కార్మిక హక్కుల పరిరక్షణకు పోరాటాలు చేద్దాం : టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షుడు కె.సూర్యం

కార్మిక హక్కుల పరిరక్షణకు పోరాటాలు చేద్దాం : టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షుడు కె.సూర్యం

ఆర్మూర్, వెలుగు : కార్మిక హక్కులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని, కార్మిక హక్కుల పరిరక్షణకు  పోరాటాలు చేద్దామని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా(టీయూసీఐ) రాష్ట్ర అధ్యక్షుడు కె.సూర్యం పిలుపునిచ్చారు. ఆర్మూర్​లో ఆదివారం టీయూసీఐ నిజామాబాద్ రూరల్, కామారెడ్డి సంయుక్త జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు ఎం.ముత్తన్న అధ్యక్షతన జిల్లాస్థాయి రాజకీయ శిక్షణ తరగతులు జరిగాయి. ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షుడు కె.సూర్యం, కార్యదర్శి పద్మ హాజరై మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి కార్మికులకు ఇచ్చిన  హామీలను అమలు చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. కార్మికులకు సరైన వేతనాలు లేక  తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ఔట్​ సోర్సింగ్​ పద్ధతిలో పనిచేసే కార్మికులకు సరైన వేతనాలు లేవన్నారు.

ప్రధాని మోదీ కార్మికులపై తన దాడిని ఎక్కు పెట్టారని, పెట్టుబడి దారి వర్గం సేవ కోసమే లేబర్ కోడ్స్ ను రద్దుచేసి, నాలుగు కార్మిక చట్టాలుగా మార్చి కార్మికుల కడుపు కొట్టారని విమర్శించారు. కార్మిక వర్గం విప్లవకార కార్మిక సంఘాల్లో సంఘటితమై తమ హక్కుల కోసం పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.రమేశ్, ఉపాధ్యక్షుడు వీవీ సత్యవ్వ, ఎ.ప్రకాశ్, సహాయ కార్యదర్శి ఎ.అనిస్, కోశాధికారి అరవింద్, జిల్లా నాయకులు ఎస్.కిశోర్, ఆర్.పుష్పలత, ఎ.ఆశన్న, ఎం.నశిర్, ఎన్.లక్ష్మి, జి.పద్మ, ఎం.సునీత తదితరులు పాల్గొన్నారు.