
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయిన కారణంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షల్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ తో పాటు జూనియర్ లెక్చరర్ పరీక్షలు కూడా వాయిదా వేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్థన్ రెడ్డి తెలిపారు. అయితే, ఇప్పటికే టౌన్ ప్లానింగ్, ఎంవీఐ పరీక్షలు రద్దు చేసిన టీఎస్పీఎస్సీ ఇప్పుడు గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షల్ని కూడా రద్దు చేసింది.
గతేడాది అక్టోబర్ 16న జరిగిన గ్రూప్ 1 ఎగ్జామ్ ను.. పేపర్ లీక్ అయిన వ్యవహారం కారణంగా టీఎస్పీఎస్సీ ఈ నిర్ణయం తీసుకుంది. సిట్ ఇన్వెస్టిగేషన్ లో సాక్ష్యాధారాలు రుజువైన కారణంగా పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, తిరిగి గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలను జూన్ 11న నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ వెల్లడించింది.
2022, అక్టోబర్ 16వ తేదీన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష జరగ్గా, ఆ ఫలితాలను 2023, జనవరి 13వ తేదీ విడుదల చేసింది టీఎస్‌పీఎస్‌సీ. 503 గ్రూప్-1 పోస్టులకు 3 లక్షల 80 వేల 81 మంది దరఖాస్తు చేసుకోగా.. 2 లక్షల 85 వేల 916 మంది పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష రాసిన వారిలో 25 వేల 50 మంది అభ్యర్థులు మెయిన్స్ కు సెలక్ట్ అయ్యారు. జూన్‌లో మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. ఈలోపే లీకేజీ వెలుగు చూడటంతో.. జూన్‌లో మళ్లీ రీఎగ్జామ్ నిర్వహించాలని నిర్ణయించింది.