800 కోట్లు బాకీ పడిన ఆర్టీసీ

800 కోట్లు బాకీ పడిన ఆర్టీసీ
  • బాకీ చెల్లించాలన్న క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ
  • 800 కోట్లు బాకీ పడిన ఆర్టీసీ
  • 15 రోజుల్లో స్పందించకుంటే కోర్టుకెళ్లే యోచనలో సీసీఎస్​

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ కు క్రెడిట్​ కోఆపరేటివ్​ సొసైటీ(సీసీఎస్) నుంచి లీగల్ నోటీసులు అందినట్లు తెలుస్తున్నది. బాకీ పడిన నిధుల్ని చెల్లించాలంటూ లీగల్ నోటీసుల్లో స్పష్టం చేసింది. రూ.800 కోట్ల వరకు రావాల్సి ఉన్నా, వెంటనే రూ.500 కోట్లు చెల్లించాలని పేర్కొంది. ఈ నిధులు వస్తేనే సిబ్బందికి లోన్లతోపాటు రిటైరైన ఉద్యోగులకు పొదుపు నిధులు ఇచ్చే వీలుంటదని చెప్పింది. ఆర్టీసీలోని 48 వేల మందికి పైగా ఉద్యోగులు సీసీఎస్ లో భాగస్వాములై ఉన్నారు. వారంతా నెలనెలా సభ్యత్వ రుసుము, లోన్ రికవరీ పేరిట రూ.25 కోట్ల దాకా చెల్లింపులు చేస్తున్నారు. కానీ ఈ నిధుల్ని సీసీఎస్ కు పంపకుండా ఆర్టీసీ వాడుకుంటున్నట్లు తెలుస్తోంది. 15 రోజుల్లోగా డబ్బు చెల్లించాలని, లేదంటే కోర్టుకు వెళ్తామన్నట్లు సమాచారం. 

మూడేండ్ల నుంచి..

తక్కువ వడ్డీకి లోన్లు ఇవ్వడం, రిటైరైన వాళ్లకు సెటిల్​మెంట్లు చేయడంతోపాటు సిబ్బందికి సంక్షేమ పథకాలు అమలు బాధ్యతను సొసైటీ చూస్తుంటుంది. జీతాల నుంచి రికవరీ అయ్యే వడ్డీ, పొదుపు, లోన్ రిఫండ్ డబ్బులు నెలనెలా కట్ అవుతుంటాయి. ఆ మొత్తాన్ని అదే నెలలో 15 రోజుల్లోపు సొసైటీకి సంస్థ ఇవ్వాలి. సభ్యత్వం, లోన్ రికవరీ పేరిట రూ.25 కోట్లు ఆర్టీసీకి వస్తుండగా, ఆ నిధుల్ని ఇవ్వకుండా సంస్థ అవసరాలకే వాడుతున్నారు. అలా వాడుకుంటున్న సొమ్ము రూ.800 కోట్లకు చేరింది. నిధులు లేక జనవరి నుంచి కార్మికులు పెట్టుకున్న అప్లికేషన్లకు సీసీఎస్ లోన్లను ఇవ్వలేదు. ఈ రూ.25 కోట్లలో కేవలం నాలుగైదు కోట్లు మాత్రమే యాజమాన్యం నుంచి సీసీఎస్ కు వస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం వివిధ బ్యాంకుల నుంచి సీసీఎస్ డబ్బు తీసుకుని సిబ్బందికి ఇస్తున్నందున నిరర్థక ఆస్తుల(ఎన్ పీఏ) బారిన పడకుండా వడ్డీ కింద మాత్రమే యాజమాన్యం ఈ నిధుల్ని ఇస్తున్నది. 

181వ రోజున డబ్బులివ్వాలి

సీసీఎస్ డబ్బులు కోరుతున్న సిబ్బందికి ఆరు నెలల గడువు ఉంటుంది. కోఆపరేటివ్ చట్టం ప్రకారం ఈ ఆరు నెలల్లో వారిని కన్విన్స్ చేయలేకపోతే 181వ రోజు నాడు ఎవరి డబ్బు వారికి తిరిగిచ్చేయాలి. కానీ సీసీఎస్ దగ్గర నిల్వలు ఖాళీ కావడంతో సంస్థ చెల్లించాల్సిన డబ్బులపైనే ఆశలు పెట్టుకుంది. గత ఎండీ హయాంలోనూ లీగల్ నోటీసులు పంపితే కొన్ని నిధులు వచ్చాయి. తద్వారా సిబ్బందికి ఇవ్వాల్సిన బకాయిల్ని చెల్లించారు. ఇప్పుడు ఒక్క పైసా రాకపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో లీగల్ నోటీసులు ఇవ్వాల్సి వచ్చినట్లు తెలుస్తున్నది. 

17 వేల మందికి ఎదురుచూపులే దిక్కు

సీసీఎస్ నుంచి లోన్లు తీసుకున్నవారు 10 వేల మంది, సభ్యత్వం రద్దు చేసుకున్నవారు 6 వేల మంది, రిటైరైన ఉద్యోగులు ఇంకో1,000 మంది దాకా ఉన్నారు. డబ్బు కోసం సీసీఎస్ ఆఫీసు చుట్టూ ఈ 17 వేల మంది తిరుగుతున్నారు. ఒక్కో ఉద్యోగికి రూ.6 లక్షల నుంచి 7 లక్షలు రావాల్సి ఉంది. రిటైర్ అయిన సిబ్బందికి మే నుంచి పొదుపు డబ్బులు ఇవ్వాల్సి ఉన్నా చెల్లించలేని పరిస్థితి. గత జూన్ లోనే 385 మంది రిటైర్ కాగా, సదరు సిబ్బందిలో ఫిక్స్ డ్ డిపాజిట్లు చేసుకున్న వారికి వడ్డీ ఇవ్వాలి. అన్నింటి రూపేణా రూ.500 కోట్లు వెంటనే చెల్లించాల్సి ఉంది.