గ్రూప్-2 వాయిదా.. కొత్త కమిషన్ వచ్చాకే ఎగ్జామ్​ తేదీల ప్రకటన!

గ్రూప్-2 వాయిదా..  కొత్త కమిషన్ వచ్చాకే ఎగ్జామ్​ తేదీల ప్రకటన!

హైదరాబాద్, వెలుగు:  గ్రూప్‌-2 పరీక్ష వాయిదా పడింది. షెడ్యూల్‌ ప్రకారం జనవరి 6, 7వ తేదీల్లో పరీక్ష జరగాల్సి ఉండగా..  టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌తో పాటు మరో ముగ్గురు సభ్యులు రాజీనామా చేయడంతో పరీక్ష నిర్వహణ కష్టంగా మారింది. దీంతో గ్రూప్‌-2 పరీక్షను వాయిదా వేస్తూ టీఎస్‌పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. కొత్త తేదీలను త్వరలోనే చెప్తామని ప్రకటించింది. ఈ మేరకు బుధవారం కమిషన్ సెక్రటరీ అనితా రాంచంద్రన్ ప్రెస్ నోట్ విడుదల చేశారు. 

రాష్ట్రంలో గ్రూప్‌ -2 క్యాటగిరీ కింద 18 డిపార్ట్ మెంట్లలో 783 ఉద్యోగాల భర్తీకి గతేడాది డిసెంబర్‌ 29న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 2023 జనవరి 18 నుంచి ఫిబ్రవరి16 వరకు దరఖాస్తులు స్వీకరించారు. గ్రూప్​ 2కు 5,51,943 మంది దరఖాస్తు చేశారు. సగటున ఒక్కో ఉద్యోగానికి 705 మంది పోటీపడుతున్నారు. తొలుత ఆగస్టు 29, 30వ తేదీల్లో గ్రూప్‌-2 పరీక్ష నిర్వహించేందుకు కమిషన్‌ షెడ్యూల్‌ ప్రకటించింది. అభ్యర్థుల నుంచి వచ్చిన డిమాండ్‌ మేరకు నవంబరు 2, 3వ తేదీలకు పరీక్షను రీషెడ్యూల్‌ చేశారు. 

నవంబర్‌1 నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో పరీక్షల నిర్వహణ, శాంతిభద్రతలు, వసతులు, సిబ్బంది కొరత వంటి ఇబ్బందుల కారణంగా రెండోసారి గ్రూప్‌-2 పరీక్షను వాయిదా వేస్తున్నట్టు కమిషన్ ప్రకటించింది. గ్రూప్‌-2 పరీక్షలను మళ్లీ 2024 జనవరి 6, 7 తేదీలకు రీషెడ్యూల్‌ చేసింది. ఇప్పటికే రెండుసార్లు పరీక్షలు రీషెడ్యూల్‌ కాగా.. తాజాగా మూడోసారి కూడా వాయిదా పడింది. అయితే, కొత్త కమిషన్ ఏర్పాటయ్యాకే ఎగ్జాం తేదీలు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.