వెలుగు “ఎఫెక్ట్” కందులు కొంటం

వెలుగు “ఎఫెక్ట్” కందులు కొంటం

హైదరాబాద్, వెలుగురాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధరకు కందులను కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందొద్దని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి హామీ ఇచ్చారు. కందుల కొనుగోలుకు సీఎం కేసీఆర్ అభయం ఇచ్చారని, దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వంపై రూ. 200 కోట్లు అదనంగా భారం పడుతుందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో కందులు కొనకపోవడంతో రైతులు పడుతున్న ఇక్కట్లపై ఈ నెల 14న ‘కందులు కొంటలేరు’ పేరుతో ‘వెలుగు’ ప్రత్యేక కథనం ప్రచురించింది. సోమవారం మంత్రి నిరంజన్​రెడ్డి హైదరాబాద్​లోని మినిస్టర్స్​ క్వార్టర్స్​లో మీడియాతో మాట్లాడారు. ఖరీఫ్ లో 41 లక్షల ఎకరాల్లో వరి, 5 లక్షల ఎకరాల్లో కంది సాగైందని తెలిపారు. కందిని మద్దతు ధరతో కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరితే క్వింటాల్​కు రూ. 5,800 చొప్పున 47,500 టన్నులు మాత్రమే కొనుగోలు చేసేందుకు అనుమతి ఇచ్చిందని చెప్పారు. కొనుగోలు కోటాను పెంచాలని లేఖ రాసినా కేంద్రం స్పందించలేదని మంత్రి ఆరోపించారు. దళారులు కందులను మార్క్​ఫెడ్​కు తెచ్చి అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని, వారికి అధికారులు సహకరిస్తే జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. సరిహద్దు రాష్ట్రాల వద్ద నిఘా పెంచాలని, ఇతర రాష్ట్రాల కందులు మన మార్కెట్లకు రాకుండా చూడాలని అధికారులను ఆయన ఆదేశించారు.

కందులు కొంటం

పత్తి, వరిని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందన్నారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెండింతలు చేస్తామంటూ రోజూ కేంద్ర ప్రభుత్వం ప్రగల్భాలు పలుకుతోందని, విదేశీ మారక ద్రవ్యం పెంచుకునే పసుపు పంటకు బోర్డు ఏర్పాటులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మంత్రి నిరంజన్​రెడ్డి విమర్శించారు.  కేంద్రం కొత్త నిధులు ఏమీ రాష్ట్రాలకు ఇవ్వడం లేదని, రాష్ట్రాలకు రావాల్సిన నిధులను కూడా ఇవ్వడం లేదన్నారు.  కేంద్రం కేవలం పంపిణీదారేనని, హక్కుదారు కాదని వ్యాఖ్యానించారు. రైతు సానుకూల నిర్ణయాలతో ముందుకు వెళ్తున్న తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదని ఆయన ఆరోపించారు.

రైతు దినోత్సవంగా కేసీఆర్​ బర్త్​డే

కేసీఆర్​ జన్మదినాన్ని రాబోయే రోజుల్లో రైతు దినోత్సవంగా ఏటా తమ వ్యవసాయ శాఖ తరఫున జరుపుకుంటామని నిరంజన్​ తెలిపారు. కృష్ణా, గోదావరి నీళ్లను బీళ్లకు మలిపి రైతాంగానికి సాగునీరు అందించిన ఘనత  కేసీఆర్​దేనని అన్నారు. సహకార ఎన్నికల్లో స్ఫూర్తిదాయక తీర్పునిచ్చిన రైతులకు ధన్యవాదాలు తెలిపారు.