
మోడల్ స్కూల్ టీచర్స్ అవస్థలు
సర్వీస్ రూల్స్ వచ్చినా
ట్రాన్స్ ఫర్స్ చేపట్టని సర్కార్
హైదరాబాద్, వెలుగు: రెండేండ్ల సర్వీస్ దాటితే, ఉద్యోగులు బదిలీలకు అర్హులవుతారు. కానీ రాష్ట్ర మోడల్ స్కూల్స్ లో పనిచేసే టీచర్లు మాత్రం ఏడేండ్లు దాటినా, ట్రాన్స్ ఫర్స్కు నోచుకోవడం లేదు. మొన్నటి వరకు సర్వీస్ రూల్స్లేవని చెప్పిన అధికారులు.. అవి వచ్చి ఆరు నెలలు అవుతున్నా నోరు మెదపడం లేదు. దీంతో ఏడేండ్ల నుంచి వందలాది మంది టీచర్లు కుటుంబాలకు దూరంగా ఉంటూ డ్యూటీ చేస్తున్నారు.
జాయిన్ అయినప్పటి నుంచి..
రాష్ట్రంలో పేద స్టూడెంట్లకు ఇంగ్లిష్ మీడియం ఎడ్యుకేషన్ అందించేందుకు ఉమ్మడి రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం సహకారంతో మోడల్ స్కూల్స్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 194 మోడల్ స్కూల్స్ ఉండగా, వాటిలో మూడు వేలమంది టీచర్లు (టీజీటీ, పీజీటీ) పనిచేస్తున్నారు. వీరంతా 2013, 2014లో రిక్రూట్ అయ్యారు. రిక్రూట్మెంట్ ప్రాసెస్ రెండు విడుతల్లో చేయడంతో టీచర్లు వారున్న ప్రాంతానికి దూరంగా పోస్టింగ్ లు పొందారు. ఇవన్నీ జోనల్ పోస్టులు కావడంతో వందల కిలోమీటర్ల దూరంలో జాబ్స్ చేయాల్సి వస్తోంది. దీంతో జాయిన్ అయినప్పటి నుంచి ఒకే స్కూల్లో పని చేస్తున్నారు. దీంతో ఏండ్ల నుంచి కుటుంబాలకు దూరంగా ఉంటున్నారు.
సర్వీస్ రూల్స్ వచ్చినా..
2013లో మోడల్ స్కూల్స్ స్కూల్స్ ప్రారంభమైనా, వాటిలోని టీచర్లు, సిబ్బందికి వెంటనే సర్వీస్ రూల్స్ రాలేదు. బదిలీలు కావాలని కోరినా.. సర్వీస్‌రూల్స్ లేవు కాబట్టి ట్రాన్స్ఫర్స్ చేయడం సాధ్యం కాదని అధికారులు చెప్పుకొచ్చారు. తర్వాత 2019 డిసెంబర్లో ప్రభుత్వం మోడల్ స్కూల్స్ లో పనిచేసే వారికి సర్వీస్‌రూల్స్‌ను ప్రకటించింది. దీంతో బదిలీలు అవుతాయని టీచర్లంతా భావించినా, అదీ సాధ్యం కాలేదు. బదిలీల కోసం వందల మంది టీచర్లు నిత్యం విద్యాశాఖ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా.. పట్టించుకునే వారు కరువయ్యారు. సెలవుల్లోనైనా ఆన్లైన్ ద్వారా బదిలీలు నిర్వహించాలని కోరుతున్నారు.
బదిలీలు చేయాలె
మోడల్ స్కూళ్లలో పనిచేసే టీచర్లకు ఏడేండ్ల నుంచి బదిలీలు లేకపోవడంతో, తీవ్ర ఇబ్బందులు పడుతున్నం. రిక్రూట్మెంట్ సమయంలోనూ నిర్లక్ష్యంతో అవస్థలు పడ్డాం. రెండవ దశ నియామకం చేయడానికి ముందు బదిలీలు నిర్వహించి నియామకాలు చేయాలని కోరినా పట్టించుకోలేదు. ఈసెలవుల్లోనే బదిలీలు నిర్వహించాలి.
– భూతం యాకమల్లు, టీఎంఎస్టీఏ ప్రెసిడెంట్
కుటుంబాలకు దూరంగా డ్యూటీలు
ఏండ్ల నుంచి బదిలీలు చేపట్టకపోవడంతో వందల మంది కుటుంబాలకు దూరంగా ఉండి డ్యూటీ చేస్తున్నారు. బదిలీలు నిర్వహించాలని అధికారులను కోరినా చలనం లేదు. స్పౌస్ కేసులనూ పట్టించుకోవడం లేదు. డిసెంబర్లోనే సర్వీస్ రూల్స్ వచ్చాయి. వెంటనే బదిలీలు చేపట్టాలి.
– జగదీశ్, పీఎంటీఏ ప్రెసిడెంట్