తిరుమల శ్రీవారి పరాభనామ పంచాంగం విడుదల

తిరుమల శ్రీవారి పరాభనామ పంచాంగం విడుదల

ప్రతి ఏటా.. ప్రతి సంవత్సరం ఉగాది పర్వదినం.. తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పంచాంగం విడుదల చేయటం ఆనవాయితీ. ఇందులో భాగంగానే.. 2026, ఫిబ్రవరి 28వ తేదీన రాబోయే పరాభవ నామ సంవత్సరం పంచాగాన్ని ఆవిష్కరించారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. టీటీడీ ఈవో, అదనపు ఈవోతోపాటు బోర్డు సభ్యుల సమక్షంలో టీటీడీ 2026 పంచాంగాన్ని విడుదల చేశారాయన. 

శ్రీవారి దయతో.. శ్రీవారి ఆశీర్వాదంతో పరాభనామ సంవత్సరం అందరికీ అంతా మంచే జరగాలని.. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాక్షించారు చైర్మన్ నాయుడు. ప్రతి ఏటా ఉగాదికి తిరుమల ఆధ్వర్యంలో కొత్త పంచాంగం విడుదల చేయటం ఆనవాయితీ అని.. ఈ ఏడాది కూడా అదే విధంగా పంచాంగాన్ని విడుదల చేస్తున్నట్లు స్పష్టం చేశారాయన. 

పరాభవ నామ సంవత్సర పంచాంగాన్ని రచించిన టీటీడీ ఆస్థాన సిద్ధాంతి  తంగిరాల వేంకటకృష్ణ పూర్ణ ప్రసాద్‌ సిద్ధాంతికి.. సహకరించిన వైఖాన సాగమ పండితులు ఆచార్య వేదాంతం విష్ణుభట్టాచార్యులు అభినందనలు తెలియజేశారు. అందరికీ అర్థమయ్యేలా.. అందరూ సులభంగా అర్థం చేసుకునేలా పంచాంగం ఉందన్నారాయన. రాజాధి నవ నాయకుల ఫలితాలతోపాటు రాశి ఫలాలు, వధూవర గుణమేళనము, వివాహాది సుముహూర్త నిర్ణయాలు, టీటీడీలో నిర్వహించే విశేష ఉత్సవాల వివరాలు సైతం ఈ పంచాంగంలో ఉన్నాయని వెల్లడించారు అధికారులు. 75 రూపాయల- విలువ గల ఈ పంచాంగం తిరుమల, తిరుపతిలో భక్తులకు అందుబాటులో ఉంటుందని.. టీటీడీ సమాచార కేంద్రాల్లోనూ ఈ పంచాంగాన్ని కొనుగోలు చేయొచ్చని వివరించారు అధికారులు. 

పంచాంగం ఆవిష్కరణలో టీటీడీ బోర్డు స‌భ్యులు, అద‌న‌పు ఈవో వెంక‌య్య చౌద‌రి, జేఈవోలు వీరబ్రహ్మం, ఎ.శ‌ర‌త్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.