తిరుమల భక్తులకు అలర్ట్: సెప్టెంబర్ నెల శ్రీవారి దర్శన టికెట్లు, రూముల కోటా విడుదల.. పూర్తి వివరాలు ఇవే!

 తిరుమల భక్తులకు అలర్ట్: సెప్టెంబర్ నెల శ్రీవారి దర్శన టికెట్లు, రూముల కోటా విడుదల.. పూర్తి వివరాలు ఇవే!


తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని ప్లాన్ చేస్తున్నారా..? భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు, ఆర్జిత సేవలు, రూముల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. జూన్ 18వ తేదీ నుంచి జూన్ 24వ తేదీ లోపు ఏ రోజు ఏ కోటా విడుదల కానుందో భక్తుల కోసం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన వంటి ముఖ్యమైన సేవా టికెట్ల కోసం జూన్ 18న ఉదయం 10 గంటల నుండి జూన్ 20న ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో పేరు  రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లక్కీ డిప్‌లో టికెట్లు పొందిన వారు జూన్ 20 నుండి జూన్ 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు డబ్బులు కట్టి  టికెట్ కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది.

జూన్ 22న 
ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను విడుదల చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు (ఆన్‌లైన్ సేవలు), వాటికి సంబంధించిన దర్శన స్లాట్ల కోటాను విడుదల చేస్తారు.

జూన్ 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ, శ్రీవాణి ట్రస్ట్ - వృద్ధుల కోటా టోకెన్లు విడుదలవుతాయి. ఉదయం 11 గంటలకు  శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శన టికెట్ల కోటా విడుదల చేస్తారు.

మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు (వికలాంగులు), దీర్ఘకాలిక జబ్బులు ఉన్నవారి కోసం ఉచిత ప్రత్యేక దర్శన టోకెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతారు.

జూన్ 24న ఉదయం 10 గంటలకు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే  300 ప్రత్యేక ప్రవేశ దర్శన (Special Entry Darshan) టికెట్లను విడుదల చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు: తిరుమల, తిరుపతిలలో భక్తులు బస చేయడానికి అవసరమైన రూముల (గదుల) కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను 23న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.

ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. అలాగే తిరుమల, తిరుపతిల‌లో గదుల కోటాను 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

ముఖ్య గమనిక: భక్తులు శ్రీవారి దర్శన టికెట్లు, సేవా రశీదులు, రూములను కేవలం టీటీడీ అధికారిక వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని, నకిలీ వెబ్‌సైట్లను నమ్మి మోసపోవద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు.