ఏండ్ల నుంచి ఖాళీగా ఆర్టీసీ జాగలు.. లీజుకు ఇచ్చేందుకు మేనేజ్మెంట్​ వెనుకడుగు

ఏండ్ల నుంచి ఖాళీగా ఆర్టీసీ జాగలు.. లీజుకు ఇచ్చేందుకు మేనేజ్మెంట్​ వెనుకడుగు
  • ప్రత్యామ్నాయ ఆదాయాన్ని పట్టించుకోని సంస్థ
  • ఆర్టీసీ చేతిలో రూ.50 వేల కోట్ల విలువైన భూములు
  • ఆర్మూర్​లో సంస్థ జాగాలో ఎమ్మెల్యే మల్టీప్లెక్స్

హైదరాబాద్, వెలుగు : నష్టాలు, అప్పులతో సతమతమవుతున్న ఆర్టీసీకి ప్రత్యామ్నాయ ఆదాయ వనరులు ఉన్నా వినియోగించుకోవడం లేదు. కార్పొరేషన్​కు కోట్ల రూపాయల విలువైన జాగాలు ఉన్నా.. కనీసం వాటిని లీజుకు కూడా ఇవ్వడం లేదు.  రాష్ట్ర వ్యాప్తంగా బస్టాండ్లు, డిపోలు, వర్క్ షాపులు, టైర్ రీట్రేడింగ్ సెంటర్​లు, మియాపూర్ బస్ బాడీ యూనిట్.. ఇలా అన్ని భూముల విలువ కలిపి రూ.50 వేల కోట్ల పైనే ఉంటుందని అంచనా. కానీ ఏండ్ల నుంచి ఈ జాగాలు ఖాళీగానే ఉంటున్నాయి. దీంతో సంస్థ పెద్ద మొత్తంలో రెవెన్యూ నష్టపోతున్నది.

జిల్లాల్లో అధికార పార్టీ నేతల కన్ను

ఆర్టీసీకి ఉన్న కోట్ల విలువైన భూములపై అధికార పార్టీ నేతల కన్ను పడింది. జిల్లాల్లో ఆర్టీసీ స్థలాలను తక్కువ ధరకు లీజుకు తీసుకొని వాటిలో మల్టీప్లెక్స్​లు, షాపింగ్ కాంప్లెక్స్​లు కడుతున్నారు. ప్రతి ఏటా లీజు అమౌంట్ కూడా ఇన్ టైమ్ లో చెల్లించడం లేదని తెలుస్తున్నది. అధికారులు కూడా లీజు అమౌంట్​ను అడిగేందుకు వెనుకడుగు వేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్​ లో ఆర్టీసీ భూముల్లో స్థానిక ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి భారీ స్థాయిలో షాపింగ్ కాంప్లెక్స్, మల్టీప్లెక్స్ నిర్మించారు. ఇక వరంగల్​లోని ఖమ్మం హైవేపై ఉన్న ఆర్టీసీ టైర్ రీట్రేడింగ్ స్థలాన్ని స్థానిక ఎంపీ పసునూరి దయాకర్  లీజుకు తీసుకున్నారు. ఇక్కడ కూడా పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

హైదరాబాద్​లోనే ఎక్కువ స్థలాలు

ఆర్టీసీ హెడ్ ఆఫీస్ ఉన్న బస్ భవన్ పక్కన మెయిన్ రోడ్​పై తొమ్మిది ఎకరాల ఖాళీ స్థలం ఉంది. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న టైమ్ లో ఇక్కడ మల్టీప్లెక్స్, షాపింగ్ కాంప్లెక్స్ కట్టేందుకు ఓ ప్రైవేట్ కంపెనీకి లీజుకు ఇచ్చారు. ఆ కంపెనీ నిర్మాణం చేయకపోవడంతో ఆ అగ్రిమెంట్ క్యాన్సిల్​ అయింది. అప్పటి నుంచి ఈ జాగా ఖాళీగా ఉంటున్నది. ఈ స్థలాన్ని లీజుకు ఇస్తే వందల కోట్ల ఇన్​కమ్​ ఆర్టీసీకి వస్తుంది. అయితే, దాన్ని లీజుకు ఇవ్వకుండా ప్రభుత్వ పెద్దలే అడ్డుపడుతున్నట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతున్నది. అలాగే, మూసివేసిన మియాపూర్ బస్ బాడీ యూనిట్ స్థలం కూడా ఎంతో విలువైనది. ఈ జాగాను రాంనగర్ ఫిష్ మార్కెట్ విస్తరణకు ఇస్తామని ఇటీవల అసెంబ్లీలో మంత్రి కేటీఆర్  ప్రకటించారు. దీనిపై ఆర్టీసీ అధికారులు ఫైర్ అవుతున్నారు.

ఎంఐఎంకు సీబీఎస్ హ్యాంగర్ జాగా!

సిటీలో ఎంజీబీఎస్ ఎదురుగా ఉన్న సీబీఎస్ హ్యాంగర్ శిథిలావస్థకు చేరుకున్నదని అధికారులు 2018లో కూల్చి వేశారు. అక్కడ కింద ఆర్టీసీ బస్టాండ్, పైన హోటల్ రూమ్​లు, షాపింగ్ క్లాంప్లెక్స్ నిర్మిస్తామని ప్రకటించారు. కానీ, ఐదేండ్లు గడిచినా ఎటువంటి నిర్మాణం చేపట్టలే దు. తాజాగా ఈ జాగాపై ఎంఐఎం నేతల కన్ను పడిందని తెలుస్తున్నది. ప్రభుత్వంలో మిత్ర పక్షంగా ఉన్న ఆ పార్టీ నేతలకు ఈ జాగాను అప్పగించేందుకు ప్రభుత్వ పెద్దలు ప్లాన్ చేస్తున్న ట్లు ఆర్టీసీ అధికార వర్గాల్లో చర్చ నడుస్తున్నది.  

ప్రభుత్వానికి తెలిసినా చర్యలు తీసుకోవట్లే 

రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆర్టీసీ బాగుపడుతుందనుకుంటే ఇంకా నిర్వీర్యం అవుతున్నది. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ ప్రభుత్వానికి తెలిసినా చర్యలు తీసుకోవడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీకి  వేల కోట్ల భూములు ఉన్నాయి. జిల్లాల్లో పార్టీల నేతలకు లీజుకు ఇస్తున్నరు. హైదరాబాద్​లో విలువైన భూములు ఉన్నా లీజుకు ఇవ్వడం లేదు. ప్రభుత్వం ఆదుకుంటే తప్ప ఆర్టీసీ ముందుకు పడదు. 

- ఆర్టీసీ రిటైర్డ్ ఈడీ

ప్రభుత్వం పాలసీ తెచ్చి నిర్మాణాలు చేయాలి..

ఆర్టీసీ జాగాలను లీజుకు ఇవ్వడం కంటే ప్రభుత్వ తోడ్పాటుతో లేదా పీపీపీ పద్ధతిలో నిర్మాణాలు చేసి అద్దెకు ఇవ్వాలి. 33 ఏండ్లు లీజుకు ఇస్తే వాటిని తిరిగి తీసుకునే క్రమంలో లీగల్ సమస్యలు వస్తున్నాయి. ప్రభుత్వ ఒత్తిడి, పొలిటికల్ నేతల వల్ల స్వాధీనం చేసుకోలేకపోతున్నారు. ఖాళీగా ఉన్న జాగాలపై గవర్నమెంట్ ఓ పాలసీ తీసుకురావాలి. ఆర్టీసీ అనుమతి లేకుండా వాటిలో ఏ నిర్మాణాలు చేయకుండా చూడాలి.

  -  వీఎస్ రావు, ఎస్​డబ్ల్యూఎఫ్​ జనరల్ సెక్రటరీ