
తెలంగాణలో కాన్పు కోసం 200 కిలోమీటర్లు తిరిగి తల్లి, బిడ్డ కన్నుమూసిన ఘటనపై హైకోర్టు సీరియస్ అయింది. జోగులాంబ గద్వాల జిల్లా చిన్న తాండ్రపాడు గ్రామానికి చెందిన న్యాయవాది కరణం కిషోర్ కుమార్ రాసిన లేఖతో రాష్ట్ర హైకోర్టు స్పందించింది. సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కేసు మీద విచారణ చేపట్టింది. అతి చిన్న హెల్త్ రీజన్ కు 6 ఆసుపత్రులు తిప్పారని లేఖలో కిషోర్ ప్రస్తావించారు. లాక్ డౌన్ మార్గదర్శకాలను తప్పుగా అర్థం చేసుకోవడంతో తల్లి బిడ్డ ప్రాణాలు కోల్పోయారని ఆయన లేఖలో పేర్కొన్నారు. అత్యవసర చికిత్సలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని కిషోర్ కోరారు. హైకోర్టు న్యాయవాది కిషోర్ కుమార్ రాసిన లేఖలోని అంశాలను సుమోటోగా స్వీకరించిన న్యాయస్థానం విచారణ చేపట్టింది. దీనిపై పూర్తి వివరాలు తెలియజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.