మధ్యాహ్న భోజన స్కీంపై ప్రభుత్వ నిర్లక్ష్యం

మధ్యాహ్న భోజన స్కీంపై ప్రభుత్వ నిర్లక్ష్యం

హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది.  కేంద్ర ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేస్తున్నా..రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆ నిధుల్ని వేరే వాటికి ఉపయోగిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఫలితంగా విద్యార్ధులకు సరైన భోజనం లభించడం లేదని తెలుస్తోంది. మరోవైపు ఎప్పటికప్పుడు రావాల్సిన బిల్లులు కూడా పెండింగ్ లో ఉన్నాయని కార్మికులు చెబుతున్నారు. వెంటనే నిధులు చెల్లించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

అన్ని సర్కారు బడుల్లోనూ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని వడ్డించే బాధ్యతను రాష్ట్ర సర్కారు ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించింది. ప్రైమరీ స్కూళ్లలో ఒక్కో స్టూడెంట్ కి 4 రూపాయల 97 పైసలు, హైస్కూళ్లలో 7 రూపాయల 45 పైసల చొప్పున చెల్లిస్తోంది. రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసరాల ధరలకు తగ్గట్టుగా భోజనం రేట్లను పెంచాలని సవరించాలని కొన్నేళ్లుగా ఏజెన్సీలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రైమరీ స్కూల్లో ఒక్కో స్టూడెంట్  కు 10 రూపాయలు, హైస్కూల్లో 13 చొప్పున చెల్లించాలని కోరుతున్నాయి. 

మిడ్ డే మీల్స్ స్కీం ప్రారంభించిన కొత్తలో ఒక్కో విద్యార్థికి ఒక రూపాయి 25 పైసలు చొప్పున ఇచ్చేవారు. అప్పట్లో ఎలాంటి జీతం లేకుండా పొదుపు సంఘాల గ్రూప్  సభ్యులు పనిచేస్తూ వచ్చారు. పోరాటాల ఫలితంగా వారికి వెయ్యి ఇచ్చేవారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మరో రెండువేలు కలిపి మొత్తం 3 వేలు ఇస్తున్నారు. ఈ స్కీంలో మొదట్లో కేంద్రం 90 శాతం, రాష్ట్ర 10 శాతం నిధులు కేటాయించి నడిపేవారు. ప్రస్తుతం కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులు ఖర్చు చేస్తోంది. ఈ పథకానికి గతంలో ఏటా 13824 వేల కోట్లు కేటాయించేవారు. ప్రస్తుతం ఆ బడ్జెట్ ను రూ. తొమ్మిది వేల కోట్లకు కుదించారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా బడ్జెట్ ను పెంచాల్సింది పోయి తగ్గించడం సరైందికాదని నిర్వాహకులు చెబుతున్నారు.

పెండింగులో ఉన్న బిల్లుల కోసం రాష్ట్రంలో కొట్లాడే పరిస్థితి వచ్చిందని మిడ్ డే మీల్స్ కార్మికులు చెబుతున్నారు. సకాలంలో బిల్లులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజు రోజుకూ పెరుగుతున్న నిత్యావసర ధరలకు సర్కార్ ఇస్తున్న దానికి పొంతన లేదని.. అప్పులు చేసి మరీ  పిల్లలకు భోజనం పెట్టాల్సిన పరిస్థితి వస్తుందంటున్నారు. ప్రభుత్వం పెండింగ్ నిధుల్ని విడుదల చేయాలంటున్నారు. సర్కారు స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరుపై రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి కార్మికులకు ఇవ్వాల్సిన బిల్లులను వెంటవెంటనే ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు డిమాండ్ చేశారు.