జిల్లాలకు ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు..

జిల్లాలకు ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు..
  • హర్యానాలో కొత్త బస్సులను పరిశీలించిన ఎండీ సజ్జనార్

హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్​ నుంచి జిల్లాలకు టీఎస్​ ఆర్టీసీ ఎలక్ట్రిక్ ​బస్సులు నడుపబోతున్నది. వచ్చే డిసెంబర్ నుంచి ఎలక్ట్రిక్ ఎక్స్ ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సులు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం విజయవాడ మార్గంలో ఆర్టీసీ ఇప్పటికే 10 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు నడుపుతుండగా, త్వరలో జిల్లాలకూ ఎలక్ట్రిక్​సర్వీసులను విస్తరించనుంది. ఇప్పటి వరకు మొత్తం 1860 ఎలక్ట్రిక్ బస్సులకు ఆర్డర్​ఇవ్వగా, ఇందులో జేబీఎల్ సంస్థ నుంచి 500 బస్సులు తీసుకుంటున్నది. ఆ సంస్థ దశల వారీగా బస్సులను ఆర్టీసీకి అందించనుంది.

వాటిలో కొన్నింటిని డిసెంబర్ లో ప్రజలకు అందుబాటులోకి తెచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే హర్యానాలోని పల్వాల్ లో జేబీఎం గ్రూప్ కంపెనీలో తయారవుతున్న కొత్త ఎలక్ట్రిక్ బస్సుల నిర్మాణాన్ని ఆర్టీసీ ఎండీ సజ్జనర్  బుధవారం పరిశీలించారు. వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న ఎక్స్ ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ ఎలక్ట్రిక్ బస్సులను ఆయన తనిఖీ చేశారు. ఆర్టీసీకి ఇస్తున్న బస్సులను పరిశీలించారు.

జేబీఎం గ్రూప్ హెడ్ సేల్స్(నార్త్) ముఖేశ్ శర్మ, జీఎం ప్రశాంత్ శర్మతో చర్చించి పలు సూచనలు చేశారు. ఈ బస్సుల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేసి ఆర్టీసీకి అందించాలని వారిని ఎండీ వీసీ సజ్జనార్ కోరారు. ఆయనతోపాటు గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఈడీ వెంకటేశ్వర్లు, రంగారెడ్డి ఆర్ఎం శ్రీధర్, డిప్యూటీ ఆర్ఎం భీమ్ రెడ్డి, ఆర్టీసీ స్పెషల్ ఆఫీసర్ భానుప్రసాద్ ఉన్నారు.