ఎంపీ వంశీకృష్ణను అవమానించారని దళిత సంఘాల నేతల నిరసన

ఎంపీ వంశీకృష్ణను అవమానించారని దళిత సంఘాల నేతల నిరసన
  •  దేవాదాయ శాఖ ఆఫీసర్లు ప్రొటోకాల్ పాటించడంలేదని ఫైర్ 

జయశంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూపాలపల్లి, వెలుగు: కాళేశ్వరంలో నిర్వహిస్తున్న సరస్వతి పుష్కరాల సందర్భంగా జరిగిన సీఎం రేవంత్ రెడ్డి ప్రోగ్రాంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన దళిత సంఘాల నేతలు నిరసన వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖ ఆఫీసర్లు ప్రొటోకాల్ పాటించడం లేదని, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణను అవమానిస్తున్నారని మండిపడ్డారు. వంశీకృష్ణ స్థానిక ఎంపీ అయినప్పటికీ పుష్కరాల కోసం ఏర్పాటు చేసిన అధికారిక ఫ్లెక్సీల్లో ఆయన ఫొటో పెట్టలేదని, ప్రొటోకాల్ ప్రకారం ఆహ్వానించలేదని ఫైర్ అయ్యారు. ‘ప్రజలు ఎన్నుకున్న ఎంపీ దేవాదాయ శాఖ ఆఫీసర్లకు కనబడటం లేదా?’, ‘దళిత ఎంపీ అంటే అంత చిన్నచూపా?’ అని రాసిన ప్లకార్డులు ప్రదర్శించారు.

గురువారం సాయంత్రం కాళేశ్వరం చేరుకున్న సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి.. గోదావరి ఒడ్డున ఏర్పాటు చేసిన 17 అడుగుల ఏకశిల సరస్వతి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ సమయంలో మంథని, పెద్దపల్లి నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్ దళిత నేతలు 50 మంది అక్కడికి వచ్చారు. మెడలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కండువాలు, చేతిలో ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణను దేవాదాయ శాఖ ఆఫీసర్లు అడుగడుగునా అవమానిస్తున్నారని, ఆయన లోకల్ ఎంపీ అయినప్పటికీ దళితుడు అనే ఉద్దేశంతో ప్రొటోకాల్ ప్రకారం ఆహ్వానించలేదని మండిపడ్డారు.