
తిరుమల: భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు టీటీడీ మరో కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. భక్తుల అభిప్రాయాల తెలుసుకునేందుకు కొత్తగా వాట్సాప్ ఫీడ్‌బ్యాక్ విధానం తీసుకొచ్చింది. ఇకపై భక్తులు తమ అభిప్రాయాన్ని వాట్సాప్ ద్వారా సులభంగా తెలియజేయవచ్చు.- తిరుమల, తిరుపతిలో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్‌లను మొబైల్‌తో స్కాన్ చేస్తే.. వాట్సాప్‌లో టీటీడీ అభిప్రాయ సేకరణ పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ భక్తులు తమ పేరు, విభాగం (అన్నప్రసాదం, శుభ్రత, కల్యాణకట్ట, లడ్డూ ప్రసాదం, లగేజీ, దర్శన అనుభవం, క్యూలైన్, గదులు మొదలైనవి)ను ఎంచుకోవాలి.
అనంతరం అభిప్రాయం తెలిపేందుకు టెక్స్ట్ లేదా వీడియో ఫార్మాట్‌ను ఎంచుకోవచ్చు. సేవా ప్రమాణాన్ని ఉత్తమం, సగటు/మరింత మెరుగుదల అవసరం, లేదా బాగాలేదుగా రేటింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. భక్తులు తమ అభిప్రాయాన్ని గరిష్టంగా 600 అక్షరాల పరిమితిలో టైప్ చేయవచ్చు లేదా వీడియోగా అప్‌లోడ్ చేయవచ్చు. ఫీడ్ బ్యాక్ సమర్పించిన వెంటనే, “మీ అభిప్రాయం విజయవంతంగా నమోదు చేయబడింది. మీ విలువైన ఫీడ్‌బ్యాక్‌కు ధన్యవాదాలు” అనే ధృవీకరణ సందేశం వస్తుంది.
Also Read : తిరుమలలో ఇవాల్టి నుంచి బ్రేక్ దర్శనాలు బంద్
భక్తుల నుండి అందిన అభిప్రాయాలను టీటీడీ యాజమాన్యం పరిగణనలోకి తీసుకుని సేవల ప్రమాణాన్ని పెంచేందుకు తగిన చర్యలు తీసుకుంటుంది. వాట్సప్ ఫీడ్ బ్యాక్ విధానం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధానం ద్వారా తమ సమస్యలను నేరుగా చెప్పుకునే అవకాశం ఉంటుందని.. ఇది మంచి విధానమని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరీ భక్తుల నుంచి స్వీకరించిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా అధికారులు చర్యలు తీసుకుంటారో లేదా మునుముందు చూడాలి.