రిపబ్లిక్​ డే పరేడ్​తో జరపాల్సిందే

రిపబ్లిక్​ డే పరేడ్​తో జరపాల్సిందే
  • కేంద్ర గైడ్‌లైన్స్‌ అమలు చేయాల్సిందే
  • రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చిచెప్పిన హైకోర్టు
  • కరోనా వల్లే జరపడం లేదన్న సర్కార్​
  • కరోనా ఉంటే.. ఆంక్షలు ఎక్కడున్నయో చెప్పాలన్న బెంచ్​
  • వేడుకలకు వెంటనే ఏర్పాట్లు చేయాలని ఆదేశం
  • ప్రభుత్వ తీరుపై గవర్నర్​ తమిళిసై అసంతృప్తి
  • సభలకు లేని కరోనా.. రిపబ్లిక్​ డేకు ఎందుకని ప్రశ్న!
  • చివరికి రాజ్​భవన్​లోనే పరేడ్​తో నిర్వహిస్తామని సర్కార్​ ప్రకటన'

హైదరాబాద్, వెలుగు: రిపబ్లిక్​ డే విషయంలో రాష్ట్ర సర్కార్​ అనుసరిస్తున్న తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్రం గైడ్​లైన్స్​కు తగ్గట్టుగా వేడుకలను ఘనంగా జరపాల్సిందేనని, జనాన్ని అనుమతించాల్సిందేనని, పరేడ్​ చేపట్టాల్సిందేనని  ఆదేశించింది. కరోనా ప్రభావం ఉన్నందున జరపడం లేదన్న రాష్ట్ర  ప్రభుత్వ వాదనను హైకోర్టు తోసిపుచ్చింది.  గణతంత్ర దినోత్సవం అనేది దేశభక్తిని చాటి చెప్పే ముఖ్యమైన జాతీయ పండుగ అని గుర్తుచేసింది. గణతంత్ర స్ఫూర్తిని చాటేలా వేడుకలు జరపాలని స్పష్టం చేసింది. జాతీయస్థాయిలో జరిగే వేడుకకు సంబంధించిన గైడ్‌‌లైన్స్‌‌ జారీ చేయాల్సింది. కేంద్ర సర్కారేనని, రాష్ట్రం కాదని గుర్తు చేసింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించాలని కేంద్రం ఈ నెల 19న ఇచ్చిన సర్క్యులర్‌‌ను రాష్ట్రం అమలు చేసి తీరాలని జస్టిస్‌‌ పి. మాధవీ దేవి ధర్మాసనం బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వుల ప్రతిని రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసి, వెంటనే రిపబ్లిక్​ డే వేడుకలకు ఏర్పాట్లు చేసేలా చర్యలు తీసుకునేలా చూడాలని అడ్వకేట్​ జనరల్​కు తేల్చిచెప్పింది. రిపబ్లిక్​ డే వేడుకల విషయం రాష్ట్ర సర్కారు తీరును సవాల్​ చేస్తూ హైదరాబాద్​లోని గౌలిపురాకు చెందిన కె.శ్రీనివాస్‌‌ బుధవారం అత్యవసర లంచ్‌‌మోషన్‌‌ పిటిషన్‌‌ దాఖలు చేశారు. 

కరోనా ఉంటే.. ఆంక్షలు ఎక్కడున్నయ్​?

