
ప్రతి డిపో, వర్క్‌షాప్ నుంచి ఇద్దరికి చోటు
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీలో ప్రతి డిపో లేదా వర్క్‌షాప్ నుంచి ఇద్దరు చొప్పున 202 మందితో వెల్ఫేర్ బోర్డు ఏర్పాటైంది. సమస్యల పరిష్కారం కోసం అన్ని సామాజిక వర్గాలకు చెందిన వారిని ఇందులో సభ్యులుగా చేర్చారు. ఈ మేరకు ఆర్టీసీ అధికారులు సర్కులర్ జారీ చేశారు. ఉద్యోగులు, అధికారుల మధ్య గ్యాప్‌ను తొలగించడానికి, సానుకూల వాతావరణం తెచ్చేందుకు బోర్డును ఏర్పాటు చేస్తున్నట్లు సర్కులర్‌లో పేర్కొన్నారు.
ఫిర్యాదులకు ఈ-బాక్స్
ప్రతి డిపోలో ఈ–బాక్స్ ఏర్పాటు చేస్తారు. ఉద్యోగుల సమస్యలు, ఇంక్రిమెంట్లు, డ్యూటీ చార్టుల అంశం, జీతభత్యాలు, లీవ్‌లు, ప్రమోషన్లు, సీనియారిటీతోపాటు వినతులను, ఫిర్యాదులను, సలహాలు, సూచనలను ఈ-–బాక్స్(ఎంప్లాయీస్ బాక్స్) ద్వారా తెలియజేయవచ్చు. ఇది కంప్యూటర్‌తో లింక్ అయి ఉంటుంది. ప్రతి రోజు ఈబాక్స్ ఓపెన్ చేస్తారు. ఆ లెటర్ అధికారులకు చేరిందో లేదో తెలుసుకునేలా ప్రణాళిక రెడీ చేశారు. ఎవరైతే లెటర్స్ రాశారో వారి పేర్లను రోజువారీగా నోటీస్ బోర్డుపై పెడతారు. దీని ద్వారా సమస్య అధికారుల దృష్టికి వెళ్లినట్లు తెలుస్తుంది. సమస్యలను డిపో పరిధిలోనే పరిష్కరిస్తారు. అక్కడ పరిష్కారం కాకపోతే రీజియన్, జోన్, కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్తారు. ఎంప్లాయీస్ బాక్స్ విధానం ఇప్పటికే సూర్యాపేట జిల్లాలో అమవుతోంది. జిల్లా కలెక్టర్ అమయ్‌కుమార్ ఈ పద్ధతిని తీసుకొచ్చారు. దీన్ని ఉద్యోగులే కాక జిల్లా ప్రజలందరూ ఉపయోగించుకోవచ్చు. ఈ సిస్టమ్ విజయవంతంగా అమలు చేస్తుండటంతో ఇప్పుడు ఆర్టీసీలో తీసుకొచ్చారు.
ఎప్పటికప్పుడు మీటింగ్స్..
వారానికి ఒకసారి డిపో మేనేజర్లు, ఎంప్లాయీస్ వెల్ఫేర్ బోర్డు సభ్యులు, సూపర్‌వైజర్స్ కలిసి సమావేశమై సమస్యలపై చర్చిస్తారు. ప్రతి నెలకోసారి రీజియన్ స్థాయిలో డివిజనల్ మేనేజర్, బోర్డు మెంబర్స్ సమావేశమై రీజియనల్ స్థాయి సమస్యలపై మాట్లాడతారు. గ్రేటర్ హైదరాబాద్ జోన్‌లో రెండు నెలలకోసారి మీటింగ్ ఉంటుంది. బస్ భవన్లో మూడు నెలలకోసారి బోర్డు మెంబర్స్, ఎండీ, ఈడీలు సమావేశమై రివ్యూ చేస్తారు. సమస్యల పరిష్కారంలో డివిజనల్ మేనేజర్, డిప్యూటీ చీఫ్ పర్సనల్ మేనేజర్ కీలకపాత్ర పోషిస్తారు.