ప్రైవేట్​కి ఇచ్చేస్తారా..?

ప్రైవేట్​కి ఇచ్చేస్తారా..?

ఐదేండ్లలో సర్కార్​ ఎగ్గొట్టిన సబ్సిడీ పాసుల నిధులే రూ. 2,183 కోట్లు
ఐదేండ్లలో ఆర్టీసీ చెల్లించిన రోడ్డు ట్యాక్స్​ రూ. 1,052 కోట్లు
ఏటా సంస్థ చెల్లిస్తున్న డీజిల్​ ట్యాక్స్​ రూ. 400 కోట్ల నుంచి 600 కోట్లు
ఏటా  సంస్థలో 10 శాతం బస్సులు ఔట్​ డేటెడ్​
పాడైన బస్సుల స్థానంలో ‘ప్రైవేటు’వి దింపుతామంటున్న సీఎం

ఇప్పటికే ప్రైవేటు వ్యక్తులకు కొన్ని ఆస్తుల అప్పగింతరూ. 50 కోట్ల ఆస్తి ఉన్న ఓ వ్యక్తికి రూ. 3.2 కోట్ల అప్పు ఉంటే.. అది ఒక లెక్కనా? ఆ అప్పుకే అతడు దివాలా తీస్తాడా? బిచాణా ఎత్తేస్తాడా?!  మనల్ని సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చే ఆర్టీసీకి రాష్ట్రవ్యాప్తంగా రూ. 50 వేల కోట్లకుపైగా విలువైన ఆస్తులున్నాయి. అప్పులు కేవలం రూ. 3, 200 కోట్లే.  పేరుకుపోయిన నష్టాలు రూ. 3,308 కోట్లే. ఇంత భారీ ఎత్తున ఆస్తులున్న సంస్థకు అప్పు 10 శాతం లోపే. ఈ మాత్రం అప్పుకే ఆర్టీసీ ఎందుకు ఆగమవుతోంది? అది దివాలా తీసే పరిస్థితిలో పడిందని రాష్ట్ర సర్కార్​ ఎందుకంటున్నది?! ఆర్టీసీ అప్పులపై వడ్డీ, జీతభత్యాల చెల్లింపు, కొత్త బస్సుల కొనుగోలు భారంగా మారుతోందని ప్రభుత్వం చెబుతోంది. ఆర్టీసీలో ప్రైవేటుకు పార్ట్​నర్​షిప్​ కల్పిస్తేనే లాభం ఉంటుందని వాదిస్తోంది. ఏకంగా 20 శాతం పూర్తిగా ప్రైవేటు బస్సులనే తీసుకువస్తామని, అద్దె బస్సులను 30శాతానికి పెంచుతామని సీఎం కేసీఆర్​ ప్రకటించారు. ఆర్టీసీలో పనికి రాకుండా పోయిన దాదాపు 2,600 బస్సుల స్థానంలో అద్దె, ప్రైవేటు బస్సులు వస్తాయని తెలిపారు. ఆర్టీసీలో ఏటా ఐదు నుంచి పది శాతం బస్సులు ఔట్‌‌ డేటెడ్‌‌గా మారుతుంటాయి. వాటి స్థానంలో కూడా అద్దె, ప్రైవేటు బస్సులు ప్రవేశపెట్టి క్రమంగా ఆర్టీసీని ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పే కుట్ర జరుగుతోందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇదే జరిగితే రూ. 50వేల కోట్లకు పైగా విలువైన ఆర్టీసీ ఆస్తులు ఎవరి చేతిలోకి పోతాయి? ఇప్పటికే ఆర్టీసీ భూముల్లో ప్రైవేటు వ్యక్తులు పాగా వేసి.. వ్యాపారాలు నడిపిస్తున్నారు.

క్రమేణా సంస్థలోకి ప్రైవేటు బస్సులు వస్తే.. ప్రైవేటు ట్రాన్స్‌‌పోర్ట్‌‌ మేనేజ్​మెంట్స్​ ఆడిందే ఆట పాడిందే పాట అవుతుందని, అవి మాఫియాగా తయారయ్యే ప్రమాదం ఉందని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ ఆస్తులను దోచుకోవడంతో పాటు చార్జీల పేరిట ప్రజలపై భారం మోపే అవకాశం ఉందని అంటున్నారు. వాస్తవానికి ఆర్టీసీ ఆస్తులు ప్రజల ఆస్తులే. నిజాంస్టేట్‌‌లో 32 బస్సులతో ప్రారంభమైన సంస్థ ఇప్పుడు రూ. 50వేలకుపైగా విలువైన ఆస్తులకు చేరిందంటే ప్రజాసంపద పెరిగినట్లే. దీనిపై ప్రజలదే హక్కు.

వాటి చుట్టూ అభివృద్ధి

ఆర్టీసీకి ఉన్న ఆస్తులు కూడా జిల్లా, టౌన్‌‌, నియోజక వర్గ, మండల కేంద్రాల్లో ఎక్కడా చూసినా కీలకమైన ప్రాంతాల్లో ఉంటాయి. జన జీవితం దాని చుట్టే పెనవేసుకొని ఉంటుంది. అభివృద్ధి అంతా దాని చుట్టే కేంద్రీకరించబడి ఉంటుంది. సాధారణంగా బస్టాండ్‌‌ చుట్టూ అన్ని రకాల వ్యాపారాలు విస్తరిస్తాయి. కాంప్లెక్సులు వెలుస్తాయి. చిరు వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. పండ్ల దుకాణాల నుంచి మొదలుకొని చిన్న చిన్న టీకొట్టులు, టిఫిన్‌‌ సెంటర్ల వరకు ఎన్నో వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. సాధారణంగా ఎక్కడ  చూసినా బస్టాండ్‌‌ చుట్టుపక్కల రెండు మూడు కిలో మీటర్ల పరిధే ఆ ఊరి వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చెందుతుంది. ఒకవేళ బస్టాండు మార్చినా ఈ వ్యాపారమంతా అక్కడికి తరలిపోయి అది కొత్త వాణిజ్య కేంద్రంగా మారుతుంది. ఇంతటి కమర్షియల్‌‌ యాక్టివిటీకి కేంద్రంగా ఉన్న బస్టాండ్ల ఆస్తి విలువ ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు. ఆర్టీసీ యాజమాన్యం ఈ విషయాన్ని గుర్తించి కొన్ని బస్టాండ్లను కమర్షియల్‌‌ అవసరాలకు అనుగుణంగా షాపింగ్‌‌ కాంప్లెక్సులు ఏర్పాటు చేస్తూ కమ్యూనిటీ అమినిటీ సెంటర్ల పేరుతో నిర్మాణాలు కూడా చేపట్టింది.

బస్సుల కొనుగోలేది?

పెరిగిన రవాణా అవసరాలు, పాతబడిపోయిన వాహనాలు తీసి కొత్తవి కొనుగోలు చేసేందుకు కూడా ప్రభుత్వం, ఆర్టీసీకి అందిస్తున్న సహాయం అంతంత మాత్రంగానే ఉంటోంది. ఆర్టీసీకి ప్రస్తుతం మూడు వేల కొత్త బస్సులు అవసరం. ప్రభుత్వం చెప్తున్న ప్రకారం చూసినా ఆర్టీసీలో పాతబడిపోయిన బస్సులు రెండు వేల వరకు ఉన్నాయి. కొత్త బస్సులు కొనలేమని ప్రభుత్వం తెగేసి చెబుతోంది. గత ఐదేండ్లుగా కొత్త బస్సుల కొనుగోలు కోసం ప్రభుత్వం రూ. 235 కోట్లు మాత్రమే అప్పుగా కేటాయించింది. కానీ ఆర్టీసీకి దాదాపుగా వెయ్యి నుంచి పదిహేను వందల కోట్లు అవసరం. కొత్త బడ్జెట్‌‌ ప్రకారం చూసినా కొత్త బస్సుల కొనుగోలుకు ఆర్టీసీకి ప్రభుత్వం కేటాయించింది రూ. 140 కోట్లు మాత్రమే. దీంతో తమ కష్టాలు తీరేదెట్లా అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. పనికి రాని బస్సుల స్థానంలో అద్దె బస్సులు ప్రవేశపెడతామని సీఎం కేసీఆర్‌‌ ఇటీవల ప్రకటించారు. విలువైన బోలెడు ఆర్టీసీ ఆస్తులు అందుబాటులో ఉండగా, వాటిని తగు రీతిన వినియోగించుకోకుండా ప్రభుత్వం అనేక అడ్డంకులు కల్పిస్తూ తమ సంస్థ మరింత నష్టాల వైపుగా వెళ్లేందుకు కుట్రపన్నుతోందని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి.

బకాయిల ఊసెత్తని సర్కారు

ఆర్టీసీ అప్పు చాలా తక్కువని, వాటి నుంచి గట్టెక్కించడం కష్టమేమీ కాదని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. ప్రభుత్వ విధానాల వల్లే సంస్థ అప్పులపాలు కావాల్సి వస్తోందని వాదిస్తున్నాయి. ప్రభుత్వానికి రోడ్డు పన్ను కింద గత ఐదేండ్లులో రూ. 1,052 కోట్లు ఆర్టీసీ చెల్లించింది. ఇందులో రాయితీ ఇస్తే సంస్థపై భారం తగ్గుతుందని కార్మికులు అంటున్నారు. ఆర్టీసీకి 600-–700 కోట్ల రన్నింగ్​ లాసెస్​ ఉంది. డీజిల్‌‌పై ప్రభుత్వానికి ఆర్టీసీ కడుతున్న సెస్‌‌ ఇంచుమించు దీనితో సమానం. డీజిల్‌‌పై సెస్​ రూపంలో ఏటా 400 – 600 కోట్లు ప్రభుత్వానికి ఆర్టీసీ చెల్లిస్తోంది. ఈ  సెస్‌‌ తగ్గిస్తే సంస్థను నష్టాల నుంచి కాపాడుకోవచ్చని కార్మికులు అంటున్నారు. బస్‌‌ పాస్‌‌లపై ఇచ్చే రాయితీ సుమారు రూ. 60 కోట్లు. వీటిని ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. కానీ.. ప్రభుత్వం మొక్కుబడిగా చెల్లించి చేతులు దులుపుకుంటోంది. 2014–15లో సబ్సిడీ బస్సు పాసుల కింద ప్రభుత్వం నుంచి ఆర్టీసికి రావాల్సింది రూ. 528.31 కోట్లు అయితే.. ప్రభుత్వం చెల్లించింది కేవలం 118. 79 కోట్లు. 2016–17లో 553.71 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. 27.50 కోట్లు చెల్లించింది. ఇదే పరిస్థితి ఏటా కొనసాగుతోంది. గత ఐదేండ్లలో సబ్సిడీ బస్సు పాసుల కింద ఆర్టీసికి ప్రభుత్వం నుంచి   రూ. 2,822.75 కోట్లు రావాల్సి ఉండగా.. వచ్చింది కేవలం రూ. 638.79 కోట్లే. అంటే.. కేవలం రాయితీ బస్సుపాసులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి ఇంకా రూ. 2,183 కోట్ల వరకు రావాలి. వీటిని ఏటా సక్రమంగా విడుదల చేస్తే.. రోడ్డు పన్నులో రాయితీ ఇస్తే.. డీజిల్​ సెస్​ను తగ్గిస్తే.. రూ. 3,200 కోట్ల అప్పులు ఓ లెక్కనా అని కార్మికులు అంటున్నారు. బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడంతోనే సమస్య వచ్చిందని చెప్తున్నారు.