రిపబ్లిక్​ డే వేడుకల నిర్వహణపై వాదనల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌‌ జనరల్‌‌ బీఎస్‌‌ ప్రసాద్‌‌  హైకోర్టుకు వివరణ ఇస్తూ.. రాష్ట్రంలో కరోనా ఉన్నందున రాజ్‌‌భవన్‌‌లోనే వేడుకలు జరుపుకోవాలని రాజ్‌‌భవన్‌‌కు ఈ నెల 21న లేఖ రాసినట్లు తెలిపారు. రాజ్ భవన్‌‌లో వేడుకలకు ప్రభుత్వ ప్రతినిధులు, అధికారులు హాజరవుతారని ఏజీ చెప్పారు. రాజ్‌‌భవన్‌‌లో రిపబ్లిక్​ డే వేడుకలను ప్రజలు చూసేందుకు వెబ్‌‌ కాస్టింగ్‌‌ చేస్తామన్నారు. వాదనలు విన్న హైకోర్టు.. రిపబ్లిక్​ డే వేడుకల నిర్వహణపై రాష్ట్రాలకు కేంద్రం ఈ నెల 19న ఇచ్చిన మార్గదర్శకాలను పాటించాలని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నట్లు వైరస్​ వ్యాప్తి ఉన్నట్లయితే.. కరోనా ఆంక్షలు ఎక్కడున్నాయో చెప్పాలని ప్రశ్నించింది.  రిపబ్లిక్​ డేను వెబ్‌‌కాస్టింగ్‌‌ విధానంలో ప్రజలకు అందుబాటులో ఉంచుతామని చెప్పడం శోచనీయమంది. ఈ నెల 19 నాటి కేంద్ర ఉత్తర్వులను లెక్కలోకి తీసుకోకుండా రాష్ట్రం మెమో దాఖలు చేయడం చెల్లదని పేర్కొంది. ఇప్పటికిప్పుడు ఏర్పాట్లు చేయడం సాధ్యం కాదన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనను.. హైకోర్టు తిరస్కరించింది. తామిచ్చిన ఉత్తర్వుల ప్రతి అందిన వెంటనే రిపబ్లిక్​ వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని తేల్చి చెప్పింది. కేంద్రం నుంచి రాష్ట్ర చీఫ్‌‌ సెక్రటరీకి అందిన సర్క్యులర్‌‌లోని గైడ్‌‌లైన్స్‌‌ను అమలు చేసి తీరాలని, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో విధిగా నిర్వహించాల్సిన కార్యక్రమమని గుర్తు చేసింది. దేశవ్యాప్తంగా 1950 నుంచి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో రిపబ్లిక్‌‌ డే ఘనంగా నిర్వహించడం జరుగుతూ వస్తోందని చెప్పింది. కరోనా టైమ్‌లో జాగ్రత్తలు తీసుకుని నిర్వహించారని, ఇప్పుడు అలాగే రాజ్‌‌భవన్‌‌కు  పరిమితం చేస్తూ నిర్వహించాలన్న ప్రభుత్వ తీరు సరికాదని తెలిపింది. ఇప్పుడు కరోనా ఆంక్షలు లేవనే విషయాన్ని గుర్తుచేసింది.  కేంద్ర గైడ్​లైన్స్​ ప్రకారం రిపబ్లిక్‌‌ డేను వేడుకగా నిర్వహించాలని,  ఎక్కడ జరపాలన్నది ప్రభుత్వ ఇష్టమని పేర్కొంది. 

రాజ్​భవన్​లో పరేడ్​.. 

హైకోర్టు ఆదేశాలతో చివరికి రిపబ్లిక్​ డే వేడుకలను పరేడ్​తో నిర్వహించేందుకు సర్కార్​ అంగీకరించింది. సికింద్రాబాద్​లోని పరేడ్​ గ్రౌండ్స్​లో కాకుండా.. రాజ్​భవన్​లోనే పరేడ్​తో నిర్వహించనున్నట్లు బుధవారం రాత్రి 8 తర్వాత తెలిపింది. గురువారం ఉదయం  6.30 గంటల నుంచి 7 గంటల వరకు రాజ్​భవన్​లో పోలీసు పరేడ్​ ఉంటుందని పేర్కొంది. తర్వాత 7 నుంచి 7.30 మధ్య జెండావిష్కరణ, గవర్నర్​ ప్రసంగం ఉంటుంది. ఆ వెంటనే గవర్నన్​ తమిళిసై పుదుచ్చేరికి స్పెషల్​ ఫ్లైట్​లో వెళ్లి.. అక్కడ రిపబ్లిక్​ డే వేడుకల్లో పాల్గొని తిరిగి సాయంత్రం 6 గంటల వరకు హైదరాబాద్​కు చేరుకుంటారు. సాయంత్రం రాజ్​భవన్​లోనే ఎట్​ హోం కార్యక్రమం నిర్వహిస్తారు. 

ఆ సభకు లేని కరోనా ఆంక్షలు ఇప్పుడెందుకు?: పిటిషనర్​ 

సికింద్రాబాద్‌‌లోని పరేడ్‌‌ గ్రౌండ్స్‌‌లో రిపబ్లిక్​ డే వేడుకల నిర్వహణకు రాష్ట్రంలోని బీఆర్‌‌ఎస్‌‌ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని పిటిషనర్‌‌ తరఫు సీనియర్‌‌ అడ్వకెట్​సూర్యకరణ్‌‌రెడ్డి వాదించారు. 1950 నుంచి రిపబ్లిక్‌‌ డే వేడుకల్ని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారని, కరోనా ఉన్న రెండేండ్లు మినహా మిగిలిన ఏడాదుల్లో ఘనంగా జరిగాయని చెప్పారు. ఢిల్లీలో రిపబ్లిక్‌‌ డే వేడుకలు ప్రారంభానికి ముందే రాష్ట్రాల్లో పూర్తి కావాలన్నారు. కరోనా  వ్యాప్తి లేకపోయినా దాని పేరుతో ఇప్పడు కూడా జనం వెళ్లడానికి వీల్లేకుండా రాజ్‌‌భవన్‌‌లో నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులివ్వడం అన్యాయమన్నారు.  లక్షల మందితో సభ నిర్వహించేందుకు కరోనా గైడ్‌‌లైన్స్‌‌ అడ్డుకాలేదంటూ పరోక్షంగా ఖమ్మంలో బీఆర్‌‌ఎస్‌‌ సభ గురించి చెప్పారు. రిపబ్లిక్‌‌ డే కార్యక్రమాన్ని గవర్నర్‌‌ వ్యక్తిగతంగా నిర్వహించుకోవాలంటూ రాజ్‌‌భవన్‌‌కు రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసినట్లుగా పత్రికల్లో వార్తలు కూడా వచ్చాయని తెలిపారు. సంప్రదాయంగా ఏండ్ల తరబడి పరేడ్‌‌ గ్రౌండ్స్​లో నిర్వహించడం జరుగుతోందని, ఇప్పుడు నిర్వహించేందుకు ఎందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ, కేంద్ర పాలితప్రాంతాల్లోనూ ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని, తెలంగాణలో మాత్రమే ప్రభుత్వం ఏర్పాట్లు చేయడం లేదన్నారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించినప్పటి నుంచి రిపబ్లిక్​ వేడుకల్లో గవర్నర్‌‌ జాతీయ జెండా ఎగురవేయడం ఆనవాయితీగా వస్తోందని, ఇదేమీ రాజకీయ కార్యక్రమం కాదని పేర్కొన్నారు. ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసి గణతంత్ర వేడుకలు నిర్వహించేలా ఆదేశాలివ్వాలని కోరారు. వాదనల తర్వాత హైకోర్టు.. ఈ నెల 26న రిపబ్లిక్​ డే వేడుకలను నిర్వహించి తీరాలని రాష్ట్ర సర్కార్‌‌కు తేల్చి చెబుతూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పరేడ్‌‌ కూడా నిర్వహించే ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. ప్రతివాదులైన రాష్ట్ర జీఏడీ చీఫ్‌‌ సెక్రటరీ, కేంద్ర హోం శాఖ సెక్రటరీ, కేంద్ర డిఫెన్స్‌‌ శాఖ సెక్రటరీలు కౌంటర్‌‌ పిటిషన్లు దాఖలు చేయాలంటూ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 9కి వాయిదా వేసింది.

గవర్నర్  ఆగ్రహం

పరేడ్ గ్రౌండ్స్ లో రిపబ్లిక్​ డే వేడుకలు నిర్వహించకూడదన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై గవర్నర్ తమిళిసై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఆమె కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలిసింది. లక్షల మందితో బహిరంగ సభలు నిర్వహిస్తే లేని కరోనా.. పరేడ్ గ్రౌండ్స్ లో రిపబ్లిక్ డే జరిపితే వస్తుందా అని ప్రభుత్వాన్ని గవర్నర్ ప్రశ్నించినట్లు సమాచారం. పరేడ్ గ్రౌండ్స్​లో భారీ స్థాయిలో రిపబ్లిక్ డే జరుపుకోకపోవడం, తెలంగాణ ప్రజలకు తీవ్ర అన్యాయమని ఆమె అన్నట్లు రాజ్​భవన్​ వర్గాల ద్వారా తెలిసింది. నిరుడు రిపబ్లిక్​ డే వేడుకల విషయంలోనూ రాష్ట్ర సర్కార్​ ఇదే రకంగా వ్యవహరించింది. కరోనా​ పేరుతో రాజ్​భవన్​కే వేడుకలను పరిమితం చేసింది. దీనికి సీఎం కేసీఆర్​, మంత్రులు కూడా హాజరుకాలేదు.