
హైదరాబాద్, వెలుగు: రాఖీ పండుగ సందర్భంగా ఆర్టీసీకి రికార్డు రెవెన్యూ వచ్చింది. చరిత్రలో తొలిసారిగా గురువారం రూ.22.65 కోట్ల ఆదాయం వచ్చిందని సంస్థ తెలిపింది. ఆర్టీసీ బస్సుల్లో 40.92 లక్షల మంది ప్రయాణించారని, 36.77 లక్షల కి.మీ బస్సులు నడిచాయని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. పండుగ సందర్భంగా 20 డిపోల్లో 100 శాతం పైగా ఓఆర్(ఆక్యుపెన్సీ రేషియో) నమోదైంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 104.68 శాతం ఓఆర్ రికార్డైంది.
ఆ జిల్లా పరిధిలోని 7 డిపోల్లో నార్కెట్ పల్లి మినహా మిగతా డిపోలు 100 శాతానికిపైగా ఓఆర్ సాధించాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 97.05 శాతం, ఆ జిల్లాలో 9 డిపోలు ఉండగా.. 6 డిపోలు 100కిపైగా ఓఆర్ సాధించాయి. ఉమ్మడి మెదక్, మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాల్లో 90 శాతానికి పైగా ఓఆర్ నమోదైంది. హుజూరాబాద్, నల్గొండ, భూపాలపల్లి, హుస్నాబాద్, పరకాల, కల్వకుర్తి, తొర్రూర్, మహబుబాబాద్, మిర్యాలగూడ, దేవరకొండ, యాదగిరిగుట్ట, గజ్వేల్-ప్రజ్ఞాపూర్, కోదాడ, నర్సంపేట, సూర్యాపేట, దుబ్బాక, జనగామ, సిద్దిపేట, గోదావరిఖని, షాద్‌నగర్ డిపోలు 100 శాతానికిపైగా ఓఆర్ సాధించాయి. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో అత్యధికంగా కిలోమీటర్‌కు వరంగల్-1 డిపో రూ.65.94, భూపాలపల్లి డిపో రూ.65.64 సాధించింది”అని సంస్థ తెలిపింది.