స్కీమ్​లు, శాలరీలు, కిస్తీలకు రూ. 66 వేల 5 వందల కోట్లు

స్కీమ్​లు, శాలరీలు, కిస్తీలకు రూ. 66 వేల 5 వందల కోట్లు
  •     120 రోజుల్లో చేసిన ఖర్చును వెల్లడించిన రాష్ట్ర సర్కారు
  •     నెలకు యావరేజ్ గా రూ.16  వేల కోట్లపైనే వ్యయం 
  •     రైతు భరోసా 93 శాతం పూర్తి
  •     రైతు బీమా, చేయూత, ఉచిత బస్సు స్కీం, డైట్, ఆరోగ్య శ్రీ, గృహ జ్యోతి, ఉచిత విద్యుత్​సబ్సిడీ.. అన్నింటికీ ప్రాధాన్యం

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం  డిసెంబర్​నుంచి ఏప్రిల్​15 వరకు ముఖ్యమైన స్కీమ్స్,   శాలరీలు, అప్పుల కిస్తీలకు రూ.66,507 కోట్లు ఖర్చు చేసింది. గత ప్రభుత్వం మొదలుపెట్టిన పథకాలు అయినప్పటికీ దేనినీ పెండింగ్​లో పెట్టలేదు. ఏయే పథకానికి ఎంత నిధులు విడుదల చేసిందో తెలిపే రిపోర్ట్​ను సర్కారు తాజాగా, విడుదల చేసింది.  

ఒకటో తేదీనే ఉద్యోగాలకు జీతాలు అందించడంతోపాటు చేయూత కింద ఆసరా పెన్షన్లు, మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ ఉచిత ప్రయాణం, గృహజ్యోతి, రాజీవ్ ఆరోగ్యశ్రీ, రూ.500కే గ్యాస్​ సిలిండర్​, రైతుబీమా, రైతు భరోసా అమలుకు నిధులు ఇచ్చింది. డైట్, మిడ్​ డే మీల్స్​ బిల్స్​తో పాటు, హోంగార్డులు, అంగన్​వాడీలకు శాలరీలు చెల్లించింది. గత ప్రభుత్వం చేసిన అప్పులకు కిస్తీలు, వడ్డీలతో పాటు శాలరీలకే ఎక్కువ మొత్తంలో ఖర్చు చేసింది. ప్రతినెలా యావరేజ్​గా రూ.16 వేల కోట్లపైనే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. 

గ్యారంటీలకు పూర్తి స్థాయిలో..

మహాలక్ష్మి గ్యారంటీలో భాగంగా ఆర్టీసీకి  మూడు నెల‌‌ల్లో రూ.1,125 కోట్లు రిలీజ్ చేసింది. 200  యూనిట్ల ఉచిత విద్యుత్​కోసం గృహ‌‌జ్యోతి స్కీమ్​కు రూ.200 కోట్లు విడుదల చేసింది. రాజీవ్ ఆర్యోగ్య శ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచింది. దానికి అనుగుణంగా పెండింగ్​లో ఉన్న ఆరోగ్య శ్రీ బకాయిలు రూ. 189 కోట్లు,  రూ.500కే గ్యాస్  సిలిండ‌‌ర్ కోసం రూ. 80 కోట్లు ఇచ్చింది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కోసం ఇచ్చే నిధులు గతంలో ఏడాదికి ఒకసారి లేదంటే బకాయిలు పెట్టే పరిస్థితులు ఉండేవి. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత వ్యవ‌‌సాయ క‌‌రెంట్​కు ఈ నాలుగు నెలల్లోనే రూ. 3,924 కోట్లు ఇచ్చింది.  రేష‌‌న్ బియ్యం సబ్సిడీ రూ.1,147 కోట్లు ఇవ్వగా.. మిడ్​ డే మీల్స్​కు రూ.52 కోట్లు, డైట్​ బిల్లులకు రూ.418 కోట్లు ఇచ్చింది. ఇక ఆసరా పెన్షన్ల విషయంలోనూ చేయూత కింద రూ.3,840 కోట్లు విడుదల చేసింది.  డ్వాక్రా వడ్డీలేని రుణాల ప‌‌థ‌‌కానికి రూ.267 కోట్లు రిలీజ్​ చేసింది. 

రైతు భరోసా 93 శాతం పూర్తి

యాసంగి రైతుభరోసా (రైతుబంధు) కింద 93% మంది రైతులకు ఎకరాకు5 వేల చొప్పున వారి ఖాతాల్లో సర్కారు జమచేసింది. ఇందుకు గాను రూ.5,575 కోట్లు ఇచ్చింది. ఇంకో రూ.1,500 కోట్ల మేర నిధులు అవసరం ఉండగా.. వారం, పదిరోజుల్లో విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నది. అదే సమయంలో రైతుబీమాకు గత ప్రభుత్వం పెండింగ్​లో పెట్టిన రూ.734 కోట్లు రిలీజ్​ చేసింది. మొత్తం ఖర్చు చేసిన దాంట్లో శాలరీలు, ఇంట్రెస్ట్​ పేమెంట్స్​కే ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. 4 నెలల్లో శాలరీలకు రూ.22,328 కోట్లు, కిస్తీలు, వడ్డీలకు రూ.26,374 కోట్లు ఇచ్చింది.