మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసుల పర్యటన

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసుల పర్యటన
  • మావోయిస్టు పీఎల్జీఏ వారోత్సవాల నేపథ్యంలో ఎక్కడికక్కడ తనిఖీలు
  • ప్రభావిత ప్రాంతాల్లో పోలీసు అధికారుల పర్యటన

వెలుగు నెట్ వర్క్: మావోయిస్టు పీఎల్జీఏ వారోత్సవాల నేపథ్యంలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. తెలంగాణ– చత్తీస్ గఢ్ బార్డర్ లో  చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. వాహన తనిఖీలు నిర్వహించి, అనుమానితులను విచారిస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసు ఆఫీసర్లు పర్యటిస్తున్నారు. గిరిజన తండాలు, మారుమూల గ్రామాల ప్రజలతో మాట్లాడి, మావోయిస్టులకు సహకరించవద్దని కోరుతున్నారు. మావోయిస్టులు కనిపిస్తే డయల్​ 100కు సమాచారం ఇవ్వాలని చెబుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలంలో ఎస్పీ సురేందర్ రెడ్డి శుక్రవారం పర్యటించారు. డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి, మహదేవపూర్ సీఐ కిరణ్ తో కలిసి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలను తనిఖీ చేశారు. స్థానిక పోలీసులకు సూచనలు చేశారు. వారోత్సవాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ కోరారు. మహాముత్తారం, కాటారం, పలిమెల, మహాదేవ్​పూర్, కాళేశ్వరం పోలీస్​స్టేషన్ల పరిధిలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. రాష్ట్ర సరిహద్దులో ఉండే పోలీసు స్టేషన్లకు బందోబస్తు పెంచి, కాపలా కాస్తున్నారు. చత్తీస్ గఢ్ నుంచి వలస వచ్చిన గుత్తికోయలపై నిఘా పెట్టారు. కాటారం నుంచి మేడారం వెళ్లే రూట్​లో ఎస్ఐ రమేశ్ వెహికల్స్ చెక్ చేశారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలో ఎస్సై తాజోద్దీన్ వాహన తనిఖీలు నిర్వహించారు. అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకొని, విచారించి వదిలేశారు. గ్రామాల్లో మావోయిస్టులకు వ్యతిరేకంగా గోడ పత్రికలు అంటించారు. 

మావోయిస్టు లేఖ బూటకం..

మావోయిస్టుల ఆరోపణలు నిజమైతే తాను ఏ శిక్షకైనా సిద్ధమని టీఆర్ఎస్ లీడర్, ఏటూరునాగారం డివిజన్ ఆత్మ చైర్మన్ దుర్గం రమణయ్య సవాల్ చేశారు. రమణయ్యకు వ్యతిరేకంగా మావోయిస్టులు విడుదల చేసిన లేఖపై శుక్రవారం ములుగు జిల్లాకేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తనపై చేసిన ఆరోపణలపై పునరాలోచన చేయాలన్నారు. తాను ఎలాంటి భూకబ్జాలకు పాల్పడలేదని వివరించారు.

వారోత్సవాలున్నాయ్.. ధర్నాలు చేయవద్దు

మహారాష్ట్ర రైతులకు పోలీసుల విన్నపం

మహాదేవపూర్, వెలుగు: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరోంచ తాలూకాలోని మేడిగడ్డ బ్యారేజీ భూనిర్వాసితుల ధర్నా తాత్కాలికంగా వాయిదా పడింది. మావోయిస్టు పీఎల్జీఏ వారోత్సవాల నేపథ్యంలో ధర్నాను విరమించాలని పోలీసులు కోరారు. దీంతో ఈ నెల 10వ తేదీకి ధర్నా వాయిదా పడింది. కాగా, మేడిగడ్డ బ్యారేజీ వల్ల గత మూడేండ్లుగా పంటలు వేయలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 26 రోజులుగా ధర్నా చేస్తున్నా ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. తమ బతుకులను నాశనం చేసిన ప్రభుత్వాలను వదిలి పెట్టేది లేదని స్పష్టం చేశారు. పరిహారం అందేవరకు ధర్నా కొనసాగుతుందన్నారు.