్నారు. పల్లె దవాఖాన్లలో పనిచేసే డాక్టర్లకు, జీహెచ్‌ఎంసీ, ఇతర అర్బన్ ఏరియాల్లోని బస్తీ దవాఖాన్లలో పనిచేసే డాక్టర్లకు సమానంగా వెయిటేజీ మార్కులు ఇస్తున్నారు. దీంతో అర్బన్‌లోని బస్తీ దవాఖాన్లలో పనిచేసేందుకే డాక్టర్లు మొగ్గు చూపుతున్నారు.