శ్రీవారి భక్తులకు గుడ్‌ న్యూస్‌: ఉచిత దర్శనాలు షురూ

శ్రీవారి భక్తులకు గుడ్‌ న్యూస్‌: ఉచిత దర్శనాలు షురూ

తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తులకు టీటీడీ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. కరోనా కారణంగా నిలిపేసిన సర్వ దర్శనాలను మళ్లీ ప్రారంభించాలని నిర్ణయించింది. ప్రతి నెలా ఆన్‌లైన్‌లో విడుదల చేస్తున్న రూ.300 టోకెన్లు నిమిషాల్లో అయిపోతుండడంతో భక్తులు ఎప్పటి నుంచో మళ్లీ నేరుగా వచ్చి సర్వ దర్శనం చేసుకునే వీలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవలే కృష్ణాష్టమి నాడు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ త్వరలోనే దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. వైద్య అధికారులు, జిల్లా కలెక్టర్‌‌తో మాట్లాడి కొద్ది మందికైనా మళ్లీ ఉచిత దర్శనాలు (సర్వ దర్శనం) కల్పించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ క్రమంలో బుధవారం (సెప్టెంబర్ 8) నుంచి మళ్లీ సర్వ దర్శనం టోకెన్ల జారీ మొదలు పెట్టబోతున్నట్టు టీటీడీ ఇవాళ ప్రకటించింది. బుధవారం ఉదయం 6 గంటలకు టోకెన్ల జారీ మొదలవుతుందని పేర్కొంది.

కండిషన్స్ అప్లై..

కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ప్రస్తుతానికి పరిమిత సంఖ్యలో మాత్రమే సర్వ దర్శనం టోకెన్ల జారీకి టీటీడీ నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి ఇకపై ప్రతి రోజూ 2 వేల చొప్పున సర్వ దర్శనం టోకెన్లు ఇస్తామని టీటీడీ అధికారులు తెలిపారు. అయితే ప్రస్తుతం అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్‌లో ఉన్న కౌంటర్లలో చిత్తూరు జిల్లాకు చెందిన వారికి మాత్రమే ప్రయోగాత్మకంగా టోకెన్లు జారీ చేస్తామని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ టోకెన్లు పొందేందుకు సహకరించాలని టీటీడీ విజ్ఞపి చేస్తోంది.