ఫిజిక‌ల్ ఈవెంట్స్పై క్లారిటీ ఇచ్చిన పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్

ఫిజిక‌ల్ ఈవెంట్స్పై క్లారిటీ ఇచ్చిన పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్

ఫిజికల్ టెస్ట్ ప్రాసెస్ కఠినంగా ఉందని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు స్పందించింది. గతంతో పోలిస్తే నియామక ప్రక్రియను సరళతరం చేశామంటూ ప్రకటన విడుదల చేసింది. 2018, 2019 సంవత్సరాల్లో జరిగిన పోలీస్ రిక్రూట్ మెంట్ నియామక ప్రక్రియతో పోలిస్తే ఈవెంట్ల విషయంలో చాలా మార్పులు చేసినట్లు చెప్పింది. 

  • గతంలో పురుషులకు 2 రన్నింగ్ ఈవెంట్స్ ఉండేవని ఇప్పుడు దాన్ని ఒక రన్నింగ్ ఈవెంట్ కు పరిమితం చేసినట్లు చెప్పింది. 
  • గతంలో పురుషులకు 5 పీఈటీ ఈవెంట్స్ ఉండగా.. ఇప్పుడవి 3 మాత్రమే నిర్వహిస్తున్నామని స్పష్టం చేసింది.
  • లాంగ్ జంప్, షాట్ పుట్ ఈవెంట్లలో స్త్రీ, పురుష అభ్యర్థులిద్దరికీ 3 అవకాశాలు ఇస్తున్నామని చెప్పింది. గతంలో  లాంగ్ జంప్లో 83 శాతం మంది పురుషులు, 80 శాతం మంది మహిళలు.. షాట్ పుట్ ఈవెంట్లో 93 శాతం మంది పురుషులు, 96 శాతం మంది మహిళలు క్వాలిఫై అయిన విషయాన్ని ప్రస్తావించింది. 
  • ఫిజికల్ ఈవెంట్స్ అన్నింటినీ సీసీ టీవీల పర్యవేక్షణలో నిర్వహించడంతో హైట్ విషయంలో ఎలాంటి అనమానాలకు తావులేకుండా అనలాగ్ తో పాటు డిజిటల్ హైట్ మెషీన్ ను ఉపయోగిస్తున్నట్లు చెప్పింది.
  • హైట్ విషయంలో 1సెంటీమీటర్ తక్కువ ఉన్న వారికి సైతం ఈవెంట్లలో పాల్గొనే అవకాశమిస్తున్నట్లు స్పష్టం చేసింది. 
  • 2018 - 2019లో పీఎంటీ, పీఈటీ (ఫిజికల్) ఈవెంట్స్లో 52 శాతం అభ్యర్థులే అర్హత సాధించగా.. ఇప్పుడా సంఖ్య 54 శాతానికి పెరిగిందని తెలిపింది. 

నియామక ప్రక్రియలో గర్భిణులకు సంబంధించి  కోర్టు ఆదేశాలకు కచ్చితంగా అమలు చేస్తున్నట్లు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది. గర్భిణులుగా ఉన్న అభ్యర్థినులు పీఎంటీ, ఎంఈటీ (ఫిజికల్) పరీక్షలు లేకుండా నేరుగా తుది రాత పరీక్షకు హాజరు కావచ్చని స్పష్టం చేసింది. అయితే తుది రాత పరీక్షలో అర్హత సాధించిన నెల రోజుల్లోగా..  పీఎంటీ, ఎంఈటీ (ఫిజికల్) పరీక్షలకు హాజరవుతామనే రాతపూర్వక హామీని వారు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపింది. ఈమేరకు హామీని ఇవ్వలేని గర్భిణీ అభ్యర్థినులకు తుది రాత పరీక్షపై ఆసక్తి లేదని పరిగణిస్తామని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తేల్చి చెప్పింది.