
హైదరాబాద్, వెలుగు: గ్రూప్1 పరీక్ష నిర్వహణపై సుప్రీంకోర్టులో వేసిన కేసును వెనక్కు తీసుకునేందుకు టీఎస్పీఎస్సీ చర్యలు చేపట్టింది. అందుకు అనుగుణంగా మూడు రోజుల క్రితం సుప్రీంకోర్టులో విత్డ్రా పిటిషన్ వేసింది. నిబంధనలు పాటించలేదన్న కారణంతో గ్రూప్1 పరీక్షను హైకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. దానిని సవాల్ చేస్తూ నిరుడు అక్టోబర్ 21న టీఎస్పీఎస్సీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికలు రావడంతో టీఎస్పీఎస్సీ, అప్పటి సర్కారు దాని గురించి పట్టించుకోకపోవడంతో ఇప్పటివరకు సుప్రీంకోర్టులో కేసు లిస్ట్ కాలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో గతంలో ఇచ్చిన గ్రూప్ 1 పోస్టులకు అదనంగా 60 పోస్టులను పెంచుతూ ఇటీవల నిర్ణయం తీసుకుంది. తాజాగా గ్రూప్ 1 సప్లిమెంటరీ నోటిఫికేషన్ వేయాలా లేదా పాత నోటిఫికేషన్ రద్దు చేయాలా అన్న ఆలోచన నేపథ్యంలో సుప్రీంకోర్టులో వేసిన కేసును వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది.