భూ వివాదాల కేసులను తిప్పి పంపిన హైకోర్టు

భూ వివాదాల కేసులను తిప్పి పంపిన హైకోర్టు
  • మళ్లీ జిల్లా రెవెన్యూ ట్రిబ్యునల్స్​కు
  • తీర్పు పునః సమీక్షించాలని ఆదేశం
  • మరోసారి కేసులు వేసిన బాధితులు

వనపర్తి, వెలుగు:  రెవెన్యూ కోర్టులలోని కేసుల సత్వర పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన జిల్లా రెవెన్యూ ట్రిబ్యునళ్ల పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. కలెక్టర్ల తీర్పులు వివాదాస్పదంగా మారడంతో బాధితులు హైకోర్టుకు అప్పీలుకు వెళ్లారు. దీంతో తీర్పును పునః సమీక్షించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్ర సర్కారు హడావిడిగా రెవెన్యూ చట్టంలో మార్పులు తీసుకురావడం, ఆ తర్వాత జిల్లా ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేయడం, వాటికి సరైన చట్టబద్ధత కల్పించకపోవడంతో కక్షిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండల, ఆర్డీవో స్థాయి రెవెన్యూ కోర్టులను రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకో ట్రిబ్యునల్ ను ఆ జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఏర్పాటు చేసింది. గ్రామంలో నెలకొన్న భూ వివాదాలపై ఇరుపక్షాల వాదనలను విని తీర్పును వెలువర్చాల్సి ఉంది. అయితే ఇటీవల రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ట్రిబ్యునల్స్ ముందుకు వచ్చిన భూ సమస్యలపై  కలెక్టర్లు తీర్పును వెలువర్చారు. వీటిపై  హైకోర్టుకు బాధితులు అప్పీల్ కు వెళ్లగా హైకోర్టు తీర్పును మరోసారి పునః సమీక్షించాలని, ఇరుపక్షాల వాదనలను వినాలని కలెక్టర్లకు సూచించింది. కేవలం నెల రోజుల్లోనే భూసమస్యలపై ఎలా తీర్పు చెప్పారంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. ఆ సూత్రమేదో తమకూ చెబితే కోర్టుల్లోని పెండింగ్ కేసులను నెల రోజుల్లో పరిష్కరిస్తామని చమత్కరిస్తూ ఆ కేసులను తిరిగి జిల్లా ట్రిబ్యునల్స్ కు తిప్పి పంపింది. దీంతో బాధితులు మరోసారి  విచారణ కోసం కలెక్టర్లను ఆశ్రయించారు. వనపర్తి జిల్లాలో 15, 16 తేదీల్లో 195 రెవెన్యూ కేసులు ట్రిబ్యునల్ లో దాఖలయ్యాయి. దీంతో జిల్లా ట్రిబ్యునళ్ల ఉనికిపై పలువురు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా పలువురు సీనియర్ లాయర్లు రాష్ట్ర ప్రభుత్వ తీరును, సీఎస్ తొందరపాటు నిర్ణయాన్ని ప్రశ్నిస్తున్నారు. న్యాయ నిపుణులు లేకుండా చేసిన రెవెన్యూ చట్టాల వల్ల కేసులకు పరిష్కారం దొరకదని, కేబినెట్ సబ్ కమిటీ ని ఏర్పాటు చేసి అందులో జడ్జిలు, సీనియర్ లాయర్ల సలహాతో రెవెన్యూ చట్టాల్లో మార్పులు తీసుకురావాలని కోరుతున్నారు.  రెవెన్యూ చట్టం తెచ్చిన ప్రభుత్వం వాటి అమలుకు రూలింగ్ ను చెప్పలేదని, రూలింగ్ లేకుండా చట్టాన్ని ఏ విధంగా అమలు చేయాలని లాయర్లు ప్రశ్నిస్తున్నారు.
సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం
జిల్లా ట్రిబ్యునల్ లో కలెక్టర్ ఇచ్చిన తీర్పును మళ్లీ అదే ఆఫీసర్​సమీక్షించడం చట్టవిరుద్ధ మని లాయర్లు అంటున్నారు. ఇది సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకంగా ఉందని వారు వాదిస్తున్నారు. రెవెన్యూ కేసుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలని హైకోర్టు రాష్ట్ర సీఎస్ ను ఆదేశించింది. దీంతో ఏప్రిల్ 5, 6 తేదీల్లో కేసులను తీసుకున్నప్పటికీ మళ్లీ తాజాగా ఏప్రిల్ 15, 16 తేదీల్లో మరోసారి అందరితో కేసులను తీసుకోవాలని సీఎస్ కలెక్టర్లను ఆదేశించారు. దీంతో మొదట కలెక్టర్లకు కేసులు ఇచ్చిన కక్షిదారులు  తప్పని పరిస్థితుల్లో మరోసారి 15, 16 తేదీల్లో కూడా కేసులు వేయాల్సి వచ్చింది. చట్టప్రకారం న్యాయమూర్తి స్థానంలో కూర్చున్న వ్యక్తి తాను ఇచ్చిన తీర్పును తానే సమీక్షించుకోవడం అనేది చట్టవిరుద్ధమని, అప్పీల్ కు పోతే అక్కడ తీర్పులో మార్పులుంటే న్యాయసమ్మతంగా ఉంటుందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. గతంలో తీర్పు ఇచ్చిన కలెక్టర్ కాకుండా మరొకరైతే తప్ప ఆ తీర్పుపై  చేసిన సమీక్ష కు చట్టబద్ధత ఉండదని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టం తీసుకువచ్చి పెండింగ్ లో ఉన్న కేసులను ఏదో రకంగా వదిలించుకోవాలనే కోణంలో చూడటం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని పలువురు మండిపడుతున్నారు. మరింత సమయం తీసుకుని పక్కాగా రెవెన్యూ చట్టాలను న్యాయనిపుణుల సమక్షంలో రూపొందించాలని సూచిస్తున్నారు. 
ఉమ్మడి జిల్లాకో ట్రిబ్యునల్ ఉండాలె
రాష్ట్రంలోని పది ఉమ్మడి జిల్లాల్లో ఒక్కో ట్రిబ్యునల్ చొప్పున ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం పలువురిలో వ్యక్తమవుతోంది. జిల్లా కలెక్టర్లతో  కాకుండా చట్టాలపై అవగాహన కలిగిన ప్రత్యేక న్యాయ నిపుణులను నియమించాలని సూచిస్తున్నారు. తీర్పు ఇచ్చే అధికారం ఉన్నవారిపై ఎలాంటి ఒత్తిడి ఉండకూడదని, కానీ రెవెన్యూ ట్రిబ్యునళ్ల విషయంలో కలెక్టర్లపై సీఎస్ ఒత్తిడి కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని ఆరోపిస్తున్నారు. అప్పీలు కేసుల విషయంలో తీర్పుపై  మార్పులు చేయడం ఇష్టం లేక అవే తీర్పులను యధాతధంగా ఇవ్వడం వల్ల కక్షిదారులు నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖపై పట్టు కోల్పోకూడదన్న భావనతోనే రెవెన్యూ కేసులను ఆయా జిల్లా కేంద్రాలలోని  జిల్లా అదనపు కోర్టులకు అప్పగించడం లేదని విమర్శిస్తున్నారు. 

ఈ నెల 15, 16 తేదీల్లో రెవెన్యూ ట్రిబ్యునల్ లో దాఖలైన పిటీషన్లు ఉమ్మడి జిల్లాల వారీగా.. 

జిల్లా పేరు                                                   వచ్చిన పిిటిషన్లు

ఆదిలాబాద్                                                         104

మహబూబ్ నగర్                                                 689

మెదక్                                                                298

కరీంనగర్                                                           279

వరంగల్                                                             728

నిజామాబాద్                                                      151

నల్గొండ                                                              973