గ్రూప్​–2, గ్రూప్​–3 సిలబస్​లో TSPSC మార్పులు

గ్రూప్​–2, గ్రూప్​–3 సిలబస్​లో TSPSC మార్పులు

గ్రూప్​–2, గ్రూప్​–3 సిలబస్​లో టీఎస్పీఎస్సీ మార్పులు చేసింది. ముఖ్యంగా ఎకానమీ పేపర్​లో కొన్ని కొత్త అంశాలను చేర్చారు. అందులో కేంద్ర, రాష్ట్ర బడ్జెట్​ ఒకటి. ఈ నేపథ్యంలో రెవెన్యూ రాబడి, రెవెన్యూ వ్యయం, ప్రభుత్వ రుణం, బడ్జెట్​ రకాలు తదితర అంశాలను తెలుసుకుందాం.

రాజ్యాంగం ప్రకారం రెవెన్యూ వ్యయ ఖాతాను ఇతర ఖాతాల నుంచి వేరుగా చూపించాలి. అందువల్ల కేంద్ర ప్రభుత్వ బడ్జెట్​ను రెండు ఖాతాలుగా వర్గీకరించారు. 1. రెవెన్యూ బడ్జెట్​ 2. మూలధన బడ్జెట్​

రెవెన్యూ బడ్జెట్​: ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా జరిగే ప్రభుత్వ లావాదేవీలన్నీ రెవెన్యూ బడ్జెట్​లో చూపుతారు. రెవెన్యూ బడ్జెట్​లో రెవెన్యూ రాబడులు, రెవెన్యూ వ్యయం భాగాలుగా ఉంటాయి. 
రెవెన్యూ రాబడులు: పన్నుల రాబడి, పన్నేతర రాబడుల మొత్తాన్ని రెవెన్యూ రాబడి అంటారు. వీటిలో పన్నుల నుంచి అధిక రాబడి వస్తుంది. 
పన్నుల రాబడి: కేంద్ర ప్రభుత్వం విధించే అన్ని పన్నులు, సుంకాల నుంచి లభించే రాబడిని పన్నుల రాబడి అంటారు. ప్రభుత్వానికి రాబడి సమకూర్చే పన్నుల్లో ముఖ్యమైనవి కార్పొరేషన్​ పన్ను, ఆదాయపు పన్ను, ఎగుమతి, దిగుమతి సుంకం, ఎక్సైజ్​ సుంకం, జీఎస్టీ, కేంద్రపాలిత ప్రాంత పన్నులు. కొత్త పన్నులు విధించడం, పన్ను రేట్ల మార్పులు, ప్రస్తుతం ఉన్న పన్నులను కొనసాగించడానికి ఫైనాన్స్​ బిల్లు ప్రతిపాదన అవసరం. ఇది పార్ల​మెంట్​ ఆమోదం పొందాలి. 
పన్నేతర రాబడి: కేంద్ర ప్రభుత్వానికి పన్నుల ద్వారా కాకుండా వేరే మార్గాల ద్వారా లభించే రాబడిని పన్నేతర రాబడి అంటారు. పన్నేతర రాబడులు లభించే మార్గాల్లో ముఖ్యమైనవి. అవి.. ప్రభుత్వరంగ సంస్థల లాభాలు, డెవిడెండ్లు, ప్రభుత్వనికొచ్చే వడ్డీలు, వాణిజ్యపర లాభాలు, ప్రభుత్వ సేవలు, బహిర్గత గ్రాంట్లు, ఇతర పన్నేతర రాబడి మొదలైన భాగాలు. వీటిలో అతిపెద్ద రాబడి డెవిడెండ్లు – లాభాలు. 
రెవెన్యూ వ్యయాలు: ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ప్రభుత్వం చేసే వ్యయం రెవెన్యూ వ్యయం. ఇది ప్రభుత్వ యంత్రాంగం నడపటానికి చేసే వ్యయం. ఇందులో రుణాలపై వడ్డీ చెల్లింపులు, సబ్సిడీలు, రక్షణ వ్యయం మొదలైనవి. రెవెన్యూ వ్యయం వల్ల  ఎలాంటి ఆస్తి సృష్టించబడదు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకిచ్చే విరాళాలు కూడా రెవెన్యూ వ్యయంగానే పరిగణించాలి. రెవెన్యూ రాబడి కంటే రెవెన్యూ వ్యయం ఎక్కువగా ఉంటే దాన్ని రెవెన్యూ లోటుగా వర్ణిస్తారు. 

మూలధన బడ్జెట్

కేంద్ర ప్రభుత్వం చేసే వ్యయం, లావాదేవీలు ఆస్తులు సృష్టించడానికి ఉపయోగపడితే దాన్ని క్యాపిటల్​ బడ్జెట్​ అంటారు. దేశంలో ప్రాజెక్టులు, పరిశ్రమల నిర్మాణాలు దీని కిందికి వస్తాయి. ఇందులో రెండు భాగాలుంటాయి. ఎ. మూలధన రాబడి బి. మూలధన వ్యయం. అవి రెండు రకాలు
రెవెన్యూ లోటు: రెవెన్యూ ఖాతాలో రెవెన్యూ రాబడి కంటే రెవెన్యూ వ్యయం ఎక్కువైతే రెవెన్యూ లోటు ఏర్పడుతుంది. 
బడ్జెట్​ లోటు: మొత్తం రాబడి కంటే మొత్తం వ్యయం ఎక్కువైతే బడ్జెట్​ లోటు ఏర్పడుతుంది. 
కోశలోటు: బడ్జెట్​ లోటు, మార్కెట్​ రుణాలను కలిపితే కోశ లోటు వస్తుంది.
ద్రవ్యీకరించబడిన లోటు: నూతన కరెన్సీని ముద్రించడం ద్వారా భర్తీ చేసే లోటును ద్రవ్యీకరించబడిన లోటు అంటారు. దీనివల్ల ద్రవ్య సప్లయ్​ పెరిగి ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంది. 
ప్రాథమిక లోటు: కోశలోటుకీ, వడ్డీ చెల్లింపులకు మధ్య వ్యత్యాసమే ప్రాథమిక లోటు. ప్రభుత్వ రుణంలో వడ్డీ చెల్లింపులు పోగా ఎంత మొత్తం ప్రస్తుత వ్యయానికి అందుబాటులో ఉంటుందో తెలియజేసే దానిని ప్రాథమిక లోటు అంటారు. 

బడ్జెట్​ రకాలు

సంతులిత బడ్జెట్​: రాబోయే సంవత్సరంలో చేసే వ్యయాలు, రాబడులకు సమానమైతే దాన్ని సంతులిత బడ్జెట్​ అంటారు. అప్పుడు మిగులు కాని లోటు కాని ఉండదు. ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తేనే సంతులిత బడ్జెట్​ విధానాన్ని పాటించడానికి వీలవుతుంది. 
అసంతులిత బడ్జెట్​: రాబోయే సంవత్సరంలో ప్రభుత్వ వ్యయాలు, రాబడులకు సమానంగా లేని యెడల అది అసంతులిత బడ్జెట్​. అప్పుడు ప్రభుత్వ బడ్జెట్​ మిగులు బడ్జెట్​, లోటు బడ్జెట్​గా ఉండవచ్చు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మూలధన కొరత సమస్యను అధిగమించడానికి ప్రభుత్వ రుణాలు సేకరించి అసంతులిత బడ్జెట్​ను అనుసరిస్తున్నాయి. 
స్థిర బడ్జెట్​: బడ్జెట్​ను అమలు చేసే కాలపరిమితిలో మార్పు లేకుండా స్థిరంగా ఉండేది స్థిర బడ్జెట్​. ప్రభుత్వ కార్యక్రమాల అమలు వాస్తవిక స్థాయి, అంచనా వేసిన బడ్జెట్​ కార్యక్రమాలు స్థాయి సమానంగా ఉంటుంది. 
చర బడ్జెట్: అత్యవసర పరిస్థితుల  వల్ల ప్రభుత్వ కార్యక్రమాల అమలు స్థాయి మారుతుంది. కాబట్టి అంచనా వేసిన బడ్జెట్​ కార్యక్రమాల స్థాయికి ప్రభుత్వ కార్యక్రమాల అమలు వాస్తవిక స్థాయికి తేడా వస్తుంది. ఈ మార్పులకు అనుగుణంగా బడ్జెట్​ అమలు విధానాన్ని మార్చితే దాన్ని చర బడ్జెట్​ అంటారు. 

లోటు బడ్జెట్​: 

1929–33 ఆర్థిక మాంద్యం, 1936లో కీన్స్​ గ్రీన్​ థియరీ ప్రచురణతో లోటు బడ్జెట్​ ప్రాధాన్యతను సంతరించుకుంది. మాంద్యకాలంలో లోటు బడ్జెట్​ వల్ల ప్రభుత్వ వ్యయం పెరిగి ప్రజల ఆదాయాలు, కొనుగోలు శక్తి పెరిగి నెమ్మదిగా ధరలు పెరుగుట వల్ల ప్రైవేట్​ పెట్టుబడిదారులు ఉత్సాహంతో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొస్తారు. అంటే నిరాశపూరిత ఆర్థిక వ్యవస్థలో ఆశాజనక వాతావరణం సృష్టించబడుతుంది. అభివృద్ధి పనులపై చేసే వ్యయం కంటే ప్రభుత్వం సేకరించే రాబడి వనరులు తక్కువగా ఉన్నప్పుడు లోటు ఏర్పడును. దీనికోసం ప్రభుత్వం వనరులను వివిధ మార్గాల నుంచి సేకరిస్తుంది. ఇది మార్కెట్​ రుణాలు, రిజర్వుబ్యాంకు వద్ద దాచిన ప్రభుత్వ నిల్వలు వాడటం, రిజర్వు బ్యాంకు నుంచి రుణం తీసుకోవడం మొదలైనవి. ఈ విధంగా లోటు ద్రవ్యాన్ని భర్తీ చేయడం 1970 తర్వాత ప్రభుత్వానికి అలవాటుగా మారింది. బడ్జెట్​లో ఆదాయానికి మించి వ్యయం ఉంటే లోటు ఏర్పడుతుంది. వివిధ లోటుల రకాలు. అవి.. రెవెన్యూ లోటు, బడ్జెట్​ లోటు, కోశలోటు, ద్రవ్యీకరించబడిన లోటు, ప్రాథమిక లోటు.