TSPSC : పేపర్ లీకేజీ కేసును సీబీఐకి ఇవ్వాలి : నిందితుడి భార్య

TSPSC : పేపర్ లీకేజీ కేసును సీబీఐకి ఇవ్వాలి : నిందితుడి భార్య

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ (TSPSC Paper Leak) కేసులో నిందితుడిగా ఉన్న రాజశేఖర్ భార్య సుచరిత సోమవారం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. పేపర్ లీకేజీ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని కోర్టును కోరారు సుచరిత. తన భర్త రాజశేఖర్ పై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించకుండా ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని ఆమె పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటివరకు జరిపిన విచారణను వీడియోలో చూపించాలని కోరారు. ఈ కేసులో ప్రతివాదులుగా డీజీపీ, చీఫ్ సెక్రటరీ, సిట్, హైదరాబాద్ సిటీ సెంట్రల్ జోన్ డీసీపీ లను చేర్చాలని సుచరిత పేర్కొన్నారు.

అయితే సుచరిత పిటిషన్ పై న్యాయస్థానం సోమవారం విచారణ జరిపింది. మెడికల్ ఎయిడ్, థర్డ్ డిగ్రీ అంశం జ్యూరీడిక్షన్ మేజిస్ట్రేట్ దగ్గర అభ్యర్ధించాలని పిటిషనర్ కు హై కోర్టు సూచించింది. ఇక పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించాకే విచారణ ప్రారంభిస్తారు కదా అని పిటిషనర్ తరఫున న్యాయవాదిని కోర్టు ప్రశ్నించింది. సుచరిత పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ విషయంలో ఇంకేమైనా సమస్యలుంటే నాంపల్లి కోర్టును ఆశ్రయించాల్సిందిగా పిటిషనర్‌కు కోర్టు సూచించింది.

రాజశేఖర్‌ ను కస్టడీకి తీసుకునే ముందు వైద్య పరీక్షలు చేయించామని పోలీసు శాఖ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కస్టడీ ముగిసిన తర్వాత కోర్టులో హాజరుపరిచే ముందు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని కోర్టుకు వివరించారు. కస్టడీకి ఇచ్చే ముందు నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకే విచారణ జరుగుతుందని పోలీసు శాఖ తరఫు న్యాయవాది పేర్కొన్నారు.