
హైదరాబాద్: సూర్యాపేటతో పాటు ప్రభావిత ప్రాంతాల్లో కూడా ప్రజలందరికీ కరోనా పరీక్షలు జరపాలన్న పిటిషన్‌పై హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. సూర్యాపేటకు చెందిన వరుణ్ సంకినేని దాఖలు చేసిన పిటిషన్ పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపింది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో తక్కువ పరీక్షలు చేస్తున్నారన్న పిటిషనర్ వాదనపై.. ప్రజలందరికీ కరోనా పరీక్షలు చేయడం ఎలా సాధ్యమవుతుందని హైకోర్టు ప్రశ్నించింది. బలవంతంగా కరోనా పరీక్షలు చేస్తే ప్రజల్లో భయాందోళనలు పెరుగుతాయని తెలిపింది. ప్రజలందరికీ పరీక్షలు చేస్తే పరీక్ష కిట్లు, లేబొరేటరీలు సరిపోతాయా? అని హైకోర్టు ప్రశ్నించింది. లాక్ డౌన్ తో ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా మారినప్పటికీ.. కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నిస్తోందని తెలిపింది. అనంతరం అడ్వకేట్ జనరల్ వాదనల కోసం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.