పరిశ్రమల ఏర్పాటుకు స్థలమిస్తే అమ్మేసుకుంటున్నరు!

పరిశ్రమల ఏర్పాటుకు స్థలమిస్తే అమ్మేసుకుంటున్నరు!
  • ఇండస్ట్రియల్​ ఏరియాపై రియల్​ మాఫియా కన్ను
  • పట్టించుకోని ఆఫీసర్లు

భద్రాచలం, వెలుగు:పరిశ్రమల ఏర్పాటు కోసం సర్కారు ఆ స్థలాన్ని అతి తక్కువ ధరకు కేటాయించింది. కానీ రెండున్నర దశాబ్దాలు గడుస్తున్నా అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయలేదు. ఇప్పుడా స్థలంపై రియల్​ మాఫియా కన్ను పడడంతో ప్లాట్లుగా చేసి అమ్మేస్తున్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశంతో ఉమ్మడి ఏపీలో ఆంధ్రప్రదేశ్‍ ఇండస్ట్రియల్‍ ఇన్‍ఫ్రాస్ట్రక్చర్స్ కార్పొరేషన్‍(ఏపీఐఐసీ) భద్రాచలం నడిబొడ్డున చర్ల రోడ్డులో 17.5 ఎకరాలను కేటాయించింది. 42 ప్లాట్లు, 4 షెడ్లుగా విభజించి స్క్వేర్‍ మీటర్‍ కేవలం రూ.75కే పరిశ్రమలు నిర్మించడానికి ముందుకొచ్చినవారికి అందజేశారు. 1994వ సంవత్సరానికి పూర్వం వరకు గిరిజనేతర పారిశ్రామికులకు భూమిని ఏపీఐఐసీ విక్రయించింది. కేటాయించిన భూమిలో వారు ఏ పరిశ్రమను నిర్మిస్తామని తెలిపారో అదే నిర్మించాలి తప్ప ఇండ్లు, షాపింగ్‍ కాంప్లెక్స్ లు కట్టకూడదు. ప్లాటును వేరేవారికి అద్దెకు ఇవ్వకూడదు. అమ్మకూడదు. ఒకవేళ వేరే వ్యక్తికి బదిలీ చేయాల్సి వస్తే ఏపీఐఐసీ(ప్రస్తుతం టీఎస్ఐఐసీ) రూల్స్​ ప్రకారం వారి అనుమతితోనే వేరే పారిశ్రామికవేత్తకు పరిశ్రమ నిర్మించడం కోసం మాత్రమే బదిలీ చేయొచ్చు. 

ప్లాట్లుగా చేసి అమ్మకం..
భద్రాచలంలో భూమి విలువ రోజురోజుకూ పెరుగుతుండటంతో పట్టణం నడిబొడ్డున ఉన్న ఇండస్ట్రియల్‍ ఏరియాలోని స్థలాలపై రియల్‍ మాఫియా కన్ను పడింది. ఈ భూములు చేతులు మారి షాపింగ్‍ కాంప్లెక్స్ లు నిర్మించడమే కాకుండా గృహ సముదాయానికి ప్లాట్లుగా విభజించి సెంటు జాగా రూ.3 లక్షల నుంచి రూ. 5 లక్షలకు విక్రయిస్తున్నారు. బినామీ పేర్లతో స్థలం పొంది పక్కా భవనాలు నిర్మించి వ్యాపార కూడళ్లుగా మారుస్తున్నారు. నాడు ఏపీఐఐసీ నుంచి పొందిన షెడ్లను తునికాకు గోడౌన్లకు అద్దెకు ఇస్తుండగా ప్లాట్లను అమ్ముకుంటున్నారు. 1994కు ముందు ఏపీఐఐసీ నుంచి పొందిన వారెవరికీ ఇంతవరకు సేల్‍డీడ్‍ జరగలేదు. కేవలం సేల్ అగ్రిమెంట్ మాత్రమే జరిగింది. సేల్ అగ్రిమెంట్‍ మాత్రమే జరగడం వల్ల ఆ స్థలాలపై పూర్వ హక్కులు టీఎస్ఐఐసీకే ఉంటాయి. ఒక వేళ ఇప్పుడు సేల్‍డీడ్‍ చేసుకుందామనుకున్నా 1994 తర్వాత గిరిజనేతర పారిశ్రామికవేత్తలకు సేల్ డీడ్‍ చేయకూడదనే రూల్స్​ఉన్నాయి. దీంతో ఈ స్థలాలపై సర్వహక్కులు  టీఎస్ఐఐసీవే. 1994 తర్వాత గిరిజన పారిశ్రామికవేత్తలకు ఏపీఐఐసీ కేటాయించిన భూమికి కేవలం ఐదుగురు మాత్రమే సేల్‍డీడ్‍ పొందారు. వీరు కూడా ఇష్టానుసారం స్థలం బదిలీ చేయరాదు. కేవలం మరో గిరిజన పారిశ్రామికవేత్తకు పరిశ్రమ నిర్మించే ప్రాతిపదికన టీఎస్ఐఐసీ  అనుమతితో మాత్రమే బదిలీ చేయొచ్చు.  ప్రస్తుతం భద్రాచలంలోని ఇండస్ట్రియల్‍ ఏరియాలో పరిశ్రమల కోసం స్థలాలు తీసుకున్నవారు పాత ఇనుప సామాన్లు కొనుగోలు చేసే షెడ్లు నిర్మించారు. మరికొందరు ఫంక్షన్‍హాళ్లు కట్టారు. షాపింగ్‍కాంప్లెక్స్​లు నిర్మించి అద్దెలు వసూలు చేసుకుంటున్నారు. ఆంధ్రాకు చెందిన ఓ వ్యాపారి రైసు మిల్లును బినామీ పేరుతో కట్టారు. తాజాగా ఓ వ్యక్తి తనకు కేటాయించిన స్థలంలో నిర్మించిన షాపింగ్​కాంప్లెక్స్ ను రూ.1.60 కోట్లకు విక్రయించాడు. ఇక దాల్​మిల్లు పేరుతో ప్లాటు తీసుకుని భవనాన్ని ఎలక్ట్రికల్ గూడ్స్ నిల్వ ఉంచుకునేందుకు రెంట్​కు ఇచ్చారు. కొందరైతే వారి ప్లాట్లను లీజుకు ఇస్తున్నారు. అసలు ఎన్ని పరిశ్రమలు నిర్మించారు.. ఎన్ని ప్లాట్లు ఉన్నాయి.. అనే సమాచారం ప్రస్తుత టీఎస్‍ఐఐసీ దగ్గర కూడా లేకపోవడం గమనార్హం. 

కొరవడిన పర్యవేక్షణ
ఇండస్ట్రియల్‍ ఏరియాలపై టీఎస్ఐఐసీ అధికారుల పర్యవేక్షణ కొరవడింది. ఔత్సాహిక  పారిశ్రామికవేత్తలకు వెన్నుదన్నుగా నిలవాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. చిల్లర పైసలకు కక్కుర్తిపడి ప్రభుత్వ స్థలాలను అన్యాక్రాంతమవుతున్నా పట్టించుకోవడం లేదు. స్క్వేర్‍ మీటర్‍ రూ.75కు పొంది లక్షలాది రూపాయలకు అమ్ముకుంటున్నా, గృహ, షాపింగ్‍ సముదాయాలు నిర్మిస్తున్నా చేష్టలుడిగి చూస్తున్నారు. ప్రభుత్వం నుంచి పొందిన స్థలంలో రెండేళ్లలోపు పరిశ్రమలు నిర్మించకపోతే సేల్ అగ్రిమెంట్‍, సేల్ డీడ్‍లను రద్దు చేయాలన్న రూల్​ను ఆఫీసర్లు పట్టించుకోలేదు. ఏ పరిశ్రమ నిర్మించకుండా 20 ఏండ్లు దాటుతున్నా ఆ స్థలాలను వెనక్కు తీసుకోవడం లేదు. కేవలం నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకొంటున్నారు. దీనిపై వెంటనే సమగ్ర విచారణ జరిపితే అక్రమాల గుట్టు రట్టవుతుంది. 

విచారణ జరిపిస్తాం
ఇండస్ట్రీ ఏర్పాటు చేయడానికి తీసుకున్న స్థలం వేరేవాళ్లకు లీజుకు ఇవ్వకూడదు. అలా ఇస్తున్నట్లు మా దృష్టికి వస్తే హెచ్చరించాం. ఇండస్ట్రీలు పెట్టకుండా వేరేవారికి గోడౌన్లుగా ఇస్తున్నవారిపై విచారణ చేపడతాం. ఇండస్ట్రీలు పెట్టకుంటే తిరిగి గవర్నమెంట్​కు స్థలాన్ని అప్పగించాలి. స్థలాలు పక్కదారి పడితే చర్యలు తీసుకుంటాం.
- పవన్​కుమార్, జోనల్​ మేనేజర్, టీఎస్ఐఐసీ