హైదరాబాద్, వెలుగు: గురుకుల విద్యా సంస్థల్లో జూనియర్ లెక్చరర్ల పోస్టుల భర్తీపై పిటిషనర్ల అభ్యంతరాలకు వివరణ ఇవ్వాలని గురుకుల విద్యా శాఖను హైకోర్టు ఆదేశించింది. గురుకుల విద్యా సంస్థల్లో జూనియర్ లెక్చరర్ల భర్తీ కోసం గత సంవత్సరం ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. నోటిఫికేషన్‌లో ఇచ్చిన నిబంధనలు పాటించినా తమను పక్కకు పెట్టారంటూ జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన గంగాప్రసాద్ తోపాటు మరో తొమ్మిది మంది పిటిషన్ వేశారు. దీనిని జస్టిస్ పుల్ల కార్తీక్ మంగళవారం విచారించారు.
‘‘జంతుశాస్త్రం, వృక్షశాస్త్రం లెక్చరర్ పోస్టులకు దరఖాస్తు చేసే వారు ఎంఎస్సీలో ఏ సబ్జెక్ట్ చేసినా.. డిగ్రీలో మాత్రం సంబంధిత సబ్జెక్ట్ చేసి ఉండాలని నోటిఫికేషన్‌లో ఉంది. దీంతో డిగ్రీలో జంతుశాస్త్రం, వృక్షశాస్త్రం చదివి.. ఎంఎస్సీలో మరో సబ్జెక్ట్ చదివిన పిటిషనర్లు కూడా దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షలయ్యాక ప్రకటించిన మెరిట్ లిస్ట్‌లో పిటిషనర్ల పేర్లున్నాయి. సర్టిఫికెట్ వెరిఫికేషన్ అయ్యాక అధికారులు నివేదిక పేరుతో నియామకాలు ఆపారు. ఆ నివేదిక రాకముందే ఇతరులకు అపాయింట్‌మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు. పిటిషనర్లకు ఇవ్వలేదు”అని పిటిషనర్ తరఫు లాయర్ పేర్కొన్నారు. పిటిషనర్లకూ అపాయింట్‌మెంట్ లెటర్లు ఇచ్చేలా అధికారులకు ఆదేశించాలని కోరారు. దీంతో పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని స్టాండింగ్ కౌన్సిల్ కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
