4 ప్రశ్నలను తొలగించి.. మళ్లీ మూల్యాంకనం చేయండి: హైకోర్టు

4 ప్రశ్నలను తొలగించి.. మళ్లీ మూల్యాంకనం చేయండి: హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సివిల్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షలో 4 ప్రశ్నలను తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. ఆ ప్రశ్నలను తొలగించాక, మళ్లీ మూల్యాంకనం చేసి సెలెక్టెడ్ అభ్యర్థుల లిస్టును ప్రకటించాలని ఉత్తర్వులిచ్చింది. ఆ తర్వాత నియామక ప్రక్రియను కొనసాగించాలని సూచించింది. 

జులై 23న రిజర్వ్ చేసిన తీర్పును సోమవారం వెల్లడించింది. మెయిన్స్ పరీక్షలో 122, 130, 144 ప్రశ్నలను ఇంగ్లిష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్ లేట్ చేయలేదని, 57వ ప్రశ్న తప్పుగా ఉన్నందున.. ఆ నాలుగింటిని ప్రశ్నపత్రం నుంచి తొలగించాలని పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డును ఆదేశించింది. 

కానిస్టేబుల్ ప్రశ్నపత్రంలో 23 ప్రశ్నలకు అభ్యంతరాలు తెలుపుతూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. 23 ప్రశ్నల్లో 4 ప్రశ్నలు తప్పుగా ఉన్నట్లు అభ్యర్థుల తరపు న్యాయవాది రమేష్ చిల్ల వాదనలు వినిపించారు. ఈ కేసులో విచారణ పూర్తి చేసిన కోర్టు.. తీర్పును రిజర్వ్ చేసింది. 

అయితే తీర్పు రిజర్వులో ఉండగానే సెలెక్షన్ లిస్ట్ వెల్లడించారని న్యాయవాది రమేశ్ ఆరోపించారు. కాగా, 15,750 మంది అభ్యర్థులతో జాబితాను పీఆర్‌‌‌‌బీ ఇప్పటికే విడుదల చేసింది. వెరిఫికేషన్ ప్రక్రియ, అభ్యంతరాల స్వీకరణ కొనసాగుతున్నది.