శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. టికెట్లు విడుదల

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. టికెట్లు విడుదల

తిరుమల శ్రీవారి ఆన్ లైన్ ఆర్జిత సేవా టిక్కెట్స్  రేపు(జూన్ 19)  విడుదల కానున్నాయి.సెప్టెంబర్ నెలకు సంబంధించిన కోటాను టీటీడీ అధికారులు విడుదల చేయనున్నారు. జూన్ 19వ తేదీ నుంచి 21 వ తేదీ ఉదయం 10 గంటల వరకు టిక్కెట్స్ బుక్ చేసుకోవచ్చని ఆలయ సిబ్బంది తెలిపారు. సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవల టికెట్ల కోసం లక్కీ డిప్ ద్వారా ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో నమోదుకు అవకాశముంటుందని వెల్లడించారు.

సేవా టికెట్లు విడుదల 

జూన్ 22న కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల సేవ, సహస్ర దీపాలంకరణ, వర్చువల్ సేవా కోటా టికెట్లను విడుదల చేయనున్నారు. జూన్ 22న  మధ్యాహ్నం 3 గంటలకు ఆన్ లైన్ లో ఈ టికెట్లు విడుదల కానున్నాయి.  జూన్ 23న ఉదయం 10 గంటలకు సెప్టెంబర్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్లు విడుదలవుతాయి. జూన్ 22న ఉదయం 10 గంటలకు శ్రీవారి పవిత్ర ఉత్సవాల సేవా టికెట్లు రిలీజ్ చేస్తారు.  ఆగస్టు 27 నుంచి 29వ తేదీ వరకు ఈ పవిత్రోత్సవాలు జరుగుతాయి.  

భక్తుల రద్దీ

మరోవైపు తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వీకెండ్ కావడంతో శ్రీవారి దర్వనానికి భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు. సర్వదర్శనం భక్తులతో అన్ని కంపార్ట్ మెంట్ లు నిండిపోయాయి. కంపార్ట్ మెంట్ బయట రెండు కిలో మీటర్ల మేర క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 30 గంటల సమయం పడుతోంది. ఇక టైమ్ స్లాట్ టోకెన్, నడకదారి దివ్యదర్శనం భక్తులకు సుమారు 5 గంటల సమయం పడుతోంది. రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది.

శనివారం(జూన్ 17) తిరుమల శ్రీవారిని 87,762 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారికి రూ. 3.61 కోట్లు హుండీ ఆదాయం లభించింది.  43,753 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.