సీసీ కెమెరాలు.. బయోమెట్రిక్ అటెండెన్స్

సీసీ కెమెరాలు.. బయోమెట్రిక్ అటెండెన్స్

ఈ నెల 16న ప్రిలిమ్స్ పరీక్షకు ఏర్పాట్లు
ప్రతి క్లాస్​రూమ్​లో సీసీ కెమెరాలు 
రాష్ట్రవ్యాప్తంగా వెయ్యికి పైగా సెంటర్లు 
అటెండ్ కానున్న 3.80 లక్షల మంది అభ్యర్థులు 
9 నుంచి వెబ్ సైట్​లో హాల్ టికెట్లు 

హైదరాబాద్, వెలుగు: ఈ నెల16న రాష్ట్రవ్యాప్తంగా జరిగే గ్రూప్1 ప్రిలిమ్స్​ నిర్వహణకు ఏర్పాట్లు మొదలయ్యాయి. పరీక్షల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా, నిఘా నీడలో నిర్వహించేందుకు అధికారులు చర్యలు మొదలుపెట్టారు. దీంట్లో భాగంగా అన్ని సెంటర్లలో సీసీ కెమెరాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  దీనికితోడు ప్రతిసెంటర్​లో బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకోనున్నారు. రాష్ట్రంలో 503 గ్రూప్1 పోస్టుల భర్తీకి టీఎస్​పీఎస్సీ ఏప్రిల్​లో నోటిఫికేషన్​ రిలీజ్ చేసింది. మే 2 నుంచి జూన్​ 4 దాకా అప్లికేషన్లు తీసుకోగా, 3,80,202 మంది దరఖాస్తు చేసుకున్నారు. దీంట్లో పురుషులు 2,28,951 మంది, మహిళలు 1,51,192 మంది, ట్రాన్స్​ జెండర్లు 59 మంది ఉన్నారు. ఈ లెక్కన ఒక్కో పోస్టుకు సగటున 756 మంది పోటీ పడుతున్నారు. ప్రిలిమ్స్ పరీక్షకు భారీ సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడంతో దానికి తగ్గట్టుగా జిల్లాల్లో వసతుల కల్పనకు ఆఫీసర్లు చర్యలు చేపట్టారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో వెయ్యికి పైగా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. నెల రోజుల నుంచి పలుసార్లు జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లతో టీఎస్​పీఎస్సీ చైర్మన్ జనార్ధన్​రెడ్డి ఎగ్జామ్ నిర్వహణపై రివ్యూలు  నిర్వహించారు. ఎగ్జామ్ నిర్వహణకు తక్కువ టైమ్ ఉండటంతో, జిల్లాల్లో కలెక్టర్లు ఏర్పాట్లపై వేగం పెంచాలని సూచించారు. ఈ నేపథ్యంలో పరీక్షా కేంద్రాల్లో కనీస వసతులైన మంచినీళ్లు, మరుగుదొడ్లు, ఫర్నిచర్ ఉండేలా చూసుకుంటున్నారు. ప్రతి సెంటర్​లో సీసీ కెమెరాలను పెట్టాలని ఇప్పటికే నిర్ణయించారు. ఎలాంటి మాస్ కాపీయింగ్ కు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రహారీ లేని సెంటర్లుంటే, వాటిపై ప్రత్యేక నిఘా పెట్టనున్నారు. సెంటర్లలో మెడికల్ క్యాంపులతో పాటు ఎగ్జామ్ టైమ్​లో కరెంట్ పోకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. దీనికితోడు ప్రతి అభ్యర్థికి బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

9 నుంచి హాల్ టికెట్లు..
ఎగ్జామ్​కు ఏడు రోజుల ముందు హాల్​టికెట్లు అందుబాటులో పెడ్తామని ఇప్పటికే టీఎస్​పీఎస్సీ ప్రకటించింది. హాల్ టికెట్ వచ్చే వరకూ అభ్యర్థులకు సెంటర్ ఎక్కడో తెలియదు. ఒక్కో అభ్యర్థి ప్రయార్టీ ప్రకారం 12 జిల్లాలను ఎంపిక చేసుకున్నారు. దీంతో వాటిలో  ఏ జిల్లాలో సెంటర్ పడిందో అనే  టెన్షన్ అభ్యర్థుల్లో మొదలైంది. ఈ నెల 9 నుంచి హాల్​టికెట్లు డౌన్​లోడ్ చేసుకోవచ్చని అధికారులు చెప్తున్నారు.  రాష్ట్రవ్యాప్తంగా 1040 వరకూ సెంటర్లు ఏర్పాటు చేస్తుండగా, వాటిలో 300లకు పైగా జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయి. మేడ్చల్ జిల్లాలో అత్యధికంగా 131 కేంద్రాల్లో 53,964 మంది రాయనున్నారు. ఖమ్మంలో 69 సెంటర్లలో 17,356 మంది, భద్రాద్రి కొత్తగూడెంలో 22 సెంటర్లలో 9,018 మంది, నాగర్​ కర్నూల్​లో 23 సెంటర్లలో 7,222 మంది,  నిర్మల్​లో 20 సెంటర్లలో 4,493 మంది, ఆదిలాబాద్​లో 19 సెంటర్లలో 6,200 మంది, జనగామలో 14  కేంద్రాల్లో 3 వేలకు పైగా  అభ్యర్థులు అటెండ్ కానున్నారు. కరీంనగర్​లో 36, వనపర్తిలో 19, కామారెడ్డిలో 10 కేంద్రాలు.. ఇలా అన్ని జిల్లాల్లోనూ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఈ సెంటర్లలో చీఫ్ సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్ల నియామకానికి ఏర్పాట్లు చేస్తున్నారు.