కేంద్ర ప్రభుత్వంపై మంత్రి హరీశ్‌‌ రావు ఫైర్‌‌‌‌​

 కేంద్ర ప్రభుత్వంపై మంత్రి హరీశ్‌‌ రావు ఫైర్‌‌‌‌​

మెదక్, వెలుగు: బాయికాడ మోటార్లకు మీటర్లు వద్దని చెప్పినందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రావాల్సిన రూ.30 వేల కోట్లను ఆపి వేసిందని ఆర్థిక మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. లక్షల మంది రైతుల ప్రయోజనమే తమకు ముఖ్యమని, అందుకే మోటార్లకు మీటర్లు వద్దని సీఎం కేసీఆర్‌‌ చెప్పారని వెల్లడించారు. గురువారం మెదక్ జడ్పీ జనరల్ బాడీ మీటింగ్‌‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. మీటింగ్‌‌లో పలువురు జడ్పీటీసీలు అభివృద్ధి పనులకు నిధులు కావాలని కోరగా, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కేంద్ర ప్రభుత్వం నిధులు ఆపిందన్నారు. దానివల్ల అభివృద్ధి పనులకు కొంత ఇబ్బంది అవుతోందని, ఆ నిధులు వస్తే మరెన్నో మంచి పనులు చేసేవాళ్లమని పేర్కొన్నారు. కాగా, రాష్ట్రంలో త్వరలో 1,000 మంది కొత్త డాక్టర్లను రిక్రూట్‌‌ చేసుకుంటామని వెల్లడించారు. దసరా పండుగలోపు వారికి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తామని చెప్పారు.