ఉమ్టా మళ్లీ యాక్టివ్ ! .. హైదరాబాద్ లో సమగ్ర ట్రాఫిక్​ ప్లాన్​కు సర్కార్ ఫోకస్

ఉమ్టా మళ్లీ యాక్టివ్ ! .. హైదరాబాద్ లో సమగ్ర  ట్రాఫిక్​ ప్లాన్​కు సర్కార్ ఫోకస్
  • ఉమ్టా మళ్లీ యాక్టివ్ ! .. హైదరాబాద్ సమగ్ర  ట్రాఫిక్​ ప్లాన్​కు సర్కార్ ఫోకస్ 
  •  భారీగా పెరిగిపోయిన ట్రాన్స్ పోర్ట్ ఇబ్బందులు  
  • రోడ్డు విస్తరణ, ఆధునిక  సిగ్నలింగ్​అమలుకు చర్యలు
  • ఇంటిగ్రేటెడ్​ ప్లానింగ్​ విధానంతో​ప్రాబ్లమ్స్ చెక్ 
  • కమిటీ ఏర్పాటుపై అధికార వర్గాల్లో జోరుగా చర్చ  

హైదరాబాద్,వెలుగు : గ్రేటర్​ సిటీలో ట్రాఫిక్​ సమస్యలను పరిష్కరించేందుకు, భవిష్యత్​లో ఉత్తమ ట్రాన్స్​పోర్ట్​ విధానం తెచ్చేందుకు కొత్త ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. కొంతకాలంగా యాక్టివ్ లో లేని యూనిఫైడ్​ మెట్రోపాలిటన్​ ట్రాన్స్​పోర్ట్​అథారిటీ(ఉమ్టా)ను మళ్లీ తేనున్నట్టు  చర్చ జరుగుతోంది. హెచ్ఎండీఏలో ప్రత్యేక విభాగమైన ఉమ్టాను మరింత చురుగ్గా వినియోగించుకునేలా అధికారులు సిద్ధమవుతున్నట్టు సమాచారం.  హెచ్ఎండీఏ ప్రొసీడింగ్ గా వ్యవహరించే ఉమ్టా ప్రత్యేక కమిటీలో ప్రభుత్వ చీఫ్​సెక్రటరీ చైర్మన్ గా, ఎంఏయూడీ ప్రిన్సిపల్​సెక్రటరీ కన్వీనర్ గా,  సిటీలోని కీలక శాఖల ఉన్నతాధికారులు సభ్యులుగా ఉంటారు. హెచ్ఎండీఏ, వాటర్​ బోర్డు, పోలీస్​, ఆర్టీఏ, ఆర్టీసీ, మెట్రోరైల్, ఆర్​అండ్​బీ వంటి తదితర శాఖలన్నీ ఒకే గొడుగు కిందకు వచ్చి పని చేస్తాయి.

 ప్రతి రెండు నెలలకోసారి ప్రత్యేకంగా కమిటీ సమావేశమవుతుంది. సిటీలో ట్రాఫిక్​, ట్రాన్స్​పోర్ట్​సమస్యలపై చర్చించి నిర్ణయం తీసుకుంటుంది. కమిటీ సూచనల మేరకు ఆయా శాఖలు పనులు నిర్వహించాలి. ముఖ్యంగా అన్ని శాఖలు సమన్వయంతో పని చేస్తే  మరింత మెరుగైన ఫలితాలు వస్తాయనేదే ఉమ్టా ప్రధానోద్ధేశమని అధికారులు పేర్కొంటున్నారు. అయితే.. దాదాపు రెండేండ్లుగా ఉమ్టా కమిటీ భేటీ కావడం లేదు. దీంతో  సిటీలోని వివిధ శాఖలు తమ పనులను నేరుగా చేసుకుంటున్న పరిస్థితి ఉంది. 

 మరింత పటిష్టం చేసేందుకు నిర్ణయం

హెచ్ఎండీఏకు అనుబంధమైన ఉమ్టా పరిధిని జీహెచ్ఎంసీతో పాటు మేడ్చల్, రంగారెడ్డి, భువనగిరి, సంగారెడ్డి ప్రాంతాలను కలిపి ఏర్పాటుచేశారు. ప్రస్తుతం దీనిని మరింత బలోపేతం చేసే చర్యలకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలిసింది. మళ్లీ యాక్టివ్ అయితే గ్రేటర్ సిటీలో భవిష్యత్ లో ట్రాఫిక్​సమస్యలకు చెక్ పెట్టొచ్చని అధికారులు భావిస్తున్నారు. 

గతంలో ఉమ్టా ద్వారానే ట్రాఫిక్​మేనేజ్​మెంట్ విధానానికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు కొత్త టెక్నాలజీతో ట్రాఫిక్​సిగ్నలింగ్, ట్రాన్స్ పోర్టేషన్​అమలుకు కూడా సర్కార్ రెడీ అయితున్నట్టు సమాచారం. ఇప్పటికే గ్రేటర్​సిటీలో ట్రాఫిక్​సమస్యలు భారీగా పెరిగిపోగా.. నియంత్రించడం కష్టంగా మారింది. దీంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు ఉమ్టా పని చేస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఓఆర్ఆర్​ చుట్టూ ఉన్న గ్రామాలు, విల్లాలు, కాలనీలతో అర్బనైజేషన్​గా మారింది. 

తద్వారా భారీగా ట్రాఫిక్​సమస్యలు కూడా పెరిగాయి. ప్రస్తుతం గ్రేటర్​సిటీలో రోడ్ల విస్తరణ, రోడ్ల కటింగ్​వంటివి ఏ శాఖ తమకు తామే ఇష్టానుసారంగా పనులు చేసుకుంటుంది. ఉమ్టాను మళ్లీ యాక్టివ్​చేస్తే ఆయా పనులు సంబంధిత శాఖల సమన్వయంతో పూర్తి చేయొచ్చు. పెరిగిన జనాభా అవసరాలు, షాపింగ్​కల్చర్​తో పార్కింగ్​ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువైంది. వీటిలో ఉమ్టా జోక్యం చేసుకుంటే మంచి ట్రాఫిక్​పాలసీని కూడా తీసుకురావచ్చు. గతంలో బస్​బేలతో ఆర్టీసీ ట్రాన్స్​పోర్ట్ ను మరింత బలోపేతం చేశారు. పలు ప్రాంతాల్లో ఫుట్​పాత్​ల నిర్మాణంతో సిటీవాసులకు  ఇబ్బందులు లేకుండా అమలు చేశారు. మళ్లీ ఉమ్టాను యాక్టివ్ చేస్తే.. సిటీలో ఉత్తమ ట్రాన్స్​పోర్టేషన్​అమలు చేయవచ్చని అధికారులు చెబుతున్నారు. 

ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు..  

 ఉమ్టా యాక్టివ్ అయితే.. తద్వారా ట్రాఫిక్​ సమస్యలకు చెక్​ పెట్టేందుకు ట్రాఫిక్​మేనేజ్​మెంట్, అవసరమైన చోట్ల రోడ్ల విస్తరణ, పార్కింగ్​ పాలసీ, ఉత్తమ ప్లానింగ్, ఇంప్లిమెంటేషన్, నిధుల సేకరణ, ప్రమాణాలతో కూడిన పనులను చేపట్టడానికి చాన్స్ ఉంటుంది. గతంలో ట్రాఫిక్​సమస్యల నివారణ, ట్రాన్స్​పోర్టేషన్​వంటి అంశాలపైనే దృష్టి పెట్టింది. హెచ్ఎండీఏ పరిధిలో ఔటర్​రింగ్​రోడ్, ఫ్లై​ఓవర్ల నిర్మాణం, ఇన్నర్​రింగ్​రోడ్లు, రేడియల్​రోడ్లు​ వంటివాటితో పాటు పార్కింగ్​పాలసీతో పలు ప్రాంతాల్లో మల్టీలెవెల్​పార్కింగ్​లాట్లను నిర్మించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఉమ్టా సూచనల మేరకు చాలా ప్రాంతాల్లో రోడ్ల విస్తరణ, బస్​బేల నిర్మాణం, రోడ్ల​ కటింగ్​పాలసీ వంటివి అమలు చేశారు. 

జంటనగరాల్లో మెట్రో రైల్, రోడ్​, పబ్లిక్ ​ట్రాన్స్​పోర్ట్​ వ్యవస్థలను సక్రమంగా అమలు చేస్తే ట్రాఫిక్​ ప్రాబ్లమ్స్ చాలావరకు పరిష్కరించవచ్చని కూడా సూచించింది. ఉమ్టా కమిటీలో వివిధ శాఖల ఉన్నతాధికారులు సభ్యులుగా ఉండడం ద్వారా ఏ శాఖ నిర్వహించే పనులకైనా అన్నివిభాగాల సహకారం తీసుకుని వాటిని పూర్తి చేసేందుకు అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. సిటీలో ట్రాఫిక్, ట్రాన్స్​ పోర్టేషన్ ​సమస్యల పరిష్కారానికి ఉమ్టాను మళ్లీ యాక్టివ్ చేయాలనే చర్చ కూడా అధికార వర్గాల్లో నడుస్తుంది.