‘సీఎం బ్రేక్ ఫాస్ట్’ స్కీమ్ గైడ్ లైన్స్ ఏవీ

‘సీఎం బ్రేక్ ఫాస్ట్’ స్కీమ్ గైడ్ లైన్స్ ఏవీ
  • ‘సీఎం బ్రేక్ ఫాస్ట్’ స్కీమ్ గైడ్ లైన్స్ ఏవీ
  • 26 నుంచి అమలు చేస్తామన్న సర్కార్
  • యూనిట్ కాస్ట్.. ఎవరు పెట్టాలనే దానిపై నో క్లారిటీ
  • ఒక్కో స్టూడెంట్​కు రూ.10.50 ఇస్తామంటూ ఓరల్ గా వెల్లడి
  • అధికారిక ఉత్తర్వులిస్తేనే అమలు చేస్తమంటున్న ఏజెన్సీలు

హైదరాబాద్, వెలుగు: సర్కారు బడుల్లో చదివే స్టూడెంట్లకు అందిస్తామన్న‘సీఎం బ్రేక్ ఫాస్ట్’ స్కీమ్ అమలుపై అయోమయం నెలకొన్నది. దసరా నుంచి అమలు చేస్తామని ప్రకటించిన రాష్ట్ర సర్కారు ఇప్పటి వరకూ ఆ స్కీమ్ గైడ్ లైన్స్ రిలీజ్ చేయలేదు. దీంతో సెలవుల తెల్లారి నుంచి బడుల్లో బ్రేక్ ఫాస్ట్ అందుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 27,147 సర్కారు స్కూళ్లలో సుమారు 23 లక్షల మంది చదువుతున్నారు. వీరికి రోజూ ఉదయం టిఫిన్ అందించేందుకు ఈ నెల 6న ‘సీఎం బ్రేక్ ఫాస్ట్’ స్కీమును ప్రభుత్వం ప్రారంభించింది.

దసరా రోజు నుంచే ప్రారంభించాలని సర్కారు నిర్ణయించినా, ఎన్నికల కోడ్ వస్తుందనే సంకేతాలతో తేదీ ముందుకు జరిపారు. 6న రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గానికి ఒక స్కూల్​లో స్కీమును రాష్ట్ర మంత్రి, స్థానిక ఎమ్మెల్యే లాంఛనంగా ప్రారంభించారు. ఆ తర్వాత ఆరు రోజుల పాటు ఆయా బడుల్లో దీన్ని హెడ్మాస్టర్లు సొంత డబ్బులతో కొనసాగించారు. ఆ డబ్బులు ఎప్పుడు ఇస్తారో, ఎంత ఇస్తారో కూడా ఇప్పటికీ సర్కారు స్పష్టత ఇవ్వలేదు.

గైడ్​లైన్స్ ఇవ్వాలె..

ఈ నెల13 నుంచి 25 వరకూ స్కూళ్లకు దసరా సెలవులు ఉన్నాయి. 26న బడులు రీఓపెన్ కానున్నాయి. ఆ రోజు నుంచే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లలో సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, ఇప్పటివరకూ ఆ స్కీమ్ గైడ్​లైన్స్ ను విద్యాశాఖ రిలీజ్ చేయలేదు. దీంతో స్కీమ్ అమలుపై నీలినీడలు అలుముకున్నాయి. ఒక్కో స్టూడెంట్​కు టిఫిన్​కు ఇచ్చే యూనిట్ కాస్ట్ ఎంత? దీన్ని ఎవరు మానీటరింగ్ చేయాలి.. టిఫిన్ ఎవరు వండిపెట్టాలనే దానిపై అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు.

మరోపక్క స్కూల్ టైమింగ్​కు ముందే దీన్ని స్టూడెంట్లకు పెట్టాల్సి ఉంటుంది కనుక, దీన్ని టీచర్లే మానిటరింగ్ చేయాలా అనే అంశంపై క్లారిటీ రాలేదు. మరోపక్క మిడ్డేమీల్స్ కార్మికులకు కోట్ల రూపాయల బకాయిలున్నాయి. వాటిని రిలీజ్ చేయాలని వారంతా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో, ఆందోళనలు వాయిదా వేసుకున్నారు. కొత్తగా వేతనం పెంచకుండా టిఫిన్ వండిపెట్టేందుకు మిడ్డేమీల్స్ కార్మికులు ముందుకు వస్తారా అనేది అనుమానమే. మరోపక్క హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో కార్మికులతో కాకుండా అక్షయపాత్ర, మన్నా, హరేరామ హరేకృష్ణ తదితర సంస్థలతో పిల్లలకు భోజనం అందిస్తున్నారు. ఆ స్టూడెంట్లకు టిఫిన్  ఎవరు పెడ్తారనే దానిపై స్పష్టత కరువైంది. 

ఒక్కో స్టూడెంట్​కు రూ.10.50పైసలు!

రోజూ ఉదయం స్టూడెంట్లకు అందించే టిఫిన్ ధరను విద్యాశాఖ నిర్ణయించినట్టు తెలిసింది. ఒక్కో స్టూడెంట్​కు రూ.10.50 చొప్పున ఇవ్వాలనే విద్యాశాఖ ప్రపోజల్స్​కు సర్కారు ఆమోదం తెలిపినట్టు సమాచారం. కానీ, దీన్ని అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు. మరోపక్క మిడ్డేమిల్స్ కార్మికులతోనే ఈ పనులు చేయించాలని అధికారులు భావిస్తున్నారు. అదనపు పనికి గానూ కార్మికులకు రూరల్ ఏరియాల్లో రూ.2వేలు, అర్బన్ ఏరియాల్లో రూ.వెయ్యి ఇవ్వాలని నిర్ణయించారు. గురువారం డీఈవోలతో స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీదేవసేన, ఎస్ఎస్ఏఏఎస్​పీడీ రమేశ్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

మిడ్డేమీల్స్ కార్మికులకు కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్​లో ఉన్నాయని, త్వరలోనే అవి క్లియర్ చేస్తామని శ్రీదేవసేన వారికి చెప్పారు. సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ ఒకేసారి అన్ని బడుల్లో కాకుండా, దశలవారీగా ప్రారంభించాలని సూచించారు. ఎన్నికల తర్వాత వంటపాత్రలకు టెండర్లు వేస్తామన్నారు. గతంలో టిఫిన్ ఖర్చులు పెట్టుకున్న వారు బిల్లులు పెట్టుకోవాలని, వాటిని క్లియర్ చేస్తామని ఆమె వివరించారు. అయితే, బయట టిఫిన్ రూ.20–30 ఉంటే, పది రూపాయలు ఎలా సరిపోతుందని డీఈవోలు తలలు పట్టుకుంటున్నారు. అధికారికంగా ఉత్తర్వులు వస్తేనే, సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ అమలు చేస్తామని స్పష్టం చేస్తున్నారు