
- రిక్టర్ స్కేలుపై అత్యధికంగా7.4 తీవ్రత నమోదు
మాస్కో: రష్యాను భూకంపం వణికించింది. గంట వ్యవధిలోనే ఐదు సార్లు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై అత్యధికంగా 7.4 తీవ్రత నమోదైంది. ఆదివారం తెల్లవారుజామున భూకంపం సంభవించిందని యూనైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (యూఎస్జీఎస్) ప్రకటించింది. పసిఫిక్ సముద్ర తీర ప్రాంతంలోనే భూమి కంపించిందని తెలిపింది. ఈ నేపథ్యంలో రష్యాలోని కమ్చట్కా ఐలాండ్‌కు, హవాయిలోని కొన్ని ప్రాంతాలకు ‘పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం’ సునామీ హెచ్చరికలు జారీ చేసింది.
భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని స్థానిక అధికారులు ప్రకటించారు. సునామీ హెచ్చరికల నేపథ్యంలో తీర ప్రాంతాల ప్రజలను ముందు జాగ్రత్త చర్యలో భాగంగా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు ఆదేశించారు.
నాలుగు భూకంప కేంద్రాలు భూమి పైనుంచి సుమారు 10 కిలో మీటర్లలోతులోనే ఉన్నట్లు వివరించారు. 7.4 తీవ్రతతో భూమి కంపించినప్పుడు మాత్రం దాని కేంద్రం 20 కిలో మీటర్ల లోతులో గుర్తించారు. రిక్టర్‌స్కేలుపై 6 తీవ్రత ఉన్నంత వరకు ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. ఎప్పుడైతే తీవ్రత 7 దాటిందో అప్పుడు తీర ప్రాంత ప్రజలను అలర్ట్ చేశారు